pizza
Telugu Maatlata Language Championship Finals in Dallas
అమెరికాలోని డాలస్ మహా నగరంలో ఈ వారాంతంలో తెలుగు తేజం వెల్లివిరిసింది
You are at idlebrain.com > NRI community >
Follow Us

To feature your NRI communty news in idlebrain.com, please mail us at [email protected]

9 September 2015
Hyderabad

సిలికానాంధ్ర మనబడి సంస్థ అమెరికా లోని తెలుగు పిల్లలకోసం నిర్వహిస్తున్న తెలుగు మాట్లాట మూడవ జాతీయ స్థాయి పోటీలు స్థానిక జాక్ సింగ్లీ అకాడెమీ లో వైభవంగా జరిగాయి. మనబడి కళాదర్శకులు, కస్తూరి ఫణిమాధవ్ సృజించిన అద్భుతమైన వేదిక ఆధునిక సాంకేతికత సహకారంతో ఆటలకి అందమైన ప్రాంగణం అయ్యింది. మే, జూన్ మాసాలలో ప్రాంతీయ స్థాయిలో దేశ వ్యాప్తంగా 18 నగరాల నుంచి దాదాపు వెయ్యి మంది వఱకు పాల్గొన్న పోటీలలో 46 మంది చిన్నారులు ఈ జాతీయ స్థాయి "పదరంగం" మరియు "తిరకాటం" పోటీలకు అర్హత సంపాదించుకున్నారు. డాలస్ మనబడి జట్టు కీలక సభ్యులు, కస్తూరి గౌతమ్ సారథ్యంలో, తెలుగు మాట్లాట సంధాత తోటపల్లి డాంజీ, మాట్లాట సంజీవని సంధాత రాయవరం భాస్కర్ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం ఆద్యంతమూ ఆసక్తికరంగా సాగింది. విశ్వకర్మ జొన్నవిత్తుల శ్రీనాధ్ నిర్మించిన మాట్లాట సరణి “మాయాదర్పణం”, మాట్లట “సంజీవని”లో భాగంగా గంగిశెట్టి లక్ష్మీనారాయణ తయారు చేసిన ప్రశ్నావళి, పదకోశం ఈ ఆటలకి మూలంగా నిలువగా , భువన్ పాశం సాంకేతిక సమర్థత, గాత్రదాత చింతలపాటి శ్రీధర్ ఉచ్చారణ జీవం పోసాయి.

శనివారం నాడు అన్ని విభాగాలలోనూ సాగిన తొలి విడత పోటీలేకాక, 5 నుండి 9 యేళ్ళ "బుడతల" పదరంగం పోటీలు నువ్వా నేనా అన్నట్టు సాగాయి. మూడేళ్ళ నుండి పోటీలలో పాల్గొంటున్న నిడమర్తి ధ్రువసాయి విజేతగాను, పెద్దింటి శ్రీమయి మలివిజేతగాను నిలిచారు. ఆదివారం ఉదయం తిరకాటం మలి పోటీల అనంతరం 10-13 యేళ్ళ "సిసింద్రీల" ల విభాగంలో మాదిరెడ్డి సంస్కృతి విజేతగాను, ఘంటసాల శ్రీవైష్ణవి మలి విజేతగా నిలిచారు. భోజనానంతరం జరిగిన చివరి విడత తిరకాటం పోటీలలో బుడతల విజేతలుగా మానికొండ ప్రణవ్, నిడమర్తి ధ్రువసాయి మొదటి రెండు స్థానాలను దక్కించుకున్నారు. చివరిగా జరిగిన సిసింద్రీల పదరంగం విభాగంలో విజేతగా కొవ్వూరి సౌమ్య, మలి విజేతగా వాయుగండ్ల స్నేహ గెలుపొందారు. మనబడి బాలానందం సంధాత కళ్యాణి సిద్ధార్థ, తెలుగు మాట్లాట పదస్వర కర్త చింతలపాటి శ్రీధర్ పదరంగం ఆటలకి వ్యాఖ్యాతలుగా వ్యవహరించగా, తోటపల్లి డాంజీ, రాయవరం భాస్కర్ తిరకాటం ఆటలు నిర్వహించారు. మనబడి భాషాసైనికులే కాక, ప్రముఖ మిమిక్రీ కళాకారులైన కస్తూరి ఫణిమాధవ్ తన ధ్వన్యనుకరణ, మాట్లాడే బొమ్మ ప్రదర్శనలతో ఈ పోటీల వాతావరణాన్ని నవ్వులజల్లులతో నింపారు. తెలుగు మాట్లాట సంధానకర్త డాంజీ తోటపల్లి మాట్లాడుతూ "ఈ ఆటలు
పిల్లలలో సహజంగా వుండే పోటీతత్వాన్ని ఆసరాగా తీసుకొని మన భాషపై వారికున్న పట్టుని తక్కువ సమయంలోనే మరింత పటిష్టం చేస్తాయి అన్న విషయం మరోకసారి రుజువు చేయగలిగాము" అని చెప్పారు.

ఈ పోటీలలో గెలిచిన వారికి సిలికానాంధ్ర జాతీయ అధ్యక్షులు చమర్తి రాజు, పాఠ్యప్రణాళిక ఉపాధ్యక్షులు కూచిభొట్ల శాంతి ఆధ్వర్యంలో, యూనివెర్సిటీ ఆఫ్ ఆస్టిన్ లో తెలుగు ప్రొఫెసర్, కవి అఫ్సర్, తెలుగు సాహితీవేత్త వంగూరి చిట్టెంరాజు ముఖ్య గౌరవ అతిథుల చేతుల మీదుగా, ప్రశంసా పత్రాలతో బాటు ప్రథమ స్థానం వారికి $1,116  డాలర్లు, రెండవ స్థానం వారికి $751 డాలర్లు అందించారు. పాల్గొన్న పిల్లలందరికీ ఆంగ్ల-తెలుగు నిఘంటువులు పంచిపెట్టారు. బహుమతి ప్రదానం అనంతరం జాతీయ గీతాల ఆలాపనలతో ఈ కార్యక్రమాలు జయోపేతంగా ముగిసాయి. “ఈ స్థాయిలో ఆటలని నిర్వహించడం ద్వారా పిల్లలలో ఆత్మవిశ్వాసం పెరిగి, తెలుగు ప్రతిభ మరింత మెరుగవుతుందని, తద్వారా వారెన్నో విషయాలు నేర్చుకుంటారని, రానున్న విద్యా సంవత్సరంలో తెలుగు వారందరూ పిల్లలని మనబడిలో చేర్పించాలి”, అని మనబడి అధ్యక్ష్లులు చమర్తి రాజు పిలుపునిచ్చారు.

డాలస్ మనబడి జట్టు కీలక సభ్యులు యెనగండ్ల నాగ్, అనాసపురపు లక్ష్మీప్రభ, ఫణీంద్ర రూపకల్పన చేయగా, భోజన విభాగానికి మడక ప్రేమ్ కుమార్, ఆతిథ్యానికి చెన్నుపాటి రజని గార్లు బాధ్యత వహించారు. కీలకమైన వేదిక, ధ్వని వ్యవహారాలు గణపువరపు బాల నిర్వహించగా, ఛాయా గ్రహణాన్ని దామిరెడ్డి సుబ్బు, ముద్దన బుద్ధ కుమార్, జొన్నాడ వెంకట్ చక్కగా చూసుకున్నారు. నారని రమేశ్ ఆటల నిర్వహణలో కీలక పాత్ర వహించారు. ఇంకా సరిదె సుధీర్, నారుమంచి చంద్ర, వడ్లమాని సుధ, పాలూరి రామారావు, దివాకర్ల మల్లిక్, చెన్నుపాటి కృష్ణ, నిడసనమెట్ల శరత్, చెరుకు గోపాల్ ప్రభృతులు ఈ కార్యక్రమ నిర్వహణలో తమ వంతు చేయూత నిచ్చారు. పాల్గొన్న వారితోను, తలిదండ్రులతోను పూర్వ విద్యార్థులు శ్రేయస్, స్నేహిత్, వినీల్, వెన్నెల, హర్షిత్ లు ఈ కార్యక్రమంపై అభిప్రాయాలు సేకరించారు. ఈ కార్యక్రమాన్ని ప్రవాసభారతీయుల ఆన్ లైన్ సాంఘిక జాలం హమారా హేంగ్ ఔట్స్ లో ప్రత్యక్ష ప్రసారం చేశారు. సౌండోరామ వారి ధ్వని సాంకేతికతలో సహకరించారు. భోజన సదుపాయాలను బావర్చి భోజనశాల వారు ఏర్పాటు చేసారు.

సిలికానాంధ్ర మనబడి: "భాషాసేవయే భావితరాల సేవ" అనే నినాదంతో సిలికానాంధ్ర 2007 లో మొదలుపెట్టిన "మనబడి" కార్యక్రమం అమెరికాలోని 35 రాష్ట్రాలలోనే కాక ఇంగ్లాండ్, హాలెండ్, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సింగపూర్, హాంగ్ కాంగ్ తదితర 13 దేశాలలో, మొత్తం కలిపి 4500 పైగా విద్యార్థులతో ఒక ఉద్యమంలా వ్యాపిస్తోంది. ఏడు అంచెల్లో తెలుగు బోధన, ప్రతీ మూడు నెలలకూ పరీక్షలు, ఉన్నతమైన ప్రమాణాలతో మనబడి పాఠ్యప్రణాలిక నిర్దిష్టంగా ఏర్పాటు చేయబడింది. భారతదేశంలోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ద్వారా రెండు స్థాయిలలో తెలుగు పరీక్షలు నిర్వహించి, అందులో ఉత్తీర్ణులైన విద్యార్థులందరికీ తెలుగు భాషా నైపుణ్య పట్టాలు అందజేస్తున్నది. మరో పక్క అమెరికా లోని ఉన్నత పాఠశాలల్లో ఫ్రెంచ్, స్పానిష్, జర్మన్ వంటి ఇతర ప్రపంచ భాషలకు సాటిగా తెలుగు కూడా నేర్పించగలిగేట్టుగా "ప్రపంచ భాష" గుర్తింపు తీసుకురావడానికి మనబడి కృషి చేస్తోంది. రాబోయే విద్యా సంవత్సరంలో  దాదాపు వెయ్యి మంది భాషాసైనికుల స్వచ్ఛంద సేవలతో ఆరు వేల మంది పిల్లలకు ప్రపంచ వ్యాప్తంగా చక్కని తెలుగు నేర్పించడానికి సిద్ధమవుతున్నారు. మీ పిల్లలని మనబడిలో చేర్పించండి. మాతృభాష నేర్పించండి.

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved