pizza
గానకులపతి శ్రీపతి
a tribute to SPB by Srinivas Kanchibhotla
You are at idlebrain.com > news today >
 
Follow Us

25 September -2020
Hyderabad

ప్రవృత్తిని వృత్తిగా మార్చుకున్న వారిలో కాలంతో పాటు సన్నిగిల్లే అంశాలలో కొన్ని - ఆశక్తి, అనురక్తి, అభిరుచి, అభిమానం, తపన, తపస్సు, ఉత్సాహము, ఉత్సుకత. ఐదు పదుల పైబడి తను ఎంచుకున్న బాటలోనే చిరంతనంగా సంచరించినా, బాలు ఇందుకు అతీతుడు!

మనుగడ కోసం నిరంతరం పది మందిలో మసలి, పది మందితో వ్యవహారాలు నడిపే వారెవరికైన వద్దన్నా అంటుకునే జబ్బులు కొన్ని - అసహనం, కోపం, చిరాకు, చిన్న చూపు, పరుష సంభాషణ. ఎగబాకే నిచ్చెనల కంటే పడదోసే పాములే ఎక్కువగా ఉండే రంగంలో ఉంటూ కూడా చివరి వరకూ నలుగురి చేత మంచే అనిపించుకున్న బాలు ఇందుకు అతీతుడు!

నిత్యం నూతనత్వం కోసం వెంపర్లాడిపోయే విచిత్రమైన సీమలో బ్రతుకు పందెంలో వెనక బడిపోయే కారణలలో కొన్ని - స్ఫురణ, గ్రహణ, ధారణ. తరాలు మారినా, తారలు మారిన, పలుకు మారినా, పలుకుబళ్ళు మారినా, వరసలు మారినా, వెసులుబాటులు మారినా ఎటువంటి కష్ట, క్లిష్ట, పదభూయిష్టమైన పదాలకైన ఏకైక చిరునామాగా మనగలిగిన బాలు ఇందుకు అతీతుడు!

పాత నీరు కొత్త నీరు, పాత రోత కొత్త మోత, పాత మాపు కొత్త మెరుపు వంటి ప్రకృతి ధర్మాలకు ఊతం ఇచ్చే గుణలు కొన్ని - అసూయ, అభద్రత, ఓర్వలేనితనం, ఈర్ష్య, ఈసడింపు, ఏవగింపు. అవకాశాలు తనకు దూరం జరిగినా, నాణ్యత అవసరం కొత్త తరానికి లేదని తెలుసుకొన్నా, తనకు ఇష్టమైన పాటని వదలక, వేదికను మార్చుకుని మరో మలుపు తీసుకున్న బాలు ఇందుకు అతీతుడు!

ఇంచు మించు అవే శక్తి సంపదలు ఉన్నవారు పోటీ పడుతున్న ఏ రంగంలో అయినా అత్యున్నత స్థానాన్ని చేరుకోవాలంటే ఉండాల్సిన లక్షణలు - అందిపుచ్చుకునే వరం, తరుముకు వచ్చే అవకాశం, ఈ రెంటినీ వడిసిపట్టుకోగల చాకచక్యం. అదృష్టం అనే మిశ్రమంలో సమయం, అవకాశాలే కావు, ఎక్కువ పాళ్ళలో ప్రతిభ కూడా కలిసి ఉంటుంది. ప్రతిభ తక్కువైతే అవకాశం సమయం ఉన్నంత వరకే ఉంటుంది, అదే ప్రతిభ ప్రభ వెలుగుతున్నంత కాలం అవకాశం సమయం వచ్చినప్పుడల్లా తలుపు తడుతూనే ఉంటుంది. అందుకు బాలు జీవితమే ఒక నిదర్శనం.

కాల ప్రవహానికి తలవంచడం ఏ కళాకారుడికైనా తప్పింది కాదు, బాలుకీ తప్పలేదు. నేపధ్య సంగీతంలో ఒక పిల్ల గాలిలా, ఒక యువ కెరటంగా మొదలై రెండున్నర దశబ్దాల కాలంలో మరో పేరు వినపడనీయనంతగా ఒక ప్రభంజంలా, ఒక పెను కెరటంలా అన్ని భాషలలో విస్తరించుకుపోయిన బాలు ఉధృతి 90వ దశకం చివరి నుండి తగ్గక మానలేదు. ద్వాపర యుగ సంధిలో కృష్ణావతార సమాప్తి ఒక బోయవాడి తెలియనితనంతో జరిగినట్టు, ఏ ఆర్ రెహ్మాన్ రాక, అతని తదుపరి విజృంభణ, సంగీత దర్శకత్వంలో అతను తెచ్చిన విప్లవాత్మక మార్పులు, గాయకుల అవసరం తగ్గించి గొంతుకల అవసరం పెంచేలా చేసింది. గాయకుడి గొంతు మధురంగా ఉచ్చారణ స్పష్టంగా ఉండాలన్న నియమాలు తొలగిపోయి, ఎంత "తేడ" గా ఉంటే అంత ఆదరణ ఉంటుందన్న కొత్త యుగ ధర్మం వేళ్ళూనుకుంటున్న సమయం బాలు అవసరం పరిశ్రమ(లకి) తగ్గేలా చేసింది. అనారోగ్యం తో ఘంటసాల, కొత్తదనం పేరుతో మహ్మద్ రఫీకీ సైతం తప్పని వెనుకబాటుతనం, ఈ మాటు టెక్నాలజీ (సంగీత దర్శకుల/శ్రోతల అభిరుచి) పేరుతో బాలు వేగానికి కళ్ళెం వేసింది. ఏ కళాకారుడి కథలో అయినా ఈ విరామం ఒక తప్పని మలుపు. ఈ విరామాన్ని విరమణ చేసుకుని కథ నించి నిష్క్రమించే వారే అత్యధికులైతే, బాలు నేపధ్య బరువు బాధ్యతలు కొద్దిగా దించుకుని ఆచార్యుడిగా కొత్త అవతారం ఎత్తాడు. రెండున్నర దశాబ్దాల గానం ఒక ఎత్తైతే, కేవలం "పాడుతా తీయగా" అన్న ప్రతిభా వెలికితీత కార్యక్రమం అతని కళా జీవితానికి ఇంకో రెండున్నర దశాబ్దాలు కొత్త ఊపిరి పోసింది.

"పాడుతా తీయగా" కేవలం ఒక ప్రతిభా పురస్కార కార్యక్రమం కాదు, అది బాలు అంతరంగ ఆవిష్కార వేదిక. అప్పటి వరకూ తెర వెనకగానే అందరికీ గళ పరిచితుడుగా మసలిన తనను, "పాడుతా" బాలును తెర ముందుకు తెచ్చి, పాత తరానికి మరింత చేరువగా కొత్త తరానికి కాస్త దగ్గరగా చేసింది. ఇందుకు కారణం తను చెప్పే పాట వెనక శ్రమల ఉదంతాలూ, ఉపాఖ్యానాలూ, వ్యాఖ్యానాలూ, పాట పాడిన వారికిచ్చిన ప్రోత్సాహాలు కావు. "పాడుతా" బాలు లోని భాష ప్రియుడిని, భక్తుడిని, దాసుడిని ప్రపంచానికి పరిచయం చేసింది. పాటకు స్వరం మెట్టైతే, భాష ఆ మెట్టెక్కే పాదం. అటువంటి మెట్లు అలవోకగా ఎక్కుతూ ఎన్నో స్వర శిఖరలను అధిరోహించిన తనకు, తన స్వరానికి ఆలంబనగా నిలిచిన భాషకి ఇవ్వాల్సిన విలువ, గౌరవరం, మర్యాద సముచిత రీతిలో ఇచ్చిన సంస్కారవంతుడు. భాష పట్ల అతని ఇష్టం, మక్కువ, పిచ్చి "పాడుత" కార్యక్రమానికున్న బలమైన పునాదులు. ఇటువంటి కార్యక్రమాలు మరెందరో లబ్ద ప్రతిష్టులు నిర్వహించినా వీటి మధ్య "పాడుతా" కు బాలు అమర్చి పెట్టిన స్థానం ప్రత్యేకం. ఇక పాట విషయానికి వస్తే, అందమైన భాషకి సొబగైన బాణినీ తొడిగి చక్కని రీతిలో పిల్లలు పడుతున్నప్పుడు బాలుకు తన మానస పుత్రికి పెళ్ళి చేసి పల్లకి ఎక్కిస్తున్నంత సంబరం, తన గాన గోవిందుడి మధు మురళికి ప్రపంచం మైమరచిపోతుంటే ఆ పాట తన గొంతులో తొలిగా ఊపిరి పోసుకుని నేడు ఈ చిన్నారి స్వర తంత్రుల మీద తూగుటుయ్యాలూగుతూ అందరికీ ఆహ్లాదం పంచుతుంటే, సుమతీ శతక కర్త చెప్పిన నిజమైన సంతోషం తండ్రికి అప్పుడు కలుగుతుందన్న విషయం విశదపరిచే సంబరం. ఆ పాటలో ఇంకా ఏదో అందుకోవాలని, ఇంకా మరికాస్త జుర్రుకోవాలనే తనివి తీరని తపన బాలు మాటలో, హావభావాలలో ప్రస్ఫుఠంగా గోచరిస్తాయి. "పాడుతా" అతను పదవీ విరమణ పొందిన తరువాత తోచక ఎంచున్న వ్యాపకంగా కాదు. పాట అనేది రికార్డింగ్ స్టుడియోల అష్ట దిగ్బంధాల కట్టుబాట్ల మధ్య ఏ కొందరో మాత్రమే నిర్వహించే పవిత్రమైన కార్యంగా కాక, పాటకి పవిత్రత్ర ఎంత ముఖ్యమో అది అందరూ పాడుకోగలిగిన అవకాశమూ అంతే ముఖ్యమని తలిచి బంగారు పంజారాన్ని విడిపించి ప్రపంచం లోకి విడుదల చేసిన విశిష్టాద్వైతి బాలు.

ఈ భాష పట్ల మమకారం కేవలం తన మాతృ భాష అందే కాక, తనను సమానంగా (లేక మరింతగా) ఆదరించి ప్రోత్సహించిన తమిళం లోనూ, తమ వాడు కాకపోయిన తమ భాషకు పట్టం కట్టే ఎవరిననినా అందలం ఎక్కించి కూర్చే పెట్టే పెద్ద మనసున్న కన్నడం లోనూ, హిందీ, మళయాళం లోనూ, తను ఆయా భాషలలో చేసిన లెక్కకు మించిన కార్యక్రమాలు చెప్పకనే చెబుతాయి. దీనితో తెలుసుకునేది ఒకటే, అభిమానం అనేది - పాట అయినా, మాట మీదైన, స్వరం మీద అన్న - ఒక సంస్కారం. అది ఒక భాష మీద ఎక్కువగా ఒక దాని మీద తక్కువగా కనిపించదు. ఉచ్ఛారణ తెలుగులో తప్పు లేకుండా ఉండాలి అనుకున్నప్పుడు, అది బెంగలీ పాటైనా అదే నిబద్ధత, అదే ఆదరణ, అదే గౌరవం. చెట్టు పెద్దదైనా విత్తు చిన్నదే, పాట గొప్పదంటే దానికి మాటే మూలం, అన్నది బాలు అనుసరణీయ సూత్రం అనిపించక మానదు.

బాలు స్వర్ణ యుగంలో (1975-1995) ఏ పాటకైన బాలునే, ఏ పరిశ్రమ (దక్షిణాదిలో మరీ ముఖ్యంగా) లో చూసినా తనే, ఏ సంగీత దర్శకుడికైన తనే, ఏ తారకైన తనే, ఏ రసానికైన తనే, ఎటువంటి సందర్భానికైనా తనే. శాఖోపశఖలుగా విస్తరించుకుని పోయిన అతని విస్త్రుతి కింద విలవిలలాడిపోయిన గడ్డిపరికలు చేసిన అభియోగం, అతను ఉండగా ఇంకోరిని ఎవరినీ ఎదగనివ్వలేదని! పాట అద్భుతంగా పాడగలగడం వేరు, రికార్డింగ్ స్టూడియోలో, తోటి కళాకారుల సమక్షంలో, క్షణానికి సైతం విలువ కట్టే ఒత్తిడి సందర్భంలో, నేర్చుకున్న పాటను అతి తక్కువ సమయంలో, సంగీత దర్శకుడి ఊహకు (బాణీకు) అత్యంత చేరువగా, భాషకీ, భావానికీ ఎంతో విలువనిస్తూ, వీటన్నిటి మధ్యలో పాటౌచిత్యం చెడకుండా తనకు తోచిన కూర్పులు చేర్పులు చేస్తూ పాటకు కొత్త నగిషీలు దిద్ది అంద-వంతంగా అర్ధవంతంగా పాడగలిగిన వాళ్ళు మాత్రం ఆ కాలంలో, ఈ కాలంలో, ఏ కాలంలో అయినా బాలు తరువాతే! ప్రతిభ (పాట) ఒక్కటే ఉంటే సరిపోదు, మాట మంచిదైతే ఊరు మంచిదౌతుందన్న సామెతకు నిలువెత్తు తార్కాణం బాలు. 50 యేళ్ళ పాటు చిత్రాలు నిర్మించే పరిశ్రమలన్నిటిలో నిగర్విగా, అజాత శత్రుడిగా, వినయం, అణుకువతో ఉండి పని చేసిన వారిందరికీ ప్రీతి పాత్రుడిగా, సన్నిహితుడిగా, స్నేహితుడిగా పిలబడిన బాలు వ్యావహారిక జీవితం ఒక ఆదర్శ పాఠం.

ఇక బాలు పాట... ఏమి మొదలుపెట్టేది.... ఎక్కడ మొదలు పెట్టేది...

బాలు పాటలో ప్రత్యేకత మొదట తన కంఠానిది. ఎటువంటి జీర, నాసికా ప్రభావం లేని తేట గొంతు తనది. బరువు గొంతులో ఉండే గాంభీర్యం, లోతు లేకపోయినా బాలు గొంతుకి నీటి స్వభావం ఉంది, అది ఏ పాత్రలో పోస్తే అందులోకి ఇట్టే ఒదిగిపోగలదు. వయసు వార్ధక్యం వైపు లాక్కువెళ్ళిన, మనసుని ముకుతాడు వేసి వయసుకి వ్యతిరేకంగా ఈడ్చుకెళ్ళి, వయసు ఛాయలు ఏ మాత్రం గొంతు మీద పడినీయని నిత్య బాలుడు అతను. "చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో" అని గర్జించినా, "గోదారల్లె ఎన్నెట్టొ గోదరల్లే" అంటూ సాఫీగా సాగిపోవాలన్నా, "గుంటరి నక్కా డొక్కల చొక్క అమ్మో అనిపిస్తా" అని బెదరగొట్టినా, "అమ్మా! మన్ను తినంగనే చిచివునో ఆకుంటినో" అని మారం చేసినా, "యేతమేసి తోడినా యేరు ఎండదు" అని వేదంతిలా విరిచినా, "జాబిలంటి ఈ చిన్నదాన్ని చూడకుంటే నాకు వెన్నెలేది" అని బుజ్జగించినా.... ఆ గొంతులో పడితే స్వరం చివురిస్తుంది పాట పులకిస్తుంది. బాలు 50 యేళ్ళ పాటల ప్రస్థానంలో చేయని ప్రయోగాలు, చూడని పరిణామాలు (సాంకేతికంగా, సృజనాత్మకంగా), నడవని ఎత్తు పల్లాలు, ఏమీ లేవనే చెప్పాలి. అతని ప్రఙ్ఞకు కొలమానం కట్టడం విశ్వేశ్వరుడికి ఆది అనంతాలు కనిపెట్టడం వంటిది, త్రివిక్రముడిగా వియన్మండలి విస్తరించుకున్న తరువాత వామనుడు మోపే మూడో పాదపు ప్రశ్న లాంటిది, ఆహవరంగంలో అర్జునిడికి విరాట్రూపం చూపిన ఆది పురుషుడి పరిపూర్ణత్వం వంటిది. ఎన్ని ఉదాహరణలూ సరిపోవు, ఎన్ని వివరణలూ చాలవు, ఎన్ని అనుభూతులు అందుకోలేవు, ఎన్ని పాటలూ ౠజువు చూపలేవు.

ఇటువంటి గాయకుడు, వ్యాఖ్యాత, భాషాభిమాని, సంగీతఙ్ఞుడు, నిగర్వి, ఆప్తుడు, నిత్యసంతోషి నిత్య యవ్వనుడు ఇక నాస్తి... నాస్తి... నాస్తి...

by Srinivas Kanchibhotla

 

    
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2020 Idlebrain.com. All rights reserved