pizza
టాంటెక్స్ వారి పునస్సమాగమ వేడుక – పెల్లుబికిన గతస్మృతులు
You are at idlebrain.com > NRI community >
Follow Us

To feature your NRI communty news in idlebrain.com, please mail us at [email protected]

13 December 2014
Hyderabad

డాల్లస్-ఫోర్ట్ వర్త్ , టెక్సస్: అమెరికాలో తెలుగు సంగీత, సాహిత్య, సంస్కృతీ సంప్రదాయాలకు కేంద్ర బిందువైన డాలస్ నగరంలో స్థానిక ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) “ పూర్వ సభ్యుల మరియు కార్యకర్తల పునస్సమాగమ దినోత్సవం” అనే ప్రత్యేక కార్యక్రమాన్ని కాలివిల్ లోని కమ్యూనిటీ సెంటర్ వేదికగా ఆత్మీయ తెలుగు వారి మధ్య కార్యక్రమ సమన్వయకర్త శీలం కృష్ణ వేణి ఆధ్వర్యంలో అత్యంత ఆహ్లాదంగా నిర్వహించబడింది. దాదాపు ముప్పది సంవత్సరాలుగా ప్రవాసాంధ్రులకు తన నిస్వార్థ సేవా సహాయాలను అందచేస్తున్న తెలుగు సంఘం ఎప్పుడు కూడా అమెరికాలో వున్నా స్థానిక సంస్థలలో మొదటి స్థానంలోనే ఉంటూ వచ్చింది. ఈ సుదీర్ఘ కాలంలో సంస్థ సాధించిన విజయాలకు , ఈ సంస్థ పూర్వాధ్యక్షులు వారి కార్యవర్గం సభ్యులు మరియు ఎందరో స్వచ్ఛంద సేవకులు సహాయ సహకారాలే కారణమని భావించిన ప్రస్తుత కార్యవర్గ బృందం మరొకసారి వారందరి సేవలని గుర్తించి, సత్కరించాలన్న ఉద్దేశంతో ఈ పునస్సమాగమ వేడుక మొట్టమొదటిసారిగా నిర్వహించింది.

1986 లో సంస్థ ఆవిర్భవించి నప్పటినుంచి నేటి వరకూ , ఈ సంస్థలో వివిధ హోదాలలో పని చేసిన దాదాపు ౩౦౦ వందలమంది ఉత్సాహంగా పాల్గొనడమే గాక వారి అనుభవాలను గుర్తుకు తెచ్చుకోడం ప్రాంగణంలో ప్రతిచోట కనిపించింది. తొలుత చిన్నారులు కీర్తి చామకూర, శ్రేయ వసకర్ల పాడిన “గణ నాయకా” ప్రార్తనా గీతంతో కార్యక్రమం ప్రారంభమైంది. తదుపరి సంయుక్త కార్యదర్శి ఆదిభట్ల మహేష్ ఆహ్వాన పలుకులతో, పూర్వ, ప్రస్తుత అధ్యక్షులు, కార్యవర్గ బృందం చేసిన దీప ప్రజ్వలనతో కార్యక్రమం ముందుకు సాగినది.

సంస్థ ఉత్తరాధ్యక్షుడు డా. ఊరిమిండి నరసింహారెడ్డి తమ స్వాగాతోపన్యాసంలో, పూర్వాధ్యక్షులు, వారి కార్యవర్గ సభ్యుల నిరంతర శ్రమ ఫలితమే ఈ రోజు ఈ సంస్థ 1000 మంది పైగా శాశ్వత సభ్యత్వంతో విస్తరించడానికి కారణమని శ్లాఘించారు.

ఒడిస్సి నృత్యంలో ప్రవీణురాలు మరియు గురు శ్రీమతి కృష్ణవేణి పుత్రేవు ప్రదర్శించిన “మధురాష్టకం” నృత్య ప్రదర్శన ఆహ్వానితులను ఎంతో ఆకట్టుకున్నది.

జ్యోతి వనం, వెంకట్ ములుకుట్ల విచ్చేసిన టాంటెక్స్ సంస్థ పూర్వాధ్యక్షులు ఒక్కొక్కరిని పేరుపేరునా కార్యవర్గ సభ్యులు కృష్ణా రెడ్డి ఉప్పలపాటి, చినసత్యం వీర్నపు, సునీల్ దేవిరెడ్డి, వెంకట్ దండ, వేణు పావులూరి, రఘు గజ్జల, శ్రీలు మందిగ ద్వారా సభకు పరిచయం చేస్తూ ఉండగా, ప్రస్తుత అధ్యక్షులు విజయమోహన్ కాకర్ల వారందరినీ సత్కరించారు. సభకు విచ్చేసిన పూర్వ అధ్యక్షులు వారి వారి హయాంలో సంస్థ సాధించిన విజయాలను, విశేషాలను విచ్చేసిన వారందరితో పంచుకున్నారు.

ప్రపంచంలో వున్న తెలుగు చలన చిత్ర గాన ప్రియులందరికీ “పాడుతా తీయగా” కార్యక్రమం ద్వారా పరిచయం అయిన మన డాలస్ తెలుగు చిన్నారులు నేహా ధర్మాపురం, ప్రజ్ఞ బ్రహ్మదేవర కొన్ని పాటలు పాడి అందరి దీవెనలు పొందారు.

సాంస్కృతిక కార్యకలాపాల సమన్వయ కర్త శారద సింగిరెడ్డి ఆధ్వర్యంలో స్థానిక కళాకారులు సాంబ కర్నాటి, వీణ ఎలమంచి, రవి తుపురాని, సృజన అడూరి, ప్రభాకర్ కోట, జ్యోతి సాధు, పూజిత కడిమిసెట్టి, నాగి ఆలపించిన పాత-కొత్త చలన చిత్ర గీతాలు అందరిని ఆకట్టుకున్నాయి. ఇకపోతే, ప్రస్తుత కార్యవర్గ సభ్యులందరూ కలిసి ‘తెలుగు జాతి మనది ‘ అనే చలన చిత్ర గీతానికి చేసిన నృత్య ప్రదర్శన అందరి ప్రశంసలు పొందింది.

ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షుడు విజయ మోహన్ కాకర్ల సభను ఉద్దేశించి ప్రసంగిస్తూ 2014 సంవత్సరంలో సభ్యుల అవసరాలకు అనుగుణంగా నిర్వహించిన వివిధ కార్యక్రమాల వివరాలను తెలిపారు. ముందు ముందు సంస్థ మరిన్ని నాణ్యమైన కార్యక్రమాలను అందించడానికి ప్రయత్నిస్తుందని హామీ ఇచ్చారు.

తర్వాత ‘2014 వార్షిక దీపిక’ (directory) ఆవిష్కరణ జరిగింది. దీనికి ప్రస్తుత ఉపాధ్యక్షులు, జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం ముఖ్య సంపాదకులుగా వ్యవహరించారు. ఇందులో 1986 లో సంస్థ ఆవిర్భవించి నప్పటినుంచి నేటి వరకూ పని చేసిన కార్యవర్గ సభ్యులందరి సమాచార వివరాలతో పాటు, ప్రస్తుత జీవిత కాల సభ్యుల వివరాలు మరియు 2014 లో సంస్థ చేపట్టిన కార్యక్రమాలు పొందుపరచబడ్డాయి.

ఈ రోజు కార్యక్రమంతో పాటు, ‘రుచి ప్యాలస్’ వారందించిన విందు భోజనం తప్పకుండా ఈ రోజు ఎప్పటికి గుర్తుండిపోయేలా చేస్తుంది. తర్వాత పాలక మండలి సభ్యుడు సుగన్ చాగర్లమూడి , ప్రస్తుత అధ్యక్షులు విజయమోహన్ కాకర్ల వందన సమర్పణలో , పోషక దాతలకు, ప్రత్యేక ప్రసార మాధ్యమాలైన దేశీ ప్లాజా, రేడియో ఖుషి మరియు ప్రసార మాధ్యమాలైన టీవీ9, టీవీ5, 6టీవీ లకు కృతఙ్ఞతా పూర్వక అభివందనములు తెలియజేసారు. ఆ తరువాత బాంబే ఫోటోగ్రఫీ మరియు కాలివిల్ కమ్యూనిటీ సెంటర్ యాజమాణ్యం కు కృతఙ్ఞతలు తెలపడంతో ఈ నాటి కార్యక్రమం ఆట్టహాసంగా ముగిసింది.


 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2014 Idlebrain.com. All rights reserved