pizza
Telugu Fine Arts Society 30th Anniversary celebrations
You are at idlebrain.com > NRI community >
Follow Us

To feature your NRI communty news in idlebrain.com, please mail us at [email protected]

23 July 2015
Hyderabad

న్యూజెర్సీలో ఘనంగా ముగిసిన తెలుగు కళా సమితి ముప్ఫయ్యవ వార్షికోత్సవ వేడుకలు

తెలుగు కళా సమితి ముప్ఫయ్యవ వార్షికోత్సవ సందర్భంగా నృత్య, సంగీత,సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలు తెలుగు కళా సమితి అధ్యక్షులు శ్రీ గండి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో జులై 10,11 తేదీల్లో న్యూజెర్సీ రాష్ట్రంలో అట్టహాసంగా జరిగాయి. దీనికి పలువురు సామాజిక, రాజకీయ, సాంస్కృ తిక, సాహితీవేత్తలెన్దరో పాల్గొన్నారు. ఈ వేడుకకు శ్రీ దాము గేదెల గారు సమన్వయకర్త గా వ్యవహరించగా, తెలుగు కళా సమితి కార్య నిర్వాహక బృందం నేతృత్వం వహించింది. ఉత్తర అమెరికా తెలుగు సంఘాలు ప్రతీ రెండేళ్లకీ జాతీయస్థాయిలో జరిపే సాంస్క్రతిక ఉత్సవాల నమూనాలో ఈ సంబరాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి హాజరయిన వారందరూ తెలుగు కళా సమితి ఇంతవరకూ జరపిన కార్యక్రమాల్లో ఇది అత్యుత్తమంగా వున్నదని వ్యాఖ్యానించడం గమనార్హం.

జూలై 10 వ తారీఖు రాత్రి 7 గంటలకు ఎడిసన్ నగరంలోని రాయల్ ఆల్బర్ట్ పేలస్ లో సంబరాల ప్రత్యేక విందు ( బాంక్వేట్) ఘనంగా జరిగింది. తెలుగు కళా సమితి సీనియర్ లీడర్ షిప్ వారిచే జ్యోతి ప్రజ్వలన, కుమారి విష్ణుప్రియ ప్రార్ధనతో ప్రారంభమయిన ఈకార్యక్రమాలకు శ్రీమతి గిరిజ పెనుమర్తి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. జ్యోతి ప్రజ్వలన అనతరం శ్రీమతి గిరిజ పెనుమర్తి గారు , తెలుగు కళా సమితి అధ్యక్షులు శ్రీ గండి శ్రీనివాస్ గారిని సభకు పరిచయం చేసారు. శ్రీ గండి శ్రీనివాస్, శ్రీ మధు అన్నా,శ్రీమతి శ్రీదేవి జాగర్లమూడి, శ్రీమతి బిందు మాదిరాజు మరియు శ్రీ వంశీ కొప్పురావూరి గార్లు ఆహూతుల్ని సాదరంగా ఆహ్వానించారు. అనంతరం బాంక్వేట్ కోఆర్దినేటర్, తెలుగు కళా సమితి ఉపాధ్యక్షులు శ్రీ గురు ఆలంపల్లి గారు సభికుల్ని ఉద్దేశించి ప్రసంగించారు. న్యూ జెర్సీ సెనేటర్ సామ్ థామ్సన్ గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి గా విచ్చేశారు. తెలుగు కళా సమితి అధ్యక్షులు శ్రీ గండి శ్రీనివాస్ ముఖ్య అతిధిని జ్ఞాపికతో సన్మానించారు. ఈ వార్షికోత్సవ సందర్భంగా ఒక ప్రత్యేక సంచిక “ప్రతిభ” సావనీర్ ని శ్రీ వసంత నాయుడు గారి పర్యవేక్షణలో సావనీర్ కమిటీ సభ్యులు రూపొందించి, వెలువరించడం జరిగింది. తెలుగు సినీ, సాహిత్యరంగాల్లో లబ్ధ ప్రతిష్టులయిన శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు, శ్రీ సుద్దాల అశోక్ తేజ, సహస్రావధాని శ్రీ కడిమిళ్ళ వర ప్రసాద్ మరియు శ్రీ మీగడ రామ లింగస్వామి గార్లు ఈ సావనీర్ ను ఆవిష్కరించారు. శ్రీ రాచకుళ్ళ మధు గారు విశిష్ట అతిధుల్ని, సావనీర్ కమిటీ సభ్యులని పరిచయం చేసారు. తెలుగు వారి అభిమాన నటీమణులు కాజల్ మరియు లయ అందరిని అలరించారు. అనంతరం ఈ వార్షికోత్సవ కార్యక్రమాలు విజయవంతంగా జరగడానికి సహాయం చేసిన ప్రాయోజకులు, వదాన్యులు శ్రీ ప్రేమ్ నందివాడ, శ్రీ మల్లా రెడ్డి, శ్రీ సుధాకర్ రాయపూడి, మరియు జి. & సి., కంపెనీ వారిని ముఖ్య అతిధి శ్రీ శామ్ థామ్సన్ గారు శాలువ, జ్ఞాపికలతో సత్కరించారు. విందు భోజనంతో పాటుగా స్వర్ణక్క, శ్రీమతి ఆదర్శిని, లలిత రాణి, కృష్ణ రాణి మరియు విష్ణు ప్రియల సంగీత విభావరి జరిగింది. శ్రీమతి ఉమా మాకం గారి వందన సమర్పణ తో మొదటి రోజు కార్యక్రమాలు ముగిశాయి.

జూలై 11 న నూవార్క్ సింఫనీ హల్లో ఉత్సవాల రెండవ రోజు కార్యక్రమాలు జ్యోతి ప్రజ్వలన, శ్రీ శ్రీ శ్రీ కృష్ణ దేశికా జియ్యర్ స్వామీజీ గారి ఉపదేశ వాక్యాలతో ప్రారంభమయ్యాయి. తరువాత తెలుగు కళా సమితి వారి సాంస్కృతిక కార్యక్రమాలు శ్రీమతి శ్రీదేవి జాగర్లమూడి గారి ఆధ్వర్యంలో వినూత్న రీతిలో ప్రదర్శింపబడ్డాయి. శ్రీ మధు అన్నా గారి పర్యవేక్షణలో స్థానిక కళాకారులచే “పరమానందయ్య శిష్యులు”, “తెలుగు క్రూజ్ లైన్స్” మరియు “కీర్తన“ నాటికలు ప్రదర్శించారు. శ్రీ మధు రాచకుళ్ళగారి పర్యవేక్షణలో “నూవార్క్ స్టేజ్” ఆడిటోరియం లో లిటరరీ కమిటీ చైర్ పర్సన్ శ్రీమతి రాధ కాశీనాథుని గారి ఆధ్వర్యంలో సాహిత్య కార్యక్రమం జరిగింది. వేదకవి శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు, గురుసహస్రావధాని శ్రీ కడిమిళ్ళ వరప్రసాద్, సినీ కవి సుద్దాల అశోక్ తేజ, శ్రీ మీగడ రామలింగేశ్వర స్వామి గార్లు ఈ సాహితీకార్యక్రమం లో పాల్గొన్నారు. శ్రీమతి బిందు మాదిరాజు గారి పర్యవేక్షణలో పలు రకాల నృత్యరూపకాలు అత్యంత రమణీయంగా ప్రదర్శిచారు. సుమారు 100 మంది స్థానిక కళాకారులచే శ్రీ జొన్నవిత్తుల రచించిన “తెలుగువైభవం” నృత్య రూపకానికి ప్రత్యేక ప్రశంసలు లభించాయి. శ్రీ జొన్నవిత్తుల మాత్లాడుతూ గత 10 సంత్సరాలలో ఉత్తర అమెరికాలో ఇంత గొప్పగా తెలుగు సాంస్కృతిక కార్యక్రమాలు జరగటం తాను చూడలేదన్నరు. శ్రీమతి బిందు మాదిరాజు గారి అధ్వర్యంలో, ఆమెచే రూపొందించబడ్డ “మహిళా ఫాషన్ షో” విశేషంగా యువతరాన్ని ఆకట్టుకుంది. శ్రీమతి శ్రీదేవి జాగర్లమూడి గారి పర్యవేక్షణలో మునుపెన్నడూ లేనివిధంగా అద్భుతమైన వివిధ రకాల సంగీత కార్యక్రమాలు ప్రదర్శించారు. మొట్టమొదటిసారిగా సంగీత వాద్య పరికరాలతో రూపొందించిన ఇండియన్ రాగా గ్రూప్ వారి “సింఫనీ ఇన్స్ట్రుమెంటల్ ఎన్సెంబల్” ఆహూతుల్ని అలరించింది. శ్రీమతి శ్రీదేవి జాగర్లమూడి పర్యవేక్షణలో సుమారు 70 మంది స్థానిక బాల బాలికలకు శ్రీ హరప్రసాద్, శ్రీ శ్రీకాంత్, శ్రీమతి హరిణి లు శిక్షణ ఇచ్చి ప్రదర్శించిన సంగీత కార్యక్రమం “సింఫనీ టాలి వుడ్” వీనుల విందు చేసింది. ఇంకా కళాంజలి స్కూల్ ఆఫ్ డాన్స్, సిద్ధేంద్ర కూచిపూడి ఆర్ట్ అకాడమీ, నృత్య మాధవి స్కూల్ విద్యార్ధినీ, విద్యార్ధులచే ప్రదర్శించబడ్డ ప్రఖ్యాత సినీ దర్శకుడు కే.విశ్వనాధ్ సినీ గీతాలకు నృత్యాలు, దక్షా గ్రూప్ వారి “యూత్ టాలీవుడ్ మెడ్-లీ”, శ్రీ ఆనంద్ నృత్యాలయం వారి సెమి క్లాసికల్ డాన్సులు, కవి స్కూల్ ఆఫ్ డాన్స్ వారి “జై హనుమాన్” రూపకం ఆకట్టుకున్నాయి. సినీ, టీవీ కళా కారుల “జబర్దస్త్”, సెంటర్ ఫర్ కూచిపూడి డాన్స్ “తిల్లానా”, కవి స్కూల్ ఆఫ్ డాన్స్ ”టాలివుడ్ ధమాఖా” ఆకట్టుకున్నాయి. శ్రీమతి ఉమా మాకం గారు వేదిక ఏర్పాట్లు పర్యవేక్షిస్తూ, అతిధులకు, ప్రదర్శకులకు జ్ఞాపికలు,శాలువాలు అందచేసారు. సమయం మించిపోయినప్పటికి అందరు కళాకారులకు అవకాశం ఇచ్చి శ్రీమతి శ్రీదేవి జాగర్లమూడి, శ్రీమతి బిందు మాదిరాజు, శ్రీమతి ఉమా మాకం గార్లు అన్నిసాంస్కృతిక కార్యక్రమాలను అత్యంత చాకచక్యంగా నిర్వహించారు. పటిష్టమైన ప్రణాళికతో ఆర్ధికవ్యవహారాలను, టిక్కెట్ల నిర్వహణ, “ప్రతిభ” సావనీర్ వ్యవహారాలను కోశాధికారి శ్రీ వసంత నాయుడు గారు అత్యంత సమర్థనీయం గా నిర్వహించి పలువురి మెప్పు పొందారు. మీడియ,పబ్లిసిటి,కళాకారుల వసతి, ప్రయాణం, వేదిక పై ఆడియో & విడియో, లెడ్ స్క్రీన్ ఏర్పాట్లు వంటి గురుతర బాధ్యతలు శ్రీ వంశీ కొప్పురావూరి గారు పర్యవేక్షించారు. తెలుగు కళా సమితి ముప్ఫయ్యవ వార్షికోత్సవ వేడుకలకు నిధుల సమీకరణకై శ్రీ గురు ఆలంపల్లి మరియు శ్రీ గండి శ్రీనివాస్ గార్లు అహర్నిశలు శ్రమించారు. నిధులను అందచేసిన దాతలకు శ్రీ గురు ఆలంపల్లి గారు కృతజ్ఞతలు తెలియచేసారు. ఈకార్యక్రమాలకు శ్రీమతి గిరిజ పెనుమర్తి మరియు శ్రీమతి శ్రీలక్ష్మి కులకర్ణిలు గార్లు వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు.రాత్రి విందు భోజనానంతరం ప్రఖ్యాత సినీ సంగీత దర్శకుడు శ్రీ అనూప్ రూబెన్స్ దర్సకత్వంలో వారి బృందంచే “సంగీత విభావరి” జరిగింది. కార్యకర్తలుగా పనిచేసిన శ్రీ మురళి మేడిచర్ల, శ్రీ రవి దన్నపనేని,శ్రీ అరుణ్ శ్రీరామినేని,శ్రీ రవి పుస్కుర్, శ్రీమతి సరోజ,శ్రీ రాజు కొత్తమసు, శ్రీ వెంకట్ జాగర్లమూడి, శ్రీ సురేష్ మాకం, శ్రీ సుధీర్ కొప్పురావూరి,శ్రీ శ్రవణ్ కొంకిపల్లి, సురేష్ పద్మనాభిని గార్లకు శ్రీ గండి శ్రీనివాస్ గారు ధన్యవాదములు తెలియచేసారు. ఈ రెండు రోజులూ “మిర్చి” రెస్టారెంట్ వారు చవులూరే రుచులతో కమ్మని వంటకాల్ని ఆహుతులకు వడ్డించారు. సుమారు 2500 మందికి పైగా తెలుగు వారు తిలకించి ఈకార్యక్రమాలను విజయవంతం చేసారు. అనంతరం తెలుగు కళా సమితి కార్య నిర్వాహక బృందం వారిచే , వందన సమర్పణ “జనగణమన” జాతీయ గీతాలాపనతో తెలుగు కళా సమితి ముప్ఫయ్యవ వార్షికోత్సవాలు ముగిసాయి.

 


 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved