pizza
Prabhakar interview (Telugu) about Next Nuvve
నాలుగు పెద్ద బ్యానర్స్‌ కలయికలో చేసిన తొలి చిత్రానికి నేనే దర్శకుడిని కావడం నా అదృష్టం - ప్రభాకర్‌
You are at idlebrain.com > news today >
 
Follow Us

31 October 2017
Hyderabad

భారీ చిత్రాల నిర్మాణ సంస్థలైన గీతా ఆర్ట్స్‌, యు.వి.క్రియేషన్స్‌, స్టూడియో గ్రీన్‌ కలిసి వి4 క్రియేషన్స్‌ పేరుతో ఓ కొత్త చిత్ర నిర్మాణ సంస్థను స్థాపించారు. ఈ బేనర్‌పై 'నెక్స్‌ట్‌ నువ్వే' పేరుతో ఓ హార్రర్‌ ఎంటర్‌టైనర్‌ను నిర్మించారు. ఆది, వైభవి శాండిల్య, రష్మీ గౌతమ్‌, బ్రహ్మాజీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి టి.వి. యాంకర్‌, నటుడు ప్రభాకర్‌ దర్శకత్వం వహించారు. బన్ని వాసు నిర్మాత. నవంబర్‌ 3న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు ప్రభాకర్‌తో ఇంటర్వ్యూ విశేషాలు...

సినిమా ప్రారంభమైందిలా..
అల్లు అరవింద్‌గారు, జ్ఞానవేల్‌రాజా, వంశీ-ప్రమోద్‌, బన్నివాసు..ఇలా నలుగురు నిర్మాతలు కలిసి వీ4 క్రియేషన్స్‌ అనే బ్యానర్‌ను స్టార్ట్‌ చేసి ఆ బ్యానర్‌లో చేసిన తొలి చిత్రం 'నెక్స్‌ట్‌ నువ్వే'. ఈ చిత్రానికి నేను దర్శకుడిగా పనిచేయడం నిజంగా నా అదృష్టం. నేను బయట బ్యానర్‌లో శిరీష్‌గారితో ఓ సినిమా చేద్దామని అనుకుని, ఆయన అపాయింట్‌మెంట్‌ తీసుకుని వచ్చి కలిసి కథ చెప్పాను. కథ నచ్చడంతో, 'సినిమా చాలా ఫన్నీగా ఉంది. కాకుంటే నేను ఈ సినిమా చేయను. మనం ఈ సినిమాను నిర్మిస్తాం' అన్నారు. శిరీష్‌ తర్వాత ఈ కథను అరవింద్‌గారికి చెప్పమని అన్నారు. నేను తొలిసారి అరవింద్‌గారిని కలిశాను. ఆయనకు కథ చెప్పాను. నేను చెప్పేటప్పుడే ఆయన కథను ఎంజాయ్‌ చేశారు. అంతా విన్న ఆయన సెకండాఫ్‌ను ఇంకాస్త డెవలప్‌ చేస్తే బావుంటుందని అన్నారు. అందుకోసం ఒక రైటర్‌ని, ఒక ఇంచార్జ్‌ను ఇచ్చారు. నాకు రైటర్‌కు సరిగ్గా పొంతన కుదరలేదు. దాంతో కథ డెవలప్‌మెంట్‌ సరిగా కాలేదు. చివరకు అరవింద్‌గారిని కలిసి, 'నేనే కథను డెవపల్‌ చేసుకుంటాను సార్‌' అని అన్నాను. ఆయన సరేనన్నారు. ఆ సమయంలో ఈ కథను బన్నివాసుగారికి చెప్పమని అరవింద్‌గారు అన్నారు. బన్నివాసుగారిని కలిసి కథ చెప్పాను. 'కరుణాకరన్‌గారు కళ్లకు కట్టినట్లు కథను చెప్పారు..ఆ తర్వాత అంత బాగా మీరే కథను నెరేట్‌ చేశారు' అని బన్ని వాసుగారు చెప్పడంతో నాకు కాన్ఫిడెన్స్‌ వచ్చింది. అదే సమయంలో 'మన దగ్గర ఓ తమిళ సినిమా రీమేక్‌ రైట్స్‌ ఉంది. ఆ సినిమాను మీరే చేయాల'ని అన్నారు. దానికి నేను 'సార్‌..రీమేక్‌ ఎందుకండీ' అని అన్నాను. 'రీమేక్‌ చేసినా..ఉన్నది ఉన్నట్లు కాకుండా, మళ్లీ మన నెటివిటీలో రాసుకోవాలి. ముందు ఓసారి చూడండి' అని వాసుగారు అన్నారు. సినిమా చూసిన తర్వాత నాకు సినిమా బాగా నచ్చింది. 'కథ నచ్చింది సార్‌..కానీ నెటివిటీ ప్రకారం చాలా మార్పులు చేయాలి కాబట్టి సమయం పడుతుందండీ' అని నేను వాసుగారికి చెప్పాను. నేను ఒక్కడినే కూర్చొని కథ రాసుకోవడం మొదలుపెట్టాను. ఎడెనిమిది నెలలు సమయం పట్టింది. రైటర్‌ ఓంకార్‌గారి అబ్బాయి నిరూపమ్‌ సహకారం తీసుకున్నాను. తను కొన్ని సీన్స్‌ బాగా రాశాడు. అయితే రైట్స్‌ ప్రాబ్లమ్‌ అవుతుంది. సినిమాను ప్రస్తుతానికి ఆపేద్దామని ఓరోజు అన్నారు. ఏం చేయాలో అర్థం కాక..సరేసార్‌ అన్నాను. అయితే ఎప్పుడు స్టార్ట్‌ చేస్తారా? రోజు మెసేజ్‌లు పెట్టేవాడిని. సీరియల్స్‌లో చేయడం మానుకున్నాను. అప్పటికే రెండేళ్లు అయ్యింది. ఓ రోజు అయ్యప్ప దీక్షకు బన్నివాసుగారిని పిలిచాను. అయ్యప్ప కొండకు వెళ్లే ముందు కూడా రైట్స్‌ సమస్య క్లియర్‌ కాలేదని బన్ని వాసుగారు చెప్పారు. అయ్యప్ప దర్శనం అవగానే, సమస్య క్లియర్‌ అయినట్లు మెసేజ్‌ వచ్చింది. ఆ అయ్యప్ప స్వామియే, నాకు దారి చూపినట్టు అనిపించింది. అక్కడి నుండి వచ్చిన పదిహేను రోజులకు సినిమాను స్టార్ట్‌ చేశాం. హీరోగా ఎవరినీ అనుకుంటున్నారని అంటే, 'ఆదిని అడుగుదామని అనుకుంటున్నాను సార్‌' అని ఆదిని అప్రోచ్‌ అయ్యాను. సాయికుమార్‌, ఆదికి సినిమా చూపించి ఎక్కడెక్కడా చేంజస్‌ చేశారో చెప్పాను. తర్వాత సినిమా ప్రారంభం అయ్యింది.

కామెంట్స్‌కు వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు..
- సినిమా ఆగిపోయింది కదా..ఆ నిర్మాతలు ఇంతే ఇలాగే చేస్తారు..నువ్వొక పిచ్చోడివి, సమయం వృథా చేసుకున్నావు..అంటూ చాలా మంది చాలా రకాలుగా కామెంట్స్‌ చేశారు. కానీ నేను మాట్లాడే వాడిని కాదు. ఎందుకంటే ..అసలు నిజంగా ఏం జరిగిందో నాకు తెలుసు. ఏం జరిగిందో తెలియని వాడికి నేను వివరణ ఇవ్వాల్సిన అవసరం నాకు లేదనిపించింది. ఈ సినిమా స్టార్టింగ్‌లో వచ్చిన గ్యాప్‌లో ఈ బ్యానర్లోనే సినిమా చేయాలని, నేను వెయిట్‌ చేసేనే తప్ప, వేరే నిర్మాతలను వెళ్లి కలవలేదు. ఎందుకంటే, నాకు అవకాశం ఇస్తానని చెప్పిన బ్యానర్‌ చాలా పెద్దది కదా. అలాంటప్పుడు మరొకరి దగ్గరకి ఎలా వెళ్లగలను.

సింగిల్‌ షెడ్యూల్‌లోనే..
- సినిమానంతా సింగిల్‌ షెడ్యూల్‌లో పూర్తి చేశాను. మొత్తంగా చూస్తే, 36 రోజుల్లో పూర్తిచేశాం. హారర్‌ ఎలిమెంట్‌తో పాటు ఇది సస్పెన్స్‌ థ్రిల్లర్‌ మూవీ కాబట్టి రాత్రిళ్లు కూడా సినిమా షూటింగ్‌ చేశాం. లాంగ్‌ షెడ్యూల్స్‌ కాబట్టి ఆది, వైభవి, రష్మీ, బ్రహ్మాజీగారికి ఎక్కువ ఇబ్బంది అనిపించేది. ఈ నలుగురులో బ్రహ్మాజీగారైతే మూడు నాలుగు సినిమాలు చేసేవారు. రాత్రి రెండు వరకు షూటింగ్‌ అంటే ఆయనకు ఇబ్బందే అయినా, ఆయన బాగా కో ఆపరేట్‌ చేశారు. ఆయనకు ఇది లైఫ్‌ టైమ్‌ క్యారెక్టర అవుతుందనే నమ్మకం ఉంది. బ్రహ్మాజీగారు సీనియర్‌ అని, నేను జూనియర్‌ అని కాకుండా సినిమాకు ఏం చేయాలో దాని పరంగా నాకు సహకారం అందించారు. మా ఇద్దరికీ వేవ్‌లెంగ్త్‌ బాగా కుదిరింది.

సీరియల్స్‌ ఆపలేదు..
- నేను సీరియల్స్‌ను ఆపలేదు. బ్రేక్‌ ఇచ్చానంతే. అందుకు కారణం సినిమాలు చేయడం కాదు. కొన్ని నెలలు క్రితం స్టార్‌ మా కోసం 'దేవుడు చేసిన పెళ్లి' అనే సీరియల్‌ స్టార్ట్‌ చేశాను. కానీ షూటింగ్‌కు రెండు రోజులు ముందుగా నా తమ్ముడికి బ్రెయిన్‌ స్ట్రోక్‌ వచ్చింది. తనే ఈ సీరియల్‌కు కెమెరామెన్‌. తనిప్పుడు ఐసియులో ఉన్నాడు. తన కండీషన్‌ అలా ఉన్నప్పుడు సీరియల్‌ చేయడం ఎందుకని బ్రేక్‌ ఇచ్చాను. నా తమ్ముడు కోలుకోగానే, మళ్లీ సీరియల్స్‌ చేస్తాను. సినిమాలు చేస్తే సీరియల్స్‌ చేయకూడదు. సీరియల్స్‌ చేస్తే సినిమాలు చేయకూడదని నేను అనుకోను. మెగాస్టార్‌ చిరంజీవిగారు, ఎన్టీఆర్‌గారు సినిమాల్లో చేస్తూనే టీవీ షోస్‌ చేశారు కదా.

హీరో, హీరోయిన్స్‌ గురించి..
- ఆదికి లైఫ్‌ టైమ్‌ క్యారెక్టర్‌ అని భావిస్తున్నాను. డిఫరెంట్‌ వేరియేషన్స్‌ ఉన్న క్యారెక్టర్‌ను చేయడం అంత సులుభం కాదు. అలాగే హీరోయిన్స్‌ వైభవి, రష్మీలు కూడా చక్కగా నటించారు.

తదుపరి చిత్రాలు..
- నా తదుపరి సినిమా మారుతిగారి ప్రొడక్షన్‌లో జరుగుతుంది. మారుతిగారు ఓసారి నన్ను కలిసి తన దగ్గర కథ ఉంది. అల్రెడి కన్నడలో హీరోగా నటించిన సుమంత్‌ శైలేంద్ర హీరోగా తెలుగులో చేయాలనుకుంటున్నారని, కాబట్టి నన్ను డైరెక్ట్‌ చేయమని అన్నారు. అయితే నేను అప్పటికే 'నెక్స్‌ట్‌ నువ్వే' చేస్తుండటంతో అరవింద్‌గారు, వాసుగారి పర్మిషన్‌ అవసరం అని చెప్పాను. సరేనని మారుతిగారు ..అరవింద్‌గారు, వాసుగారితో మాట్లాడారు. వారు పర్మిషన్‌ ఇచ్చిన తర్వాత మారుతిగారి సినిమా డైరెక్ట్ చేశాను. ఇప్పటికే సినిమా 75 శాతం చిత్రీకరణ పూర్తయ్యింది. ఔట్‌ అండ్‌ ఔట్‌ ఎంటర్‌టైనింగ్‌గా సాగే లవ్‌స్టోరీ. కథ, మాటలు మారుతిగారే రాశారు. నేను డైరెక్షన్‌ మాత్రమే చేశాను. అలాగే స్టూడియో గ్రీన్‌తో ఓ సినిమా కమిట్‌ అయ్యాను.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved