రమా గ్రూప్స్ వెంచర్ నుండి సినిమాల నిర్మాణం కోం రమా రీల్స్ బ్యానర్‌ను స్టార్ట్ చేశారు. ఈ సంస్థ అధినేత శ్రీజాన్ సుధీర్ పూదోట' నిర్మాతగా పలు చిత్రాలను నిర్మించారు. ఇప్పుడు ఈ సంస్థ అంతర్జాతీయ స్థాయిలో సినిమాలను నిర్మించడానికి నిర్ణయించుకుంది. అందుకు లియో యు సారధ్యంలో లోహాస్ గ్లోబెల్ ఎంటర్‌టైనెమెంట్, వరల్డ్ మొబైల్ హెల్డింగ్స్ ఐ.ఎన్.సి, తైవాన్‌లో మల్టీనేషన్ కంపెనీ అయిన వీ.ఆర్.టెక్నాలజీలతో భాగస్వామ్యం ఏర్పరుచుకుంది. అందులో భాగంగా రూపొందుతోన్న చిత్రం 'షో టైమ్'. ఎస్.ఎస్.కాంచీ దర్శకత్వంలో రణధీర్, రుక్‌సర్ మిర్ జంటగా ఈ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం శుక్రవారం హైదరాబాద్‌లో జరిగింది. హీరోయిన్ అనుష్క ఆడియో సీడీలను విడుదల చేసి తొలి సీడీని శివశక్తి దత్తాకు అందించింది. డైరెక్టర్ రాజమౌళి ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా....
విజయేంద్రప్రసాద్ మాట్లాడుతూ - ``కాంచిలో వెటకారం ఎక్కువగా కనపడుతుంటుంది. మా సినిమాల్లో తప్పులను వెతికే ప్రయత్నం చేస్తుంటాడు. ఇప్పుడు తన డైరెక్షన్‌లో వస్తున్న షో టైమ్ సినిమాలో మంఏ తప్పులు వెతుకుతాం. అయితే తన సినిమాలో ఏ తప్పులు ఉండకుండా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను`` అన్నారు.
రాజమౌళి మాట్లాడుతూ - ``ట్రైలర్ చాలా బావుంది. సినిమా థియేటర్లో జరిగే కథ. మా కజిన్స్ అందరిలో కాంచీలోనే వెటకారం ఎక్కువగా ఉంటుంది. ఈ సినిమాలో ఏ తప్పులు లేకుండా సినిమా మంచి విజయంతం కావాలని కోరుకుంటున్నాను. కాంచి తనేం చెప్పాలనుకున్నాడో చెప్పినట్టు ట్రైలర్ చూస్తుంటే అనిపిస్తుంది. ఆసక్తికరంగా సాగే ఈ సినిమా పెద్ద సక్సెస్ అవుతుంది. కీరవాణిగారు బెస్ట్ మ్యూజిక్ ఇచ్చాడు` అన్నారు.
అనుష్క మాట్లాడుతూ - ``రాజమౌళిగారి ఫ్యామిలీ ఎప్పుడూ నన్ను ఏదో ఒక కొత్త విషయంతో సర్‌ప్రైజ్ చేస్తుంటారు . అందరూ మంచి టాలెంటెడ్. పాటలు బావున్నాయి. టీం అందరూ చక్కగా నటించారు. సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను`` అని అన్నారు.
కాంచి మాట్లాడుతూ - ``మంచి సినిమా తీయగలను నమ్మకంతో చేసిన సినిమా ఇది. పెద్ద నాన్న, కీరవాణి, రాజమౌళి సహా నటీనటులు, టెక్నిషియన్స్ చక్కగా నటించారు. ఇక అందరూ చెప్పినట్టు నా సినిమాలో తప్పులను నా ఫ్యామిలీ మెంబర్స్ చూసి చెబితే సరిదిద్దుకుంటాను`` అన్నారు.
కె.రాఘవేంద్రరావు మాట్లాడుతూ - ``సినిమా థియేటర్లో జరిగే కథ. ట్రైలర్ చూస్తుంటే సినిమా ఎప్పుడు చూస్తామా అని ఆసక్తి కలుగుతుంది. కాంచీ, టీంకు అభినందనలు`` అన్నారు.
సుధీర్ పూదోట మాట్లాడుతూ - ``కాంచీగారు సినిమాను చక్కగా తెరకెక్కించారు. సినిమా ప్రమోషన్స్ ప్లానింగ్ కూడా ముందుగానే చెప్పడం విశేషం. కాంచీగారి దర్శకత్వంలోనే మరో సినిమా చేయాలని ఉంది. ఈ సినిమాను ఫిబ్రవరిలో విడుదల చేస్తాం`` అన్నారు.
ఎం.ఎం.కీరవాణి మాట్లాడుతూ - `` ఈ సినిమాలో ఎమోషన్స్ పాత్రధారులు. స్పెషల్ సాంగ్స్, ఐటెమ్ సాంగ్స్ ఏమీ లేవు. మంచి మ్యూజిక్ కుదిరింది. అందరికీ పాటలు కనెక్ట్ అవుతాయి. కాంచీకు ఈ సినిమా పెద్ద హిట్ కావాలి. కాంచీకి తను చేసే పని పట్ల మంచి అవగాహన ఉంటుంది. అదే అవగాహనతో సినిమాను చక్కగా చేసుంటాడని భావిస్తున్నాను`` అన్నారు.
పివిపి, రణధీర్, రుక్సర్ మీర్, సుప్రీత్ సహా టీం అంతా కార్యక్రమంలో పాల్గొన్నారు.