నవంబర్ 14న 'శ్రీమంతుడు' సైకిల్ విజేతను ఎంపిక చేయనున్న సూపర్‌స్టార్ మహేష్
సూపర్‌స్టార్ మహేష్ హీరోగా మైత్రి మూవీ మేకర్స్, ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్ ప్రై.లి. పతాకాలపై కొరటాల శివ దర్శకత్వంలో నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, సి.వి.మోహన్ (సివిఎం) సూపర్ డూపర్ హిట్ మూవీ 'శ్రీమంతుడు'. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో రిలీజ్ అయిన ఈ చిత్రం రికార్డు కలెక్షన్లతో బిగ్గెస్ట్ గ్రాసర్‌గా ఈ చిత్రం నిలిచిన విషయం తెలిసిందే. ఈ చిత్రం నవంబర్ 14కి 15 కేంద్రాల్లో 100 రోజులు పూర్తి చేసుకోబోతోంది. గత కొంతకాలంగా ఈ చిత్రంలో ఉపయోగించిన సైకిల్‌కి సంబంధించిన కాంటెస్ట్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. నవంబర్ 14న సూపర్‌స్టార్ మహేష్ డ్రా తీసి 'శ్రీమంతుడు' సైకిల్ విజేతను ఎంపిక చేయబోతున్నారు.
ఈ సందర్భంగా నిర్మాతలు నవీన్, రవి, సివిఎం మాట్లాడుతూ - ''మా మైత్రి మూవీ మేకర్స్ బేనర్‌లో రూపొందిన తొలి చిత్రం 'శ్రీమంతుడు' ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన కలెక్షన్లు సాధించడమే కాకుండా 15 కేంద్రాల్లో 100 రోజులు పూర్తి చేసుకోవడం చాలా సంతోషాన్ని కలిగిస్తోంది. ఈ చిత్రంలో సూపర్‌స్టార్ మహేష్ ఉపయోగించిన సైకిల్‌కి సంబంధించి గత కొంతకాలంగా ఒక కాంటెస్ట్ రన్ అవుతోంది. ఈ కాంటెస్ట్‌కి ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి అద్భుతమైన స్పందన వచ్చింది. వేలాదిగా ఈ కాంటెస్ట్‌లో పాల్గొన్నారు. నవంబర్ 13తో ఈ కాంటెస్ట్ ముగుస్తుంది. నవంబర్ 14న సూపర్‌స్టార్ మహేష్ డ్రా తీసి ఈ కాంటెస్ట్‌లో విజేతను ఎంపిక చేయబోతున్నారు. డ్రాలో గెలుపొందిన విజేతకు నవంబర్ 16న సూపర్‌స్టార్ మహేష్ చేతులమీదుగా సైకిల్‌ను అందజేయడం జరుగుతుంది'' అన్నారు.