pizza
VN Aditya about Keeravani
మంచి బాణీల మాగాణి.. మరకత మణి..
You are at idlebrain.com > news today >
Follow Us

4 July 2017
Hyderabad

1994 లో చెన్నై వాహినీ స్టూడియో లో చందమామ విజయ కంబైన్స్ తమిళం లో కమల్ హాసన్ హీరో గా నిర్మిస్తున్న '' నమ్మవర్ '' అనే చిత్రానికి నేను అసోసియేట్ దర్శకుణ్ణి .. కమల్ గారు ఒక షాట్ గ్యాప్ లో నన్నడిగారు.. తెలుగు లో ఈ మధ్య ఒక టాప్ మ్యూజిక్ డైరెక్టర్ , మూవీ సైన్ చేసేముందు హీరో, ప్రొడ్యూసర్, డైరెక్టర్ జాతకాలడిగి అవి బావుంటే గానీ సినిమా సైన్ చేయరటగా .. నిజమేనా .. అని.. అప్పటికి నాక్కూడా తెలీదు .. ఇలా వినటం ఇదే ఫస్ట్ టైం సర్.. కనుక్కుంటాను అన్నాను.. అక్కర్లేదు.. అని నవ్వేశారాయన.. ఆ తర్వాత కొన్ని రోజులకి ఆయనే చెప్పారు.. ఆ మ్యూజిక్ డైరెక్టర్ పేరు కీరవాణి .. మా శుభసంకల్పం సినిమాకి ఆయన్ని సైన్ చేసాం .. అని.. మొదటిసారి ఆయన పరిచయం అలా.. ఆ తర్వాత మా సెట్ లోనే చాలాసార్లు చూసే వాడిని ఆయన్ని కే.విశ్వనాధ్ గారితో.. ఒక క్యూరియాసిటీ .. మళ్ళీ 2003 లో కామాక్షి మూవీస్ శివ ప్రసాద్ రెడ్డి గారికి నాగార్జున గారు హీరో గా '' నేనున్నాను '' చిత్రానికి నేను దర్శకత్వం వహిస్తున్నప్పుడు రెడ్డి గారు కీరవాణి గారు కావాలని పట్టు పట్టారు.. నాక్కూడా ఇష్టమే కాబట్టి పెద్దగా ఆలోచించలేదు..

రాఘవేంద్ర రావు గారు, కోదండరామిరెడ్డి గారు లాంటి పెద్ద దర్శకులకి పని చేసిన ఈయనకి వయసులోనూ, నాలెడ్జి లోను అతి చిన్న వాడినైన నేను ఒక ట్యూన్ బాలేదని చెప్తే వింటారా .. ఇంకో ట్యూన్ ఇమ్మని అడిగితే ఇస్తారా .. అని లోపల్లోపల అనుమానం ఉండేది.. కానీ , ఆయనకీ కూడా ఇప్పుడు పెద్దగా సక్సెస్ లేదు కాబట్టి కాస్త మన తో ఈజీ గా ఉంటారేమోలే అనేసుకున్నాను.. ప్రతిభ ఉన్నవాడికి సక్సెస్, ఫెయిల్యూర్ లు పీపీలకాలు అన్న ఇంగితం అప్పటికి లోపించింది నాకు.. ఆయనేమాత్రం తగ్గలేదు.. దర్శకుడి గా నా రెస్పెక్ట్ నాకిస్తూనే , నన్ను చాలా కంఫర్టబుల్ గా చూసుకుంటూనే ఆయన అనుభవాన్ని మేళవించి సూపర్ హిట్ ఆడియో ఇచ్చారు.. పైగా, సినిమా ఒప్పుకునే ముందు నా జాతకం అడగలేదు.. నేను నవ్వుకున్నాను.. చెన్నై లో నేను విన్న విషయం రూమర్ అనుకుని .. ఆ సినిమా టైటిల్ అనౌన్స్ చేసే ప్రెస్ మీట్ లో రాఘవేంద్ర రావు గారి తర్వాత నేను పని చేసిన దర్శకుల్లో కమర్షియల్ సినిమా సంగీతం మీద ఇంత గ్రిప్ ఉన్న దర్శకుణ్ణి నేను ఆదిత్య గారినే చూడడం అని కితాబునిచ్చారు.. పైగా , నేనున్నాను సినిమా రీ రికార్డింగ్ కి ముందు ఎడిటింగ్ రూమ్ లో సినిమా అంతా చూసి 26 పాయింట్లు ఆ సినిమా ని హిట్ చేస్తాయని , రెండు పాయింట్లు బాలేవని ఆయన రిపోర్ట్ గా రాసి షూటింగ్ స్పాట్ కి వచ్చి నా చేతిలో పెట్టి వెళ్లారు.. ఆయనకీ ఎంతో నచ్చిన నీకోసం పాట నాకోసం కే.కే. తో పాడించారు.. ఏ శ్వాసలో పాట అయ్యాక ఫైట్ సీక్వెన్స్ ఉంటె, దాన్ని పాటలో కలిపేట్టు స్క్రీన్ ప్లే మార్పించారు.. లేకపోతే హీరో పాటంతా అయ్యేవరకు ఇన్ ఆక్టివ్ గా ఉంటారని .. థియేటర్ లో ఆ సలహా యే ఆ పాటని కాపాడింది అని నాకు తెలుసు ..

ఏ పత్రిక చదివినా , అందులో నచ్చిన పేజీ లని చింపి, దాచుకుని , బైండ్ పుస్తకంగా దాచుకున్న సాహితీ పిపాసకుడు .. వాటిల్లో వంటింటి చిట్కాలుంటాయి.. ఆరోగ్య సూత్రాలుంటాయి.. కథలుంటాయి.. కార్టూన్లుంటాయి.. వ్యాసాలుంటాయి.. ఆ బైండ్ పుస్తకాలన్నీ కొట్టేయాలని నాకెప్పటి నుంచో కోరిక .. కుదరనివ్వట్లేదు కీరవాణి గారు.. ఆయనకి మరో పిచ్చి ఉంది .. లేటెస్ట్ టెక్నికల్ డివైస్ లు మార్కెట్ లోకి రాంగానే కొనేయడం .. అదే ఆయన్ని ఈ తరం లోను చాలా అప్ డేటెడ్ గా ఉంచుతోంది .. అర్ధరాత్రయినా, అపరాత్రయినా రసగుల్లాలు తినాలనిపిస్తే ఎక్కడో అక్కడ వెతికి పట్టి తినాల్సిందే .. ఫలానా చోట దోసెలు , చట్నీ బావుంటాయని తెలిస్తే , అవి ఎంత దూరమైనా నడిచి వెళ్లి వెతికి పట్టుకుని రుచి చూసెయ్యాల్సిందే .. అంత భోజన ప్రియులు.. అంతే బహు జన ప్రియులు కూడా.. మనసు మమత, అమ్మ సినిమా ల నుంచి బాహుబలి దాకా అంచెలంచెలుగా ఎదిగిన మంచి మనిషి మరకత మణి.. మర్రి చెట్టులా తాను మాత్రమే ఎదిగిపోకుండా , అంటు మొక్కలా కుటుంబం అంతటితో కలిసి ఎదిగి సమాన ఫలాలు అందరికీ పంచడం ఆయన వల్లే సాధ్యమయింది .. రచయిత, దార్శనికుడు , తత్వవేత్త , మెలోడీ స్వరాల మధుర వాణి శ్రీ కీరవాణి గారి జన్మ దినం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ .. నేనున్నాను సినిమా లో వారే స్వరపరచి పాడిన చంద్రబోస్ పాట చీకటితో వెలుగే చెప్పెను .. ఆయనకే పునరంకితం చేస్తున్నాను ..

మీ
వీ. యెన్ . ఆదిత్య

 

 

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved