pizza
TANA 22nd national conference from 4 July 2019
తానా మహాసభలకు రెడీ అవుతున్న వాషింగ్టన్‌ డీసి కన్వెన్షన్‌ సెంటర్‌
You are at idlebrain.com > NRI community >
Follow Us

To feature your NRI communty news in idlebrain.com, please mail us at [email protected]

7 May 2019
USA

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 22వ మహాసభలను వాషింగ్టన్‌ డీసీలో అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా మహాసభలు జరిగే వాల్టర్‌ ఇ వాషింగ్టన్‌ సెంటర్‌ను తానా అధ్యక్షుడు సతీష్‌ వేమన, కాన్ఫరెన్స్‌ చైర్మన్‌ నరేన్‌ కొడాలి, ఇతర కాన్ఫరెన్స్‌ కమిటీ సభ్యులు, తానా నాయకులు సందర్శించి కాన్ఫరెన్స్‌కు కావాల్సిన ఏర్పాట్లపై చర్చించారు. కార్యక్రమాలు జరిగే వేదికలను, ఇతర ప్రాంతాలను పరిశీలించి కాన్ఫరెన్స్‌కు తగ్గట్టుగా ఏర్పాట్లు చేయాలని కాన్ఫరెన్స్‌ సెంటర్‌ నిర్వాహకులకు సూచనలు ఇచ్చింది.

అతి పెద్ద కన్వెన్షన్‌ సెంటర్‌గా పేరు పొందిన వాల్టర్‌ ఇ వాషింగ్టన్‌ సెంటర్‌ 2003లో ప్రారంభమైంది. 2.3 మిలియన్‌ స్క్వేర్‌ఫీట్‌లో ఈ కన్వెన్షన్‌ సెంటర్‌ విస్తరించి ఉంది. దాదాపు 77 మీటింగ్‌ రూమ్‌లు ఇందులో ఉన్నాయి. 42,000 మంది కూర్చునే వసతి సౌకర్యం కల అతి పెద్ద ఈ కన్వెన్షన్‌ సెంటర్‌ ఇప్పుడు తానా 22వ మహాసభలకు వేదిక అయింది. ఇలాంటి పెద్ద వేదికపై తానా నిర్వహించే మహాసభలు చరిత్ర సృష్టిస్తాయా అని అందరూ ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే గతంలో వాషింగ్టన్‌ డీసీలో తానా మహాసభలు 2007లో జరిగాయి. ఆ మహాసభలకు ప్రత్యేక అతిధులుగా చంద్రబాబు నాయుడు, అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్‌ క్లింటన్‌ వచ్చారు. ఆ మహాసభలు తానా చరిత్రలో ఓ మైలురాయిగా నిలిచిపోయింది. ఆ మహాసభలు విజయవంతం కావడం వెనుక సతీష్‌ వేమన కృషే ఎక్కువ ఉంది. అప్పుట్లో తానాలో ప్రాంతీయ ఉపాధ్యక్ష  హోదాలో మహాసభలను విజయవంతం చేసిన సతీష్‌ వేమన, ఈసారి అధ్యక్ష హోదాలో ఈ మహాసభలను మరింత అంగరంగవైభవంగా నిర్వహించి చరిత్ర సృష్టిస్తారని అందరూ భావిస్తున్నారు.

తానా మహాసభలకు ప్రపంచం నలుమూలల నుంచి 15,000 మందికిపైగా హాజరుకావచ్చని భావిస్తున్నారు. అందుకు తగ్గట్టుగా వసతి సౌకర్యాలను కల్పిస్తున్నారు. తానా మహాసభలకు వచ్చేవారికోసం రిజిస్ట్రేషన్‌ సౌకర్యాన్ని కూడా ప్రారంభించారు. హోటళ్ళలో వసతికోసం ఏర్పాట్లు కూడా చేశారు. మారియట్‌ రినైసెన్స్‌ హోటల్‌లో ఇప్పటికే తానా మహాసభలకు వచ్చేవారికోసం రూమ్‌లను రిజర్వ్‌ చేసి ఉంచారు.

ఈసారి జరిగే తానా మహాసభలకు తెలుగు రాష్ట్రాల నాయకులనే కాకుండా, కేంద్ర మంత్రులు, ఉపరాష్ట్రపతి ఇతర జాతీయ నాయకులను ఆహ్వానిస్తున్నారు. అమెరికా నుంచి మాజీ అధ్యక్షులైన ఒబామా దంపతులను, అలాగే ఇతర దేశాల తెలుగు ప్రముఖులను కూడా ఈ మహాసభలకు ఆహ్వానిస్తున్నారు.

తానా మహాసభల్లో ఎన్నో కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. అందులో ముఖ్యమైనది ధీంతానా. అమెరికాలో ఉన్న తెలుగు చిన్నారులు, యువతలో ఉన్న టాలెంట్‌ను వెలికితీసే కార్యక్రమం ఇది. పలు నగరాల్లో ఇప్పటికే ఈ పోటీలు ప్రారంభమైంది. చిన్నారుల్లో తెలుగుభాషపై మక్కువ పెంచే ఉద్దేశ్యంతో పాఠశాలతో కలిసి తెలుగు పోటీలను ప్రారంభించింది. మ్యాథ్స్‌, సైన్స్‌ వంటి సబ్జెకుల్లో ఆసక్తిని పెంచేందుకు వీలుగా క్యూరీ సంస్థతో కలిసి చిన్నారులకు పోటీలను నిర్వహిస్తోంది. ఓవైపు ఇలాంటి పోటీలు, మరోవైపు బ్యాడ్మింటన్‌, గోల్ఫ్‌ వంటి ఆటల పోటీలను కూడా తానా ఏర్పాటు చేసింది.

తానా మహాసభల్లో భాగంగా జూలై 6వ తేదీన శ్రీనివాస కళ్యాణంను నిర్వహిస్తున్నారు. యూత్‌కోసం ప్రత్యేక కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేశారు. దీంతోపాటు పలువిభిన్నమైన సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ప్రదర్శించనున్నారు.

మహాసభల ప్రాంగణంలో వ్యాపార వాణిజ్య కేంద్రాలవారు తమ స్టాళ్ళను ఏర్పాటు చేసుకునేందుకు వీలుగా కమర్షియల్‌ స్టాల్స్‌కోసం విశాలమైన ప్రాంతాన్ని కేటాయించారు. వేల సంఖ్యలో తెలుగు కుటుంబాలవారు మహాసభలకు హాజరవుతున్న నేపథ్యంలో ఈ స్టాళ్ళకు డిమాండ్‌ ఉందని, ముందుగానే తమ స్టాళ్ళకోసం ప్రాంతాన్ని రిజర్వ్‌ చేసుకుంటే మంచిదని నిర్వాహకులు సూచిస్తున్నారు.

మహాసభల్లో పాల్గొనేందుకు ఎంతోమంది సినీకళాకారులు కూడా తరలి వస్తున్నారు. రాజకీయ నాయకులు, సాహితీప్రముఖులు, ఆధ్యాత్మిక ప్రవచనకారులు, క్రీడాకారులు కూడా ఈ మహాసభలకు హాజరవుతున్నారు.

ఈ మహాసభలకు సంబంధించి మరిన్ని వివరాలకోసం చూడండి. www.tana2019.org


 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2019 Idlebrain.com. All rights reserved