pizza
Sunil about Ungarala Rambabu
`ఉంగ‌రాల రాంబాబు` చిత్రంతో నా కెరీర్‌లో మ‌రో క‌మ‌ర్షియ‌ల్ సక్సెస్ సాధించ‌డం ఆనందంగా ఉంది - సునీల్‌
You are at idlebrain.com > news today >
Follow Us

16 September 2017
Hyderabad

సునీల్‌, మియాజార్జ్‌ జంటగా యునైటెడ్‌ కిరిటీ మూవీస్‌ లిమిటెడ్‌ బ్యానర్‌పై రూపొందిన చిత్రం 'ఉంగరాల రాంబాబు'. పరుచూరి కిరిటీ నిర్మాత. క్రాంతి మాధ‌వ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సినిమా సెప్టెంబర్‌ 15న విడుదలైంది. ఈ సంద‌ర్భంగా హీరో సునీల్ పాత్రికేయుల‌తో సినిమా గురించి మాట్లాడుతూ - ``నేను ఉంగ‌రాలు, జాత‌కాలు అనే విష‌యాల‌ను బాగానే న‌మ్ముతాను. అందుకనే `ఉంగ‌రాల రాంబాబు` సినిమా చేశాన‌ని అనుకుంటే పొర‌బ‌డ్డ‌ట్టే. ముందు క్రాంతి మాధ‌వ్‌గారు నా ద‌గ్గ‌ర‌కు మూడు పాయింట్స్‌తో వ‌చ్చారు. మొద‌ట చెప్పిన రెండు పాయింట్స్ చాలా హెవీగా అనిపించాయి. నా ద‌గ్గ‌ర నుండి ప్రేక్ష‌కులు కామెడీని కోరుకుంటారు కాబ‌ట్టి, క్రాంతిమాధ‌వ్‌గారు చెప్పిన ఈ సినిమా పాయింట్ న‌చ్చి ముందుకెళ్లాం. క‌థ‌ను సిద్ధం చేసుకున్న త‌ర్వాత సినిమాకు త‌గ్గ టైటిల్ అనిపించ‌డంతో ఉంగ‌రాల రాంబాబు అనే టైటిల్‌నే పెట్టాం. సినిమా విడుద‌లైంది. నేను ఊహించిన రెస్పాన్స్ కంటే మంచి రెస్పాన్స్ ఆడియెన్స్ నుండి వ‌స్తుంది. చాలా ఆనందంగా ఉంది. నా కెరీర్‌లో జ‌క్క‌న్న సినిమా క‌మ‌ర్షియ‌ల్‌గా పెద్ద హిట్ మూవీ. దాని త‌ర్వాత ఆ రేంజ్‌లో డ‌బ్బులు క‌లెక్ట్ చేసిన సినిమా ఇది. నిన్న రిలీజైన రోజున ఆంధ్ర‌లో థియేట‌ర్స్ హౌస్‌ఫుల్ అయితే, నైజాంలో 80 శాతం ఫుల్ అయ్యాయి. ముఖ్యంగా సింగిల్ థియేట‌ర్స్‌లో సినిమాకు మంచి రెస్పాన్స్ వ‌స్తుంది. సినిమాలో ఫ‌స్టాఫ్ అంతా కామెడీగా సాగిపోతే, సెకండాఫ్ అంతా అస‌లు క‌థ‌లోకి ఎంట‌ర్ అయ్యి, ఎమోష‌న్‌గా సాగుతుంది. ప్రేక్ష‌కుల్లో చాలా మందికి సెకండాఫ్ బాగా న‌చ్చింది. మా తాత‌గారికి నేను ఒక్క‌డే మ‌న‌వ‌డిని. మిగిలిన వారంతా అమ్మాయిలు కావ‌డంతో నేను కూడా పొలం ప‌నుల‌కు ఆయ‌న‌కు తోడుగా వెళుతుండేవాడిని. ఆయ‌న చ‌నిపోయిన త‌ర్వాత భూమిని కౌలుకిచ్చి నేను కాస్తా భూమిలో వ్య‌వ‌సాయం కూడా చేశాను. కాబ‌ట్టి నాకు రైతు క‌ష్టాలేంటో తెలుసు. అందుకే ఈ సినిమాలో రైతు డైలాగ్ క‌నెక్ట్ అయ్యి బాగా చెప్ప‌గ‌లిగాను. హీరోగా చేస్తూనే నేను న‌చ్చిన కామెడీ పాత్ర‌లు కూడా చేయ‌డానికి ఎప్పుడూ సిద్ధ‌మే. ఈ విష‌యాన్ని చాలా సంద‌ర్భాల్లో చెప్పాను. నేను హీరోగా మారిన త‌ర్వాత కూడా నాకు కామెడీ రోల్స్ చేయ‌మ‌ని చాలా అవకాశాలు వ‌చ్చాయి. అయితే అప్ప‌టికే నేను సినిమాలు చేసే నిర్మాత‌లు. మ‌ళ్లీ మీరు కామెడీ పాత్ర‌లు చేస్తే మా సినిమాకు దెబ్బ‌వుతుంద‌నేవారు. దాంతో నేను కామెడీ పాత్ర‌లు చేయ‌డం మానేశాను. అయితే ఇక‌పై ఎవ‌రైనా నిర్మాత‌లు నా ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి హీరోగా చేయ‌మ‌ని అడిగితే, మ‌ధ్య‌లో నేను వేరే సినిమాల్లో కామెడీ పాత్ర‌లు కూడా చేస్తాను. మీకు ఇష్ట‌ముంటే మీ సినిమాలో హీరోగా చేస్తాను అని చెప్పేస్తాను. ప్ర‌స్తుతం నేను ఎన్‌.శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో చేసిన టు కంట్రీస్ సినిమా విడ‌డుద‌ల‌కు సిద్ధ‌మవుతోంది. అలాగే త‌మిళంలో విజ‌య‌వంత‌మైన చ‌దురంగ వేట్టై సినిమా రీమేక్‌లో కూడా నటించ‌బోతున్నాను. మ‌రో సినిమాకు సంబంధించిన చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. మ‌రో వారంలో ఆ వివ‌రాల‌ను కూడా తెలియ‌జేస్తాను`` అన్నారు.

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved