pizza
TANTEX Deepavali Vedukalu - 2017
You are at idlebrain.com > NRI community >
Follow Us

To feature your NRI communty news in idlebrain.com, please mail us at [email protected]

3 November 2017
Hyderabad

మనకు ఎన్నో పండుగలు ఉన్నా దీపావళి పండుగ మాత్రం ఎంతో ప్రత్యేకమైనది, తెలుగు రాష్ట్రాలలోనే కాదు , ప్రపంచం నలుమూలలా కాంతి నింపే దీపాల రంగవల్లి దీపావళి.  ఈ  ఉత్సాహం  అమెరికా సంయుక్త రాష్ట్రాలలో ఇంకా ఎక్కువగా కనిపిస్తుంది.. అమెరికా తెలుగు సాంస్కృతిక రాజధానిగా పేరొందిన డల్లాస్ నగరంలో, తెలుగు ప్రజల గుండె చప్పుడు , తెలుగుదనానికి మాతృక అయిన టాంటెక్స్ వారి దీపావళి వేడుకలు స్థానిక మార్తోమా చర్చి ఆడిటోరియంలో  శనివారం రోజున కన్నుల పండుగగా జరిగాయి. ఈ దీపావళి సంబరాలను టెక్సాస్  రాష్ట్రం నుండే  కాక  ఎన్నో  వేల  మైళ్ళు  ప్రయాణించి , ప్రక్క రాష్టాలనుండి వచ్చిన తెలుగు వారు , ఆద్యంతం ఎంతో ఉల్లాసంగా, బంధుమిత్రులతో,  ఆత్మీయులతో  ఘనంగా జరుపుకున్నారు.

ప్రాంగణమంతా ఎపిక్ ఈవెంట్స్ వారు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అందమైన అలంకరణతో ముస్తాబై, అతిధులకు, ప్రేక్షకులకు ఆహ్వానం పలికింది. టాంటెక్స్ సాంస్కృతిక బృంద సమన్వయకర్త పద్మశ్రీ తోట ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా  తన సహజ సిద్దమైన సుమధుర వ్యాఖ్యానం తో, సున్నిత హాస్యంతో, ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు.  స్థానిక కళాకారులు ప్రదర్శించిన శాస్త్రీయ నృత్యాలు, సినిమా డాన్సులు, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. పసందైన విందు, కళకళలాడుతున్న అంగళ్ళతో ఆవరణ అంతా పండుగ వాతావరణం నెలకొంది.

ప్రార్ధనా గీతంతో మొదలైన కార్యక్రమాలు,  సంప్రదాయ  కీర్తనలతో , నృత్యాలతో , మెడలీ పాటలతో, ఎంతో హుషారుగా సాగాయి.  ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన తరుణం రానే వచ్చింది, బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో ద్వారా ఎంతో ప్రాచుర్యం పొందిన హరితేజ, ధనరాజ్ లను ,  తెలుగు రాప్ పాటలతో పేరు తెచ్చుకొన్న రేపర్  రోల్ రైడ లను ఒక్కసారిగా చూసిన ప్రేక్షకులు  చాలా సేపటివరకు తమ కరతాళ ధ్వనులతో, కేరింతలతో చిన్న పాటి సునామీ సృష్టించారు. వారు కూడా అంచనాలకు ఏమీ తగ్గకుండా చక్కని హాస్య నాటికలతో, పంచ్ డైలాగులతో, విపరీతంగా నవ్వించారు. హరితేజ గారిని  అమెరికా చిన్నారులు ఎంతో మంది కలిసి, ఆత్మీయంగా హత్తుకొని, ఎంతో ప్రేమ కనపరిచారు. ఆవిడ ఈ  అభిమానానికి చలించి,  డల్లాస్ కు టాంటెక్స్ కు మనసారా కృతజ్ఞతలు చెప్పారు. రోల్ రైడ అయితే స్టేజీనుండి క్రిందకు దిగి, ప్రతి ఒక్క చిన్నారిని కలిసి వారితో రాప్ డాన్స్ చేశారు, ముఖ్యముగా ‘పతంగ్’ అనే పాటను ప్రేక్షకులు  కోరిక మేరకు రెండు సార్లు పాడారు. ధనరాజ్ గారు అ నుండి అః వరకు ఒక్కో  అక్షరమే వాడి  ప్రేమికుల మధ్య సంభాషణను హాస్యవంతంగా చేసిన స్కిట్ ప్రశంసలు అందుకొంది.  

అటు తరువాత , స్టేజీమీద ఒక్కసారిగా చీకట్లు కమ్ముకొన్నాయి , ఏంజరిగిందో అనుకొనే లోగా ఒక్కో దీపం వెలగడం, రంగురంగుల దీపాల కాంతులలో 50 కి పైగా కళాకారులు చేసిన ప్రదర్శన డల్లాస్ కళాకారుల ప్రతిభకు తార్కాణం. రేడియం కాంతులతో నిజంగానే పటాసులు కాలుస్తున్నారా అనేంత ఆహ్లాదంగా సాగిన ఈ ప్రదర్శన అశేష నీరాజనాలు అందుకొంది .  అందమైన భామలు  “వచ్చిండే - మెల్ల మెల్లగా వచ్చిండే” అని చేసిన నృత్యాలు, సంప్రదాయాన్ని మరువకుండా చేసిన కూచిపూడి నృత్యాలు సమపాళ్ళలో మేళవించి చక్కని అనుభూతి అందించాయి.  

కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు ఉప్పలపాటి కృష్ణారెడ్డి మాట్లాడుతూ తెలుగు సంస్కృతీ సాంప్రదాయలకు పట్టం కట్టి, తరాలు మారినా తెరమరుగు కాకుండా రక్షణ ఛత్రంలా నిలబడటo, తెలుగు భాషను రక్షించుకోవడం,వ్యాప్తి చేయడం, భావితరాలకు అందించడమే టాంటెక్స్ లక్ష్యమని వెల్లడించారు. కొత్తగా భారత దేశాన్నుంచి వచ్చే వారే కాక, అమెరికా లోని ఇతర రాష్ట్రాలనుండి వచ్చే తెలుగు వారి సంఖ్య బాగా పెరుగుతున్న నేపథ్యంలో మన టాంటెక్స్ సంస్థ ఎంతో అభివృద్ధి సాధించే అవకాశం ఉంది అని తెలిపారు. మరియు ఈ దీపావళి అందరి జీవితాలలో కొత్త వెలుగులు నింపాలని, కష్టాలు తొలంగించాలని ఆకాక్షించారు.

వచ్చిన వారికి షడ్రషోపేత  తెలుగు భోజనంతో పాటు  అందుబాటు ధరలలో  నాణ్యమైన ధరలకు వస్త్రాభరణాలు, ఇంకా ఎన్నో ఉపయోగ కరమైన స్టాళ్లు టాంటెక్స్ వాళ్ళు ఏర్పరిచారు. కమ్మని విందుతో పాటు చక్కని సాంస్కృతిక కార్యక్రమాలు,విచ్చేసిన అందరిని అలరించాయి. దీపావళి వేడుకల ప్రాంగణమంతా చక్కటి సాంప్రదాయ దుస్తులతో విచ్చేసిన పిల్లలు, పెద్దలతో పండుగ వాతావరణం నెలకొన్నది.

ఈ దీపావళి కార్యక్రమ ప్రెజెంటింగ్ పోషకులు TPAD సంస్థకు మరియు కార్యక్రమ పోషకులైన రమణారెడ్డి క్రిష్టపాటి గారికి, డా.రాఘవేంద్ర ప్రసాద్ గారికి, ఆత్మచరణ్ రెడ్డి గారికి, అప్పారావు యార్లగడ్డ గారికి, సతీష్ మండువ గారికి , రామారావు ముళ్ళపూడి గారికి జ్ఞాపికలు ప్రధానం చేసి టాంటెక్స్ సంస్థ అధ్యక్షులు మరియు కార్యవర్గ సభ్యులు, తమ కృతఙ్ఞతలు తెలియచేసారు.

అతిథుల సన్మాన కార్యక్రమంలో ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) అధ్యక్షులు ఉప్పలపాటి కృష్ణారెడ్డి మరియు కార్యవర్గ బృందం, పాలకమండలి అధిపతి రోడ్ద రామకృష్ణ రెడ్డి మరియు బృందం పాల్గొని పుష్ప గుచ్చం మరియు జ్ఞాపికలతో ప్రేక్షకుల కరతాళ ధ్వనుల మధ్య సన్మానించారు.

చివరగా కార్యక్రమ సమన్వయకర్త పార్నపల్లి ఉమామహేష్ వందన సమర్పణ చేస్తూ సహాయం అందించిన సంస్థలకు, స్వచ్ఛంద సేవకులకు, పోషకదాతలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అర్ధరాత్రి కావస్తున్నా , చివరివరకు ఉండి  టాంటెక్స్ దీపావళి సంబరాలకు ఇంత ఘన విజయం చేకూర్చిన ప్రేక్షకులకు  అధ్యక్షులు ఉప్పలపాటి కృష్ణారెడ్డి గారు పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు . 

ప్రత్యేక ప్రసార మాధ్యమాలైన ఫన్ ఏసియా మరియు ప్రసార మాధ్యమాలైన టీవీ9, టీవీ5, టి.ఎన్.ఐ, , తెలుగు టైమ్స్ లకు కృతఙ్ఞతా పూర్వక అభివందనములు తెలియజేశారు. ఎంతో కృషి, సమయం వెచ్చించిన టాంటెక్స్ కార్యవర్గ సభ్యులకు మరియు వివిధ కమిటీ సభ్యులకు, స్వచ్ఛంద కార్యకర్తలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. భారతీయ జాతీయ గీతం ఆలపించడంతో, ఆహ్లాదంగా గడిచిన ఈ కార్యక్రమానికి తెర పడినది.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved