1 August 2019
Hyderabad
సినిమాల్లోకి రావాలని, గొప్పగా రాణించాలని చాలా మంది కలలు కంటుంటారు. అయితే వాటిని సాధించేది మాత్రం కొందరే. అందరిలానే చిన్నప్పటి నుండి హీరో కావాలని కలలు కన్నారు హీరో రూపేష్ కుమార్ చౌదరి.. కొందరిలాగానే పట్టుదలగా ఆ వాటిని నిజం చేసుకున్నారు. తనకెంతో ఇష్టమైన పోలీస్ ఆఫీసర్‌గా తొలి సినిమాలో నటిస్తున్నారు. తన ఆరాధ్య నటుడు విక్టరీ వెంకటేశ్ క్లాప్‌తోనే ఈ కథానాయకుడు సినిమా ప్రారంభం కావడంతో మరింత ఉత్సాహనిచ్చిందని అంటున్నారు హీరో రూపేశ్ కుమార్ చౌదరి. ఈయన హీరోగా మా ఆయి ప్రొడక్షన్స్ పతాకంపై శివకుమార్ బి. దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ '22'. సలోని మిశ్రా హీరోయిన్‌గా నటిస్తోంది. ఆగస్ట్ 2న ఈ చిత్రం హీరో రూపేష్ కుమార్ చౌదరి పుట్టినరోజు. ఈ సందర్భంగా హైదరాబాద్ దసపల్లా హోటల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హీరో రూపేష్ కుమార్ చౌదరి మాట్లాడుతూ..
మీ నేపథ్యం గురించి?
- మాది బిజినెస్ ఫ్యామిలీ. నేను కూడా మా నాన్నగారికి సపోర్ట్‌గా ఉండి బిజినెస్ చూసుకునేవాడ్ని. కానీ నాకు యాక్టింగ్ మీద ఉన్న ఇంట్రెస్ట్‌తో కొన్ని ప్రయత్నాలు చేయడం జరిగింది. కానీ కుదరలేదు. ఆ ప్రాసెస్‌లో ఆనీ మాస్టర్ శివగారిని పరిచయం చేశారు. అలా ఇద్దరం కలిసి ఒక వెబ్ సిరీస్ చేశాం. అది ఇప్పుడు బిజినెస్ ప్రాసెస్‌లో ఉంది. ఆ వెబ్ సిరీస్ తర్వాత సినిమా కూడా చేయగలను అని కాన్ఫిడెంట్ రావడంతో డిస్కస్ చేసుకుని సినిమాను స్టార్ట్ చేశాం
షూటింగ్ ఎలా జరుగుతుంది?
- షూటింగ్ చాలా బాగా జరుగుతోంది. ప్రస్తుతం కొన్ని ఛేజింగ్ సీన్స్ చేస్తున్నాం.
ఈసినిమాలో మీ క్యారెక్టర్ గురించి చెప్పండి?
- సినిమాలో నేను రుద్ర అనే ఇన్‌స్పెక్టర్ క్యారెక్టర్ చేస్తున్నాను. నాకు చిన్నప్పటి నుండి పోలీస్ రోల్ అంటే చాలా ఇష్టం. ఆ అవకాశం నాకు ఫస్ట్ సినిమాకే వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. శివగారు తనెంతో నమ్మి రాసుకున్న స్టోరిని నాకు ఇచ్చినందుకు ఆయనకి థాంక్స్. ఆ క్యారెక్టర్‌కి పూర్తి న్యాయం చేస్తానని అనుకుంటున్నాను.
పోలీస్ క్యారెక్టర్ అంటే ఇష్టం అన్నారు కదా! దానికి ఏమైనా ఇన్‌స్పిరేషన్ ఉందా?
- నార్మల్‌గానే నాకు పోలీసులంటే చాలా ఇష్టం. ఇప్పుడు ఆ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు ఆ ఇష్టం మరింత పెరిగింది. 'టెంపర్' మూవీలో ఎన్టీఆర్‌గారు పోషించిన క్యారెక్టర్ అంటే చాలా ఇష్టం. ఆ పాత్రకి ఆయన ప్రాణం పోశారు. అలాగే పవర్‌స్టార్ 'గబ్బర్‌సింగ్'తో పాటు కొన్ని క్యారెక్టర్స్‌ని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకున్నాను.
పోలీస్ ఆఫీసర్‌గా కనిపించడానికి ప్రత్యేకంగా ఏమైనా శిక్షణ తీసుకున్నారా?
- చిన్నప్పటి నుండి నాకు జిమ్ చేసే అలవాటు లేదు. నార్మల్‌గా వాకింగ్, యోగా చేసేవాడ్ని. నాలుగైదు నెలలుగా ఈ క్యారెక్టర్ కోసం రెగ్యులర్‌గా జిమ్ చేస్తున్నాను. అలాగే డ్యాన్స్‌లు, ఫైట్స్ కూడా ప్రాక్టీస్ చేశా.
యాక్టింగ్‌లో ఎవరిదగ్గరైనా శిక్షణ తీసుకున్నారా?
- ఎంతోమంది స్టార్ హీరోలకు నటనలో శిక్షణ ఇచ్చిన వైజాగ్ సత్యానంద్‌గారి వద్ద రెండు సంవత్సరాలు యాక్టింగ్‌లో శిక్షణ పొందాను. ఇప్పుడు ఈ పోలీస్ క్యారెక్టర్ కోసం బాలుగారి వద్ద శిక్షణ తీసుకుంటున్నాను.
శివ దర్శకత్వం గురించి?
- చాలా బాగుంది. ఒక డైరెక్టర్‌గానే కాకుండా ఒక ఫ్రెండ్‌లా, బ్రదర్‌లా దగ్గరుండి అన్నీ చూసుకుంటున్నారు. స్క్రిప్ట్‌మీద ఆయనకి చాలా క్లారిటీ ఉంది. ఈ సినిమా కోసం చాలా కష్టపడుతున్నారు. మా యూనిట్ పడుతున్న కష్టం రేపు సినిమా రిలీజయ్యాక ప్రతి ఒక్కరికీ తెలుస్తుంది.
మీరు వెంకటేష్ ఫ్యాన్ అని చెప్పారు కదా? మీ చిత్రం ప్రారంభోత్సవానికి ఆయన క్లాప్ కొట్టడం మీకెలా అన్పించింది?
- అంతకు ముందు రోజు బి.ఎ.రాజుగారు ఫోన్ చేసి, రేపు క్లాప్ కొట్టడానికి వెంకటేష్‌గారు వస్తున్నారు అని చెప్పారు. ఆ రాత్రి నాకు నిద్రపట్టలేదు. నా తొలి చిత్రానికే విక్టరీ వెంకటేష్‌లాంటి స్టార్ హీరో క్లాప్ కొట్టడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. అలాగే ఆ వేడుకకి హీరో సాయితేజ్‌తో పాటు అంతమంది గెస్ట్‌లు వచ్చి మా యూనిట్‌కి బ్లెస్సింగ్స్ ఇవ్వడం నిజంగా మా అదృష్టం. అందుకు నేను బి.ఎ.రాజుగారికి ప్రత్యేకంగా థాంక్స్ తెలియజేస్తున్నాను.
'22' టైటిల్ గురించి?
- ఈ సినిమా కథ అంతా 22 మీదే రన్ అవుతుంది. చాలా ట్విస్ట్‌లు, టర్న్‌లు ఉంటాయి. అవి ఇప్పుడే రివీల్ చేస్తే ఆ థ్రిల్ ఉండదు. సినిమా చూస్తున్నప్పుడే దాన్ని ఎంజాయ్ చెయ్యాలి.
హీరోయిన్, మిగితా ఆర్టిస్ట్‌ల గురించి?
- మా సినిమాలో 'ఫలక్‌నుమాదాస్' చిత్రంలో నటించిన సలోని మిశ్రా హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే 'హార్ట్ ఎటాక్' విలన్ విక్రమ్ జిత్ విలన్‌గా నటిస్తున్నారు. జయప్రకాష్, రాజేశ్వరి నాయర్, పూజ రామచంద్రన్, రవివర్మ ఇలా మంచి పేరున్న ఆర్టిస్ట్‌లు, టెక్నీషియన్స్ ఈ సినిమా కోసం పని చేస్తున్నారు.
ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ గురించి?
- 'ఖైది నంబర్ 150', 'బాహుబలి', 'సాహో' వంటి చిత్రాలకు ఫైట్స్ కంపోజ్ చేసిన జాషువా మాస్టర్ ఈ సినిమాలో కథకి అనుగుణంగా అత్యద్భుతమైన యాక్షన్ సీక్వెన్స్ కంపోజ్ చేస్తున్నారు. ఆ యాక్షన్ ఎపిసోడ్స్ కోసం కుంగ్‌ఫూ, మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకుంటున్నాను.
కొత్త కథలేమైనా వింటున్నారా?
- లేదండీ...నా ఫుల్ ఫోకస్ `22` పైనే ఉంది. పూర్తిస్థాయిలో కాన్‌సన్‌ట్రేషన్‌తో ఉన్నాను. అసలు మరో కథ, సినిమాలు ఇలాంటి ఆలోచనలే లేవు. మంచి హీరోగా పేరు తెచ్చుకోవాలనేదే నా కోరిక అంటూ ఇంటర్వ్యూ ముగించారు హీరో రూపేష్ కుమార్ చౌదరి.