pizza
Tantex 93 Nela Nela Telugu Vennela (Telugu Sahitya Vedika)
You are at idlebrain.com > NRI community >
Follow Us

To feature your NRI communty news in idlebrain.com, please mail us at [email protected]

23 April 2015
Hyderabad

టాంటెక్స్ సాహిత్యవేదికపై శాస్త్రీయ విశ్లేషణ లో తడిసి మురిసిన కవిసమ్మేళనం

డాల్లస్/ఫోర్టువర్త్,టెక్సస్: తెలుగు సాహిత్య సేవలలో నిర్విరామంగా ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) నిర్వహించే “నెల నెలా తెలుగు వెన్నెల” 93వ కార్యక్రమం ఆదివారం ఏప్రిల్ 19, డల్లాస్ లోని దేశి ప్లాజా స్టూడియో లో సాహిత్య వేదిక సమన్వయకర్త దండ వెంకట్ అధ్యక్షతన ఎంతో ఘనంగా జరిగింది. అమెరికా తెలుగు రాజధాని అయిన డల్లాస్ నగరంలో సంప్రదాయబద్ధం గా నిర్వహించిన మన్మధ నామ సంవత్సర కవి సమ్మేళనం కార్యక్రమం విశేష ప్రజాదరణ పొందింది. దీనితో బాటు "ప్రాచీన తెలుగు కావ్యాలు - శాస్త్రీయ వ్యాఖ్యానం” అనే అంశం మీద శ్రీ ముత్తేవి రవీంద్రనాథ్ గారు ప్రధాన వక్తగా సాగించిన ప్రసంగం, ఆద్యంతం ఆసక్తికరంగా జరిగింది.

కవిసమ్మేళనాన్ని స్వాగతిస్తూ టాంటెక్స్ అధ్యక్షులు డా. ఊరిమిండి నరసింహా రెడ్డి “చిరకాల మిత్రులే కాకుండా, ప్రతి నెలా కొత్తవారు కూడా సాహిత్య అభిలాషతో ఈ కార్యక్రమానికి రావడం, ముఖ్యంగా బాలబాలికలు ఉత్సాహంతో పాల్గొనడం ఎంతో అభినందనీయం అన్నారు. పిల్లలను ప్రొత్సహిస్తున్న తల్లిదండ్రులకు కృతఙ్ఞతలు చెప్పారు. ప్రతి సంవత్సరం జరుపుకునే "తెలుగు సాహిత్య వేదిక వార్షికోత్సవం" జులై 11, 12 తేదీలలో అని, నెల నెలా తెలుగు వెన్నెల కొత్త మైలురాయి చేరుతున్న సందర్భంలో "100వ నెల నెలా తెలుగు వెన్నెల" నవంబర్ 14 న ఘనంగా జరుపడానికి సన్నాహాలు మొదలు పెట్టారని, అందరూ విచ్చేసి, పాల్గొని, జయప్రదం చేయండి” అని కోరారు.

కార్యక్రమంలో ముందుగా చిన్నారి బసూర్ ఈశా చక్కటి శాస్త్రీయ సంగీతం తో ప్రార్ధనాగీతం ఆలపించారు. చిన్నారులు కస్తూరి అమృత, కస్తూరి ప్రణవ్, కోట ఆకాష్, నరని ఉధ్భవ్ లు ప్రముఖ కవి జొన్నవిత్తుల గారు రచించిన "తీయని భాషరా బిడ్డా" గేయం ను చక్కగా గానం చేసారు. మద్దుకూరి చంద్రహాస్ స్వీయ కవిత చదివి వినిపించగా, దొడ్ల రమణ వేటూరి గీతాలలో వేదాంతం అనే అంశం మీద, కాజ సురేష్ తాపి ధర్మారావు గారు రచించిన ‘సాహిత్య మరమరాలు’ అనే అంశం మీద, జువ్వాడి రమణ తెలుగు వాడి గొప్పదనం గురించి చక్కని కవితను, నందివాడ ఉదయ భాస్కర్ స్వీయ కవిత ‘బేతస్’ లో సామాజిక నిస్పృహను, పుదూర్ జగదీశ్వరన్ స్వీయ కవితను, పెనుగొండ ఇస్మాయిల్ E=MC2 అనే అంశం మీద, పాలూరి సుజన మన్మధనామ సంవత్సరం గురించి స్వీయ రచనను, డా. కలవగుంట సుధ త్యాగరాజ విరచిత ‘నౌకా చరిత్ర ప్రబంధం’ లో కృష్ణ గోపికల కలయికను, A. పద్మజ స్వీయ రచనను, జలసూత్రం చంద్రశేఖర్ తెలుగు సినీ పాటల ప్రస్థానం- హాస్య పరిశీలన అనే అంశం పై ప్రసంగించారు. వివిధ అంశాలతో సాగిన ఈ మన్మధనామ కవి సమ్మేళనం ఉగాది పచ్చడిలో షడ్రుచుల కలయికలా శోభాయమానంగా జరిగింది.

శ్రీమతి పెనుగొండ నూర్జహాన్ ముఖ్యఅతిధి శ్రీ ముత్తేవి రవీంద్రనాథ్ గారిని పుష్పగుచ్చంతో ఆహ్వానించారు. అనంతరం శ్రీ రవీంద్రనాథ్ మాట్లాడుతూ మనం ఏదైనా సాహిత్యపు విలువలున్న పుస్తకాలు చదువుతున్నప్పుడు కేవలం శబ్ధపరంగా, ఛందస్సు పరంగా మాత్రమే చూడకుండా దానిని ఒక శాస్త్రీయ దృక్పధం తో పరిశీలించాలని, శాస్త్ర సంబంధ విషయాలు వెలికి తీయడం ద్వారా వాటిలో దాగున్న అమూల్య సంపద మానవాళికి లభిస్తుంది అని ఎన్నో ఉదాహరణలతో తెలియచేసారు. తెనాలి రామకృష్ణ కవి రాసిన ఉద్భటారాధ్య చరిత్రము అను గ్రంధం నుండి ఎన్నో శాస్త్రీయ విషయాలు తెలియచేసారు. పెళ్లి లో సారస కొంగలను చూపిస్తారు అవి దాదాపు రెండు మీటర్లు ఎత్తు ఉంటాయని, జంటలుగా విహరించే సారస కొంగలను పెళ్ళిలో చూడడం శుభ సూచకం అంటారని తెలియచేసారు. అదే గ్రంధం నుండి శరత్కాల వర్ణన, మోవి చెట్టు, జువ్వి చెట్ల ఉపయోగాలు ఎంతో చక్కగా వివరించారు. తెనాలి రామలింగ కవే రచించిన పాండురంగ మహత్యం అనే గ్రంధం నుండి నిగమశర్మ వృత్తాంతం వివరించారు. కధలో ఒక చోట నిగమశర్మ దెబ్బలు తగిలి పడిపోతే ఆయనకు తోటకూర కాడలతో సపర్యలు చేసారని, దానికి కారణం తోరకూరలో ఉన్న రోగ నిరోధక శక్తి అని తెలియచేసారు. కాచు సున్నం, జాజికాయి, జాపత్రి తో తయారు చేసుకొన్న తాంబూలం సేవిస్తే ఎటువంటి క్రిములు నోటిద్వారా శరీరంలోకి ప్రవేశించే అవకాశం లేదు అని అందుకే మన గ్రంధాలలో తాంబూల ప్రసక్తి ఎన్నో చోట్ల కనబడుతుంది అని చెప్పారు. తెనాలి రామలింగడు పుట్టిన ఊరు తెనాలి అని, దాని అసలు అర్ధం తెన్ అంటే దక్షిణ దిక్కు, న్యాలి అంటే నీటి వనరు అని, తెనాలి అంటే దక్షిణ దిక్కునున్న నీటివనరు అని ఎన్నో ఆసక్తి కరమైన విషయాలు తెలియచేసారు. వేసవికాలంలో వచ్చే శ్రీరామనవమి పండుగలో మిరియాలు, బెల్లం తో చేసిన పానకం ఇవ్వడం యొక్క శాస్త్రీయ ప్రయోజనం ఉష్ణ తాపం నుండి రక్షించడం అని చెప్పారు. స్నానం చేసే సమయంలో వాడే పసుపు లో ఎన్నో ఔషధ గుణములు ఉన్నవి అని తెలియచేసారు. ఇలా ఎంతో చక్కటి మాటలతో సాదోహరణం వివరణలతో కార్యక్రమం ఆద్యంతం రక్తి కట్టించారు.

సభకు విచ్చేసిన ఆహూతులకు టాంటెక్స్ వారు తీయని మామిడి ముక్కలు, లేత జామ కాయలు, వేడి వేడి మొక్క జొన్నలు, పకోడీలు, పాయసం, తేనీరు తో చక్కని అల్పాహారం అందచేసారు.

ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) అధ్యక్షులు డా. ఊరిమిండి నరసింహా రెడ్డి మరియు పాలకమండలి ఉపాధిపతి చాగర్లమూడి సుగన్ సంయుక్తంగా దుశ్శాలువతో సత్కరించగా, సమన్వయ కర్త దండ వెంకట్, సాహిత్య వేదిక బృందం, ఉత్తరాధ్యక్షులు జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం, టాంటెక్స్ కార్యవర్గం ముఖ్య అతిధి శ్రీ ముత్తేవి రవీంద్రనాథ్ గారిని జ్ఞాపిక తో సత్కరించారు. సమన్వయ కర్త దండ వెంకట్ శాస్త్రీయ దృక్పధం తో శ్రీ ముత్తేవి రవీంద్రనాథ్ గారు చేసిన ప్రసంగానికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతివారికి, తెలుగు భాషాభిమానులకు, సాహితీ ప్రియులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రత్యేక ప్రసార మాధ్యమాలైన దేశీ ప్లాజా, రేడియో ఖుషి మరియు ప్రసార మాధ్యమాలైన టీవీ9, టీవీ5, 6టీవీలకు కృతఙ్ఞతా పూర్వక అభివందనములు తెలియజేసారు. రొడ్డ రామకృష్ణారెడ్డి, కాకర్ల విజయమోహన్, ఉప్పలపాటి కృష్ణా రెడ్డి, ఆదిభట్ల మహేష్ ఆదిత్య, వీర్నపు చినసత్యం, శీలం కృష్ణవేణి, పావులూరి వేణుమాధవ్, సింగిరెడ్డి శారద, మండిగ శ్రీలక్ష్మి, పాలేటి లక్ష్మి, బిల్ల ప్రవీణ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

కార్యక్రమంలోని ఛాయాచిత్రాలను ఈ లంకెలో చూడవచ్చును.

 

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved