pizza
TANTEX SWARAMANJARI Round 3
You are at idlebrain.com > NRI community >
Follow Us

To feature your NRI communty news in idlebrain.com, please mail us at [email protected]

29 September 2015
Hyderabad

ప్రతిభా ‘పాట’వాలకు పట్టం కడుతున్న టాంటెక్స్ ‘స్వరమంజరి’ మూడవ ఆవృత్తం పాటల పోటీలకు విశేష స్పందన

ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) 2015 వ సంవత్సరంలో స్థానిక గాయనీ గాయకుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ‘స్వరమంజరి’ పాటల పొటీల కార్యక్రమం గత రెండు నెలలుగా జరుగుతున్న విషయం విదితమే! ఇందులో భాగంగా ‘స్వరమంజరి’- మూడవ ఆవృత్తం డాల్లస్ మహానగర ప్రాంతంలోని సెయింట్ మేరిస్ చర్చ్ లో ఈ నెల సెప్టెంబరు 26 తేదీన ఘనంగా నిర్వహించారు. టాంటెక్స్ ఆధ్వర్యంలో జరుగుతున్న స్వరమంజరి పాటల పోటీలు ప్రతిభకు పట్టం కడుతోంది. ఇప్పటికే మూడు ఆవృత్తాలు విజయవంతంగా సాగాయి. ప్రత్యేకించి స్థానికంగా ఉన్న గాయనీ గాయకుల్లోని ప్రతిభను వెలుగులోకి తీసుకు రావటం ప్రధాన లక్ష్యంగా నిర్వహిస్తున్న స్వరమంజరి పాటల పోటీలకు విశేష స్పందన లభిస్తోంది. ఈ పోటీలు నిష్పక్షపాతంగా నిర్వహించటంతో రసఙ్ఞ శ్రోతల ఆదరణ దీనికి తోడైంది. అమెరికాలోని ప్రవాసాంధ్రుల ప్రతిభను ప్రపంచానికి చాటి చెప్పేలా టాంటెక్స్ రూపొందించిన ఈ పాటల పోటీల ద్వారా సంగీతం అభ్యాసకులే కాక సగటు శ్రోతల్లో కూడా పోటీల్లో పాల్గొనాలనే ఉత్సాహం వ్యక్తమవుతోంది. ఎలాంటి ప్రవేశ రుసుము, ఆర్ధిక లాభాపేక్ష లేకుండా టాంటెక్స్ వంటి మేటి సాంస్కృతిక సంస్థ ఈ పోటీలను నిర్వహిస్తూ ఆదర్శంగా నిలుస్తోంది. స్వరమంజరి మూడవ అవృత్తంలో ఆర్ద్రత, బాధ, విరహ, విషాద గీతాలకు ప్రాధాన్యతనిచ్చి పోటీలో ఒక వినూత్న మలుపుని సృష్టించి పోటీను ఉత్కంఠ భరితంగా నిర్వహించారు.

జ్యొతీ ప్రజ్వలనతో సంస్థ అధ్యక్షులు డా. ఊరిమిండి నరసింహారెడ్డి, ముఖ్య అతిధి మరియు ప్రధాన న్యాయనిర్ణేత శ్రీమతి మణి శాస్త్రి, స్థానిక న్యాయనిర్ణేతలు శ్రీ రాజశేఖర్ సూరిభోట్ల, శ్రీ.శ్రీనివాస్ ప్రభల, ప్రత్యేక కార్యక్రమాల సమన్వయకర్త శ్రీమతి. శారద సింగిరెడ్డి, టాంటెక్స్ కార్యదర్శి శ్రీ.మహేష్ ఆదిభట్ల, సంయుక్త కార్యదర్శి శ్రీ చినసత్యం వీర్నపు, కోశాధికారి శ్రీమతి. కృష్ణవేణి శీలం మరియు కార్యవర్గ సభ్యులు శ్రీ దండ వెంకట్, పాలకమండలి సభ్యులు శ్రీమతి శ్యామ రుమల్ల, రామకృష్ణ రెడ్డి రొడ్డ పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. టాంటెక్స్ ప్రత్యేక కార్యక్రమాల జట్టు సభ్యులు శ్రీమతి. ఇందు పంచార్పుల, శ్రీమతి పల్లవి తోటకూర, శ్రీమతి. జయ తెలకలపల్లి, మరియు శ్రీ శ్రీనివాస్ మంచాల పాల్గొన్నారు. ఈ పాటల పోటీలకు ప్రధాన సంధానకర్తగా శ్రీ.అశ్విన్ కౌత వ్యవహరించారు.

ఈ కార్యక్రమానికి శ్రీమతి. వీణా యలమంచలి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ పాటల పోటీలకు శాస్త్రీయ సంగీత గాయకురాలు, శ్రీమతి మణి శాస్త్రి, శాస్త్రీయ సంగీత గాయకులు శ్రీ. శ్రీనివాస్ ప్రభల, సంగీత దర్శకులు శ్రీ.రాజశేఖర్ సూరిభొట్ల న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు.

సంగీతం ఒక సాగరమధనం. చతుషష్టి కళల్లో సంగీతం మొదటి స్థానంలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా తెలిసిన ఎకైక భాష సంగీతం. భాష లిపి లేనికాలం నుండే సంఙ్ఞలు, కూతలు, శబ్దాల ద్వారా మానవులు తమ భావాలను వ్యక్తీకరించేవారు. ప్రాచీన కాలంలో జానపదులు తమ శ్రమను మరిచిపోయి నూతనోత్తేజం పొందటానికి ఆశువులుగా పదాలను అల్లుకుని పాడుకునేవారు. ఆ పల్లె పదాలే శాస్త్రీయ సంగీతానికి మూలాలు. భారత దేశంలో ఉత్తరాదిన హిందుస్థానీ, దక్షిణాదిన కర్ణాటక బాణీలు స్థిరపడ్డాయి. తరువాత సంగీతంలో కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి. భాషకు అనుగుణంగా బాణీలు మలుచుకోవటం జరిగింది. అందులో శాస్త్రీయ, లలిత, భక్తి, జానపద, చలన చిత్ర, పాశ్చాత్య సంగీత బాణీలు ఏదైనా ‘స రి గ మ ప ద ని’ అనే సప్త స్వరాలు పునాదిగా సంగీత సౌరభం విస్తరించింది.

సంగీతమంటే కేవలం గానం, తాళం మాత్రమే కాదు. తత్వ, మనో వికాస, గణిత, శబ్ద, సాంఘిక, సాంకేతిక శాస్త్రాల సమాహార కళ. గాయకుని ప్రతిభను రాగాలాపన, స్వరకల్పన రూపంలో వ్యక్తీకరించే విధానమే మనోధర్మ సంగీతం. అటువంటి చక్కటి మనోధర్మాన్ని పాటిస్తూ గాయనీ గాయకులు పోటా పోటీ గా తమ ప్రతిభను కనబరిచారు.

ఇందులో ప్రభాకర్ కోట, సంతోష్ కమ్మంకర్, స్వప్న గుడిమెళ్ళ, పూజిత కడిమిసెట్టి, గోపాల్ చెరుకు, ఆషాకీర్తి ధర్మపురి, నాగి వడ్లమన్నాటి, సంగీత మరింగంటి, శ్రీని ఏలేశ్వరపు, సాయి రాజేష్ మహాభాష్యం, మురళి హనుమంతకారి, జానకి శంకర్, చక్రపాణి కుందేటి, శాంతి నూతి, ఎంతో ఔత్సుకతతో తమదైన శైలిలో ఆలపించారు. సుమారు ఐదు గంటలపాటు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ పాటల పోటీలకు ఆడియొ అందించినవారు శ్రీ. బాల గణపవరపు, వీడియొ శ్రీ. వెంకట్ జొన్నాడ, ఫొటోగ్రాఫి శ్రీ. భాస్కర్ తాతరాజు అందించారు.

ఇందులో భాగంగా కొందరు గాయనీ గాయకుల ముఖాముఖీలో గాయని సంగీత మరింగంటి మాట్లాడుతూ “ఈ మూడవ విడత అయ్యేసరికి టాంటెక్స్ సంస్థతో ఒక మంచి బంధం ఏర్పడిందనీ, న్యాయ నిర్ణేతల సూచనల మేరకు వారు ఎంతో నేర్చుకోగలుగుతున్నారని” అన్నారు. అలాగే గాయని ఆశా కీర్తి “సంస్థ సమయానికి పాడటానికి అవసరమైన శృతి మరియు ఆడియో ట్రాక్స్ అందించటం, ఏ రకమైన సాంకేతిక లోపాలు లేకుండా చూడడం ఒక విశేషం అన్నారు. ఈ తతంగానికి మొత్తం మూడు వారాలు వ్యవధి ఇవ్వటం వల్ల ట్రాక్స్ తో బాగా సాధన చేసే అవకాశం కలిగిందని ఆమె సంస్థను ప్రశంసించారు”. గాయకుడు సాయి రాజేష్ మహాభాష్యం మాట్లాడుతూ “న్యాయ నిర్ణేతల సలహాలు సూచనలు వింటుంటే శాస్త్రీయ సంగీత పరిఙ్ఞానం లేని అతనకి తప్పని సరిగా నేర్చుకోవాలన్న తపన కలుగుతోందని” అన్నారు. సంధానకర్త అశ్విన్ కౌత "స్వర సరస్వతీతో ప్రయాణం చేస్తున్నట్లు భావిస్తున్నారనీ, ఎప్పుడు చిన్నపిల్లలకు మాత్రమే పోటీలు నిర్వహించటం కాకుండా పెద్దవారికి పాటలు పాడే అవకాశాన్ని కల్పించి వారికి ఒక వేదికను ఇచ్చి సంస్థ ప్రోత్సహించటం ఒక సాహసం అనీ, ఆ సాహసం సంపూర్ణంగా రూపుదిద్దుకుంటోందనీ, అందుకు వారు గర్వ పడుతున్నారని” అన్నారు. ఇక్కడ ముఖ్యంగా చెప్పాల్సిన విషయం “పోటీలో పాల్గొన్న గాయనీ గాయకులకు ఇటీవల జరిగిన స్వరాభిషేకం లో గానగంధర్వులు పద్మభూషణ్ శ్రీ.ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం సమక్షంలో పాడే అవకాశం కూడా టాంటెక్స్ సంస్థ కల్పించటం ఒక విశేషం” అన్నారు.

టాంటెక్స్ సంస్థ అధ్యక్షులు డా. ఊరిమిండి నరసింహారెడ్డి మరియు కార్యవర్గ సభ్యులు న్యాయ నిర్ణేతలను సన్మానించి ఙ్ఞాపికను అందించారు. డా. ఊరిమిండి మాట్లాడుతూ ఇటీవల టాంటెక్స్ సంస్థ నిర్వహించిన స్వరాభిషేకం కార్యక్రమానికి విచ్చేసిన నాలుగు వేల అశేష జనవాహినికీ, డెబ్బై మంది పోషకులకు, ఆ కార్యక్రమానికి చేయూతనిచ్చిన పదహారు సంస్థలకు మరొక్కసారి కృతఙ్ఞతలు తెలుపుకుంటూ రాబోయే నాల్గవ ఆవృత్తం అక్టోబర్ 31, చివరి ఆవృత్తం డిసెంబర్ 5 వ తేదీ న జరగనున్నాయని వీటితోపాటు నవంబర్ 14 వ తేదీన దీపావళి వేడుకలు అర్వింగ్ హై స్కూల్ ల్లోను, నెలనెలా తెలుగు వెన్నెల సాహిత్య శత సదస్సు నవంబర్ 21 వ తేదీన మలంకార చర్చిలో ఘనం గా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాలకు అందరూ విచ్చేసి జయప్రదం చేయవలసిందిగా కోరారు.

చివరగా వందన సమర్పణలో శ్రీమతి.శారద సింగిరెడ్డి స్వరమంజరి కార్యక్రమానికి ప్రత్యేక ప్రసార మాధ్యమాలైన దేశీ ప్లాజా, రేడియో ఖుషి, మరియు ప్రసార మాధ్యమాలైన టీవీ9, టీవీ5, సీవీఆర్ టీవీలకు, స్వరమంజరి పాటల పొటీ విజేతకు బంగారు పతకాన్ని అందజేయనున్న తన్మయీ జ్యువెల్లర్స్ కు, కార్యక్రమ పోషకదాత కీ. శే. శ్రీ కె.ఎల్.ఎన్. ప్రసాద్ కుటుంబ సభ్యులకు, ఆడిటోరియం యాజమాన్యానికి, ఈ కార్యక్రమానికి స్వల్పాహారం అందించిన పీకాక్ కు కృతఙ్ఞతాపూర్వక అభివందనములు తెలియజేసారు.

--టాంటెక్స్ స్వరమంజరి కార్యక్రమంపై డా. సుధ కలవగుంట సమర్పించిన నివేదిక

 


 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved