pizza
Tantex Swaramanjari Grand Final in Dallas
విజయ భేరీని మ్రోగించిన టాంటెక్స్ స్వరమంజరి- అంతిమ ఘట్టం.. విజేతకు స్వర్ణ పతకం!
టాంటెక్స్ స్వరమంజరి: నిన్నటి కల...నేటి నిజం...రేపటి విశ్వాసం.
You are at idlebrain.com > NRI community >
Follow Us

To feature your NRI communty news in idlebrain.com, please mail us at [email protected]

11 December 2015
Hyderabad

ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) స్థానిక గాయనీ గాయకులకు ‘స్వరమంజరి’ అనే పాటల పొటీల కార్యక్రమం గత ఐదు నెలలుగా నిర్వహించింది. ఇందులో భాగంగా ‘స్వరమంజరి’- ఆఖరి ఆవృత్తం, డిసెంబర్ నెల 5 వ తేదీన డాల్లస్ లోని ‘జాక్ ఇ షింగ్లీ’ ఆడిటోరియంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించింది. వేదిక ప్రాంగణంలో అడుగిడుతూనే సుమాల సువాసనలు, అత్తరల గుబాళింపులు, శ్రావ్యానికి ఇంపుగా నాదస్వరం, వాగ్గేయకారుల ఛాయా చిత్రాలతో మనోహరంగా అలంకరించిన దృశ్యం ఆనాటి త్యాగరాయ గాన సభ, తుమ్మలపల్లి కళాక్షేత్రం, రవీంద్ర భారతి వంటి ప్రముఖ వేదికలను గుర్తుచేసింది. పాత రోజులు మర్చిపోతున్నమా? అనుకునే తరుణంలో ఇలాంటి పండుగ వాతావరణాన్ని సృష్టించిన టాంటెక్స్ ప్రత్యేక కార్యక్రమాల జట్టు అభినందనీయులు.

టాంటెక్స్ స్వరమంజరి పాటల పోటీలు ప్రతిభకు పట్టం కట్టింది. ఐదు ఆవృత్తాలు విజయవంతంగా సాగాయి. ప్రత్యేకించి స్థానికంగా ఉన్న గాయనీ గాయకుల్లోని ప్రతిభను వెలుగులోకి తీసుకు రావటం ప్రధాన లక్ష్యంగా నిర్వహించిన ఈ పాటల పోటీలకు విశేష స్పందన లభించింది. ఆనాటి పాత సినిమా పాటలతో పాటు నేటి పాప్ సాంగ్స్ రీమిక్స్ వరకు పాత కొత్తల మేలు కలయికగా ‘స్వరమంజరి’ పాటల పోటీలు రసఙ్ఞ ప్రేక్షకులను సంగీత సాగరంలో ఓలలాడించింది.

ఈ పోటీలు నిస్పక్షపాతంగా నిర్వహించటంతో రసఙ్ఞ శ్రోతల ఆదరణ దీనికి తోడైంది. అమెరికాలోని ప్రవాసాంధ్రుల ప్రతిభను ప్రపంచానికి చాటి చెప్పేలా టాంటెక్స్ రూపొందించిన ఈ పాటల పోటీల ద్వారా సంగీతం అభ్యాసకులే కాక సాధారణ సగటు శ్రోతల్లో కూడా పోటీల్లో పాల్గొనాలనే ఉత్సాహం వ్యక్తమయ్యింది. ఎలాంటి ప్రవేశ రుసుము, ఆర్ధిక లాభాపేక్ష లేకుండా టాంటెక్స్ వంటి మేటి సాంస్కృతిక సంస్థ ఈ పోటీలను నిర్వహించి ఆదర్శంగా నిలిచింది. స్వరమంజరి ఆఖరి ఆవృత్తంలో గాయకుల ఇష్టానుసారంగా ఒక పాట, తదుపరి న్యాయనిర్ణేతల ఎంపిక మేరకు ఒక పాట పాడవలసిందిగా నిబంధనలను పెట్టి పోటీలో ఒక వినూత్న మలుపుని సృష్టించి పోటీను మరింత కఠినంగా నిర్వహించారు.

ముందుగా జ్యోతి ప్రజ్వలనతో సంస్థ అధ్యక్షులు డా. ఊరిమిండి నరసింహారెడ్డి, ముఖ్య అతిధి మరియు ప్రధాన న్యాయనిర్ణేత, చలన చిత్రాల గేయ రచయిత, శ్రీ చంద్రబోసు గారు, స్థానిక న్యాయనిర్ణేతలు శ్రీ రాజశేఖర్ సూరిభోట్ల, శ్రీ.శ్రీనివాస్ ప్రభల, టాంటెక్స్ ఉత్తరాధ్యక్షులు శ్రీ.సుబ్రహ్మణ్యం జొన్నలగడ్డ, ప్రత్యేక కార్యక్రమాల సమన్వయకర్త శ్రీమతి. శారద సింగిరెడ్డి, టాంటెక్స్ కార్యదర్శి శ్రీ.మహేష్ ఆదిభట్ల, సంయుక్త కార్యదర్శి శ్రీ చినసత్యం వీర్నపు, కోశాధికారి శ్రీమతి. కృష్ణవేణి శీలం, సంయుక్త కోశాధికారి శ్రీ. వేణు పావులూరి, మరియు కార్యవర్గ సభ్యులు శ్రీ.వెంకట్ దండ, శ్రీమతి.శ్రీలక్ష్మీ మండిగ, శ్రీ. శ్రీనివాస్ రెడ్డి గుర్రం తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. టాంటెక్స్ ప్రత్యేక కార్యక్రమాల జట్టు సభ్యులు శ్రీమతి. ఇందు పంచార్పుల, శ్రీమతి. జయ తెలకలపల్లి, శ్రీమతి. పల్లవి తోటకూర, శ్రీ నరేష్ సుంకిరెడ్డి, శ్రీ పవన్ గంగాధర్, శ్రీ వెంకట్ కోడూరి మరియు శ్రీ రవితేజ పాల్గొన్నారు. ఈ పాటల పోటీలకు ప్రత్యేక కార్యక్రమాల సమన్వయకర్త శ్రీమతి. శారద సింగిరెడ్డి స్వాగతం పలికారు.

ఈ కార్యక్రమానికి శ్రీమతి. సంధ్య అబ్బూరి, శ్రీ.అశ్విన్ కౌత వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. ఈ పాటల పోటీలకు చలన చిత్రాల గేయ రచయిత, శ్రీ చంద్రబోసు గారు, శాస్త్రీయ సంగీత గాయకులు శ్రీ. శ్రీనివాస్ ప్రభల, సంగీత దర్శకులు శ్రీ.రాజశేఖర్ సూరిభొట్ల అతిరథ మహారథులు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు.

లలిత కళల్లో దృశ్యకళలు, శ్రవ్యకళలు అని రెండుగా విభజించబడ్డాయి. దృశ్యకళలు ఎంతగ సొంపైనవో అంతగా ఇంపైనవి శ్రవ్యకళలు. నాట్యం దృశ్యకళకు, సంగీతం శ్రవ్యకళకు చెందింది. సంగీతం ప్రాకృతిక జీవముల నుండి ఉద్భవించింది. ప్రకృతిలోని జంతువుల అరుపుల అనుకరణే సంగీతానికి మూలం. భారతీయ సంగీతంలోని సప్త స్వరాలు స రి గ మ ప ద ని అనేవి స-షడ్జ, రి-రిషభ, గ-గాంధార, మ-మధ్యమ, ప-పంచమ, ద-ధైవత, ని-నిషాదములనే వాటికి క్రమంగా సంకేతాలు. ఇవి పాశ్చాత్య సంగీతంలో సి, డి, ఎ, ఎఫ్, జి, ఎ, బి అనే స్వరాలకి దాదాపుగా క్రమం సరిపొతుంది. స- నెమలి అరుపు, రి-ఎద్దు రంకె, గ-మేక అరుపు, మ-నక్క ఊళ్ళ ప-కోయిల కూజితం, ద-గుర్రపు సకిలింపు ని-ఏనుగు ఘీంకారము నుండి రూపుదిద్దుకున్నాయని శాస్త్రఙ్ఞులు ఏనాడో తెలియజేసారు. రెండువేల సంవత్సరాల చరిత్ర కలిగిన భరతుని నాట్య శాస్త్రం లో సంగీతం, స్వరం- ఆతోద్యం- గానం అనీ, ఆతోద్యం అంటే వాద్యానికి, గానం పాటకు, స్వరం ఇటు వాద్యానికి గానానికి రెండింటికి సంబంధించి, వివిధాశ్రయములైన ఈ మూడు ఒకదాని వెంబడి ఇంకొకటి ప్రయుక్తం అవుతూ ఉండాలని అప్పుడే ఇది ‘గాంధర్వం’ అనబడుతుందని తెలియజేసాడు. అంతేకాక గాంధర్వంలో స్వరం, తాళం, పదం ఈ మూడిటి కలయికతో సంగీతానికి సంపూర్ణమైన రూపాన్ని ఇవ్వగలుగుతామని తెలియజేసాడు. అందుచేత ఒక పాట పాడాలంటే వాటి లోని మెళకువలను తెలుసుకుని గాయనీ గాయకులు కృషితో సాధన చేయవలసి ఉంటుంది. స్వరమంజరి పాటల పోటీ మొదటి ఆవృత్తంలో 25 మంది కళాకారులు తలపడగా చివరి అంకానికి వచ్చేసరికి ఆరుగురు పోటీకి తలపడ్డారు. మొదటి ఆవృత్తంలో గాయనీ గాయకుల పాట,కు చివరి ఆవృత్తంలోని పాడే విధానానికి ఎంతో మార్పు ప్రస్పుటంగా కనిపించింది. టాంటెక్స్ వారి స్వరమంజరి బానెర్ లో ‘Take your singing Good to Great’ అనేది తప్పక న్యాయం చేకూరింది. సాధన, పట్టుదల అనేవి ఉంటే ఏదైనా సాధించగలం అనేది మరొక్కసారి రుజువయ్యింది.

టాంటెక్స్ అధ్యక్షుడు డా. ఊరిమిండి నరసింహారెడ్డి సభనుద్దేశించి మాట్లాడుతూ, “స్వరమంజరి కార్యక్రమానికి ఇంతవరకు అనూహ్య స్పందన లభించింది. స్థానికుల గాయనీ గాయకుల ప్రతిభా ప్రదర్శనకు ఇది ఒక సరికొత్త వేదిక. గాయనీ గాయకులలో పాట బాగా నేర్చుకోవాలన్న తపన పెరగడం, వారి మధ్య సంబంధ బాంధవ్యాలు పటిష్టం కావడం, వారి మనోస్థైర్యం మరింత పెరగడం వంటి మార్పులు మన తెలుగు సంస్కృతికి సోపాన మార్గాలు” అన్నారు.

చివరి ఆవృత్తంలో ప్రభాకర్ కొట, పూజిత కడిమిసెట్టి, ఆషాకీర్తి లంక, సంగీత మరిగంటి, సాయిరాజేష్ మహాభాష్యం, జానకి శంకర్, ఎంతో ఔత్సుకతతో తమదైన శైలిలో ఆలపించారు. ఈ పొటీలో ప్రధమ స్థానంలో జానకి శంకర్ బంగారు పతకం, ద్వితీయ స్థానంలో సాయి రాజేష్ మహాభాష్యం రజిత పతకం, తృతీయ స్థానంలో పూజిత కడిమిసెట్టి కాంస్య పతకం గెలుచుకున్నారు. సుమారు ఐదు గంటలపాటు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ పాటల పోటీలకు ఆడియొ అందించినవారు శ్రీ. బాల గణపవరపు, వీడియొ శ్రీ. బాలు ఫొటోగ్రాఫి శ్రీ. ప్రవీణ్ యార్లగడ్డ అందించారు.

మధ్య మధ్యలో నర్తకి శ్రీమతి.రూపా బంద నిర్వహణలో వారి బృందం చే యమునా తరంగం యతిరాజు తారంగం యదలోని తాళం ఒకటే కులం, శివ పూజకు చిగురించిన, మరియు దేశమంటే మనుష్యులోయ్ వంటి పాటలకు చక్కటి ఆంగికాభినయంతో తాళ లయ విన్యాసాలతో నృత్యాన్ని ప్రదర్శించారు.

టాంటెక్స్ సంస్థ అధ్యక్షులు డా. ఊరిమిండి నరసింహారెడ్డి మరియు కార్యవర్గ సభ్యులు న్యాయ నిర్ణేతలను సన్మానించి ఙ్ఞాపికను అందించారు.

చివరగా వందన సమర్పణలో ప్రత్యేక కార్యక్రమాల సమన్వయకర్త శ్రీమతి. శారద సింగిరెడ్డి, స్వరమంజరి కార్యక్రమానికి ప్రత్యేక ప్రసార మాధ్యమాలైన, దేశీ ప్లాజా, రేడియో ఖుషి, ఎక్ నజర్, టోరి, హమార, మరియు ప్రసార మాధ్యమాలైన ఐన టీవీ, టీవీ9, టీవీ5, సీవీఆర్ టీవీలకు, స్వరమంజరి పాటల పొటీ విజేతకు బంగారు పతకాన్ని అందించిన తన్మయీ జ్యువెల్లర్స్ కు, కార్యక్రమ పోషకదాతలకు, ఆడిటోరియం యాజమాన్యానికి, ఈ కార్యక్రమానికి స్వల్పాహారం అందించిన పీకాక్ రెస్టారెంట్ కు కృతఙ్ఞతా పూర్వక అభివందనములు తెలియజేసారు.

--టాంటెక్స్ స్వరమంజరి కార్యక్రమంపై డా. సుధ కలవగుంట సమర్పించిన నివేదిక

టాంటెక్స్ సంస్థ అధ్యక్షులు డా. నరసింహారెడ్డి ఊరిమిండితో ముఖాముఖి:
ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజినీరుగా ఉన్నతమైన వృత్తిని చేపట్టిన డా. నరసింహారెడ్డి ఊరిమిండి ప్రవృత్తి రిత్యా కళాపిపాసి కావడంతో ఇటువంటి వినూత్న కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. సంస్థలో గత పాతిక సంవత్సరాలుగా సేవలందిస్తున్న డా. నరసింహారెడ్డి అధ్యక్షస్థానాన్ని అధీష్టించిన తరువాత ఎన్నో ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాలను ఏర్పాటు చేసి అందరి మన్ననలను అందుకున్నారు. స్వరాభిషేకం, స్వరమంజరి, స్వరమాధురి, వసంతగాన సౌరభం, సాహిత్య వేదిక, మైత్రి, వనితా వేదిక, ఉగాది ఉత్సవాలతోపాటు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం వంటి దిగ్గజాలను అమెరికాకు ఆహ్వానించి వారి ప్రదర్శనలను ఏర్పాటు చేయటం ఆయనలోని కళాపోషణకు నిలువెత్తు నిదర్శనం. వారితో కొన్ని ముచ్చట్లు...

1.టాంటెక్స్ సంస్థతో మీకున్న అనుబంధం?
పాతిక సంవత్సరాలక్రితం అమెరికాలో ఒక స్టూడెంట్ గా అడుగుపెట్టాను. అప్పుడు టాంటెక్స్ సంస్థ గురించి తెలుసుకొని ఐదు డాలర్ల స్టూడెంట్ మెంబెర్ షిప్ తో ప్రయాణం మొదలు పెట్టి, సంస్థతో అనుబంధం పెంచుకుని గత పాతిక సంవత్సరాలుగా పనిచేసి, ఈ అధ్యక్షత స్థానానికి చేరుకున్నాను. రెప్పపాటు సమయంలో తెలియకుండానే జరిగిపొయాయి.

2.అధ్యక్షత స్థానాన్ని అధీష్టించటానికి పాతిక సంవత్సరాలు పట్టటానికి కారణం?
నేను వచ్చిన ఐదు సంవత్సరాలికే నాకు పదవిని అధీష్టించమని టాంటెక్స్ సంస్థవారు అడిగారు. ఆ రోజుల్లో ఎన్నికలు ఉండేవి కాదు. కానీ నా ముందు చాల మంది పెద్దవారు ఉండటం చేత వారికి ముందు అవకాశం వస్తే బాగుంటుందనీ , పదవీ కాంక్ష కన్నా కూడా సేవ చెయ్యాలనే సదుద్దేశ్యం తో ఉన్నాను.కానీ ఇప్పుడు పదవి ఉన్నప్పుడు మరికొన్ని మంచి కార్యక్రమాలు చేసే ఆలోచన, అవకాశం ఉంటుందని ఈ సంవత్సరం అధ్యక్షత స్థానాన్ని చేపట్టాను.

3.ఈ పాతిక సంవత్సరాల వ్యవధి లో ఎన్నో కార్యక్రమాల్లో పాలుపంచుకున్న మీరు సంస్థ నుండి మరియు ఇతర సభ్యులనుండి ఎమైన నెర్చుకున్నారా?
నిబద్ధత, క్రమశిక్షణ, సందర్భానికి కావలసిన పరిఙ్ఞానం, వంటి ఎన్నో విషయాలను నేర్చుకొవటం జరిగింది.

4. మీరు సమయం సెకెండ్లతో సహా చాలా చక్కగా పాటిస్తారు. సమయానికి మీరు ఇచ్చే విలువ?
కాలం చాల విలువైంది. అటువంటి కాలాన్ని జనం వృధా చేస్తారు. చాలా కార్యక్రమాల్లో ఇచ్చిన సమయం కంటే ఒక గంట ఆలస్యంగా జనం రావటం జరుగుతుంది. సంస్థలోని ప్రతి వ్యక్తి తన బాధ్యతను గ్రహించి, కాలాన్ని వృధా చేయకుండా సమయాన్ని పాటిస్తే సంస్థకు, సమాజానికి కూడా మంచి అభివృద్ధి ఉంటుంది.

5.ఇన్ని సంవత్సరాల అనుభవం ఉన్న మీరు ఇటువంటి మంచి కర్యక్రమాలు చేయటంలో గత అనుభవం తొడైందా లేక మీ సొంత ఆలోచనలతో కూడుకున్నటువంటిదా?
ఏ పనిలోనైన పరిఙ్ఞానం సంపాదించాలంటే గతంలో జరిగిన కార్యకమాలను చూసి నేర్చుకోవటం అలాగే అందులోనున్న లోటు పాట్లను తెలుసుకొని, ఆ తప్పులు చేయకుండా సరిదిద్దుకుని, వీటికి సొంత ఆలోచనలను జోడించి కార్యక్రమాలను నిర్వహించటం జరిగింది. ప్రకృతిలో ప్రతి అంశం నేర్చుకోతగినదే! నేర్చుకోవాలి అన్న తపన ఉండాలి. అందు చేత నేను ఎప్పుడు చెప్తాను “సేవ చేసే ప్రతి అవకాశం సేవకుల సామర్థ్యాన్ని పెంచే ఉత్తమ అవకాశం” అని. సంస్థలో పని చేయటం వల్ల పరిఙ్ఞానం తోపాటు ఆత్మస్థైర్యం కూడా పెరిగింది.

6. స్వరమంజరి, స్వరమాధురి వంటి కార్యక్రమాలు అన్నీ సంగీతానికి సంబంధించీ అలాగే సాహిత్య వేదికలో ఎంతోమంది ప్రముఖులను పిలిపించి వారిచే ఎన్నో తెలియని విషయాలు తెలియజేస్తున్నారు కళాకారులకు. మరి నృత్యానికి ఎందుకు ప్రాధాన్యత ఇవ్వటం లేదు దానికి మీరు ఏమంటారు?
ఇది చాలా చక్కని ప్రశ్న అండి. గతంలో మేము నాట్యానికి ప్రాధాన్యత ఇచ్చినప్పటికీ ప్రత్యేకించి కార్యక్రమాలను చెయ్యలేద
ు. ఇకముందు తప్పక నృత్యానికి కూడా మంచి ప్రాధాన్యత ఉండేలా మంచి కార్యక్రమాలను నిర్వహించేందుకు తప్పక ప్రయత్నిస్తాం.

7.ఇటీవల టాంటెక్స్ సంస్థ నిర్వహించిన స్వరాభిషేకం కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు మరి అలాగే ఇక ముందు మీ ఆధ్వర్యంలో అటువంటి కార్యక్రమాలు ఎమైనా చేసే ఉద్దేశ్యం ఉందా?
స్వరాభిషేకం ఒక మాహా యఙ్ఞం. నాలుగువేలమంది అశేష జనం, డెబ్భై మంది పోషక దాతలు, చేయూతనిచ్చిన పదహారు సంస్థలు, ఆర్దికంగా కూడా అంత పెద్ద కార్యక్రమాలు చెయ్యాలంటే వెంట వెంటనే చెయ్యటం చాల కష్టం. కాకపోతే కొంచెం భిన్నంగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం.

8. చివరగా ఈ సంవత్సరం లో ఇంకా ఇది చేసుంటే బాగుంటుంది కాని చెయ్యలేకపోయాను అనీ, రాబోయే తరాల వారికి మీరు ఇచ్చే సూచన సందేశం?
స్వరమంజరి, స్వరమాధురి, కార్యక్రమాలేకాక, దీపావళి వేడుకల్లో మొబయిల్ ఆప్ రిలీజ్ చేసాము. ముఖ్యంగా మహిళలకు ఆటల
పోటీలు పెట్టాము. అలాగే వృద్ధులకు కుడా కొన్ని కార్యక్రమాలు చేసాము. విశ్వవిద్యాల్లోని విద్యార్థులకు ఏ విధంగా దగ్గర కావాలో ప్రయత్నిస్తున్నాము. ఇక భావి తరాల వారు బాధ్యతలను మర్చిపోవద్దు. నేర్చుకోవాలి, పని చేయాలి, పని చేయించాలి, అందరికీ అందుబాట్లో ఉండాలి. అలాచెయ్యటం మా వల్ల కాదు అంటే వేరే వారికి సేవ చెయ్యటానికి అవకాశం ఇవ్వండి .

మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి మా పాఠకులకు మంచి విషయాలు తెలియజేసారు ధన్యవాదలు….నమస్కారం…

--టాంటెక్స్ స్వరమంజరి కార్యక్రమంపై డా. సుధ కలవగుంట సమర్పించిన నివేదిక


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved