pizza
Tammareddy Bharadwaja appreciates Pelli Choopulu
You are at idlebrain.com > news today >
Follow Us

29 July 2016
Hyderabad

తెలుగు సినిమా పరిశ్రమలో మగాళ్ళు లేరని కొన్నేళ్ళ క్రితం చెప్పాను. మగాడు లేదా మగతనం అనడంలో నా ఉద్దేశం పురుషాహంకారమో, సెక్సిస్టు రిమార్కో కాదు. ధైర్యంగా విన్నూత్నమైన సినిమాలు తియ్యగలిగిన సత్తా. వాటిని కన్విన్సింగ్ గా ప్రేక్షకుల్ని మెప్పించే విధంగా తీర్చిదిద్దగలిగిన చేవ లేకపోవడ,. ఆ రెండూ లేక మూస ధోరణిలో కొట్టుకుంటున్న తెలుగు సినిమాపై నిరసన. అలా తయారు చేస్తున్న వాళ్ళ మీద కినుక ఆ మాట అనడానికి కారణం. కానీ గత ఐదారేళ్ళుగా చిన్నగా వస్తున్న మార్పులు చూసి మార్పుకి అవకాశం ఉందని ఆనందించాను. మొన్న “పెళ్ళిచూపులు” అనే నూతన దర్శకుడు తరుణ్ భాస్కర్ సినిమా చూశాక, ఆ స్టేట్మెంట్ వాపస్ తీసుకునే సమయం వచ్చేసిందనిపించింది. మెల్లిగా మొలతాడు కట్టిన మగాళ్ళు పుట్టుకొస్తున్నారు. తెలుగు సినిమాకి మగతనం తెస్తున్నారు.

అష్టా-చెమ్మా చూసినప్పుడు మనోళ్ళు కొత్తగా ఆలోచిస్తున్నారు అనుకున్నా. అప్పటికే ఇలాంటి టైటిళ్ళు, సున్నితమైన భావాలు గల సినిమాలు ఆడవనుకున్న టైం అది. కానీ ప్రేక్షకులు తమ టేస్ట్ బాగుందని నిరూపించారు. కమర్షియల్ స్టార్స్ తో, కథాంశం కలిగిన చిత్రాలు చెయ్యొచ్చనే గమ్యాన్ని వేదంలా రాసాడు క్రిష్.ఆ తరువాత కాలంలోనే వచ్చిన ’పిల్ల జమిందారు’ మరో ఉదాహరణ, ఆ పిల్ల ఏమిటో జమీందారీ తనమేమిటో తెలీకపోయినా, కథ ఉన్న సినిమాని ఖచ్చితంగా ఆదరిస్తారని తేల్చేసారు. డిజిటల్ సినిమా వస్తున్న తరుణంలో అతితక్కువ బడ్జెట్టుతో, కొత్తవాళ్ళతో కొత్తగా తీస్తే చూస్తారని తెలియజెప్పిన సినిమా మారుతి ’ఈరోజుల్లో’. సునిల్ కుమార్ ’ఒక రొమాంటిక్ క్రైం కథ’

హీరోలుంటేనే తెలుగు సినిమా అనుకున్న టైంలో ఈగ దోమా కూడా హీరో అయిఫొవచ్చని బాక్సాఫీస్ దగ్గర నిరూపించిన సినిమా ’ఈగ’. హీరోలకి ఫార్ములాలు కాదు. కథే కావాలి. అని విక్రం కుమార్ ఇష్క్ తో ప్రజలు జడ్జిమెంటు ఇచ్చారు. హీరో హిట్టాఫట్టా అనే తేడా లేకుండా కథాబలంతో సినిమా నిలబడుతుందనడానికి ఇదొక ఉదాహరణ అయ్యింది. అదే దర్శకుడు తరువాత కథాబలంతోనే కనీవినీ ఎరగని రీతిలో “మనం” అంటూ మూడుతరాల కథని తెరకెకించాడు. ఎక్స్ ప్రెస్ రాజా, రన్ రాజా రన్ లాంటి సినిమాలు థ్రిల్ కలగలిపిన హాస్యాన్ని హైలైట్ చేశాయి. అది ఒక కొత్త తరహా. దీనితోపాటూ వచ్చిన మరో జాన్రా హర్రర్ కామెడీ. దయ్యాలు భయపెట్టడం కాదు. నవ్విస్తాయి. అని ’ప్రేమకథా చిత్రం’ ఒక కొత్త ఒరవడిని మొదలెట్టింది. పల్లెటూరి అందాలు. అక్కడి బంధాలూ తెలియజెపితే ఎవరు చూస్తారు అనుకున్న రోజుల్లో విరించి వర్మ ఉయాల-జంపాలా బాక్సాఫీస్ ను ఒక ఊపి ఊపింది.

అలా నిదానంగా మొదలైన మార్పు 2015-16 కి వచ్చేసరికీ ఉధృతమయ్యీంది. 2015 ఒక డిఫైనింగ్ ఇయర్ గా చూసుకుంటే, ఇంతవరకూ రాని జాతీయ అవార్డుతో పాటూ అంతర్జాతీయ మార్కెట్ ని తెచ్చిన సినిమా బాహుబలి. శ్రీమంతుడు లాంటి స్టార్డంకి కథాబలం కలిసిన సినిమాతో పాటూ భలే భలే మగాడివోయ్, భలే మంచిరోజు, మళ్ళీమళ్ళీఇది రానిరోజు, ఊహలు గుసగుసలాడే, పటాస్, రాజుగారి గది, ఎవడే సుబ్రమణ్యం, కంచె, కుమారి 21F లాంటి భిన్నమైన ప్రయత్నాలు అలరించాయి. విజయాన్ని సాధించాయి. వీటిలో చాలా సినిమాలు కొత్త దర్శకులు తీసినవే. పరిశ్రమతో సంబంధం లేకుండా బయటి నుంచీ వచ్చినవాళ్ళ్ తీసిన సినిమాలే. మార్పు ఎప్పుడూ కొత్తనీటితోనే వస్తుంది. యువతరంతోనే వస్తుంది అనడానికి ప్రతీకలు అవసరాల శ్రీనివాస్, క్రిష్, నాగ్ అశ్విన్, శ్రీరాం ఆదిత్య, క్రాంతి మాధవ్, అనిల్ రావిపూడి, ఓంకార్, సూర్యప్రతాప్ మొదలైనవారు.

2016 ఈ మార్పుని కన్సాలిడేట్ చేసిన సంవత్సరంగా అనిపిస్తుంది. సంవత్సరం ఆరంభం నుంచే సరికొత్త తరహా చిత్రాలు. మూసకు భిన్నమైనవి. ఫ్రెష్ అని చెప్పుకోదగ్గవీ మొదలయ్యాయి. నేను శైలజ, క్షణం, కృష్ణగాడి వీరప్రేమగాధ, ఊపిరి, సోగ్గాడే చిన్నినాయనా ఒకదానితో ఒకటి సంబంధం లేని సినిమాలు. ఒక స్థాయిలో ప్రయోగాత్మకంగా ఉన్న సినిమాలు. స్టార్డంను పక్కకు పెట్టి కథాబలానికి పట్టంకట్టిన సినిమాలు. దర్శకుల ప్రతిభే గీటురాయిగా కలిగిన సినిమాలు. ఇదే ఎవరైనా కోరుకునే మార్పు. అర్థవంతమైన, విభిన్నమైన, ఆహ్లాదకరమైన, ఆరోగ్యవంతమైన సినిమాలు. ఈ కోవలో కలికితురాయి “పెళ్ళిచూపులు”. తక్కువ బడ్జెట్టు పెట్టినా, సరైన రచన సహకరించే ప్రతిభగల టీం ఉంటే అద్భుతాలు సృష్టించవచ్చు అనడానికి ఇది మంచి ఉదాహరణ. మొదటి సినిమాతోనే దర్శకుడు తరుణ్ భాస్కర్ ట్రెండ్ సెట్ చేశాడు అనడంలో డౌట్ లేదు. ఈ సినిమా ఒక పాథ్ బ్రేకింగ్ సినిమా అవుతుంది అనడంలోనూ సందేహం లేదు. అందుకే ఈ నూనూగుమీసాల యువతరానికి సినిమాని మార్చే మగతనం ఉందని చెప్పడానికి నాకు ఏ మాత్రం సందేహం లేదు. ఇది వరకూ నేను అన్న మగాళ్ళు లేరు అన్నమాట వెనక్కి తీసుకోవడానికి నేను సిద్దంగా ఉన్నాను. పెళ్ళి చూపులు సినిమా చూస్న వెంఠనే వెనక్కి తీసేసుకున్నాను కూడా. ఆల్ ది బెస్ట్ టు…యువదర్శకులు.


- Tammareddy Bharadwaj

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved