pizza
Vendithera Arunakiranam T Krishna book launch
టి.కృష్ణ వెండితెర అరుణకిర‌ణం పుస్త‌కావిష్క‌ర‌ణ‌
టి.కృష్ణలాంటి గొప్ప వ్య‌క్తుల జీవితాల‌ను జ‌నాల్లోకి తీసుకెళ్లాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉందిః టి.కృష్ణ పుస్తకావిష్క‌ర‌ణ‌లో ద‌ర్శ‌క‌ర‌త్న‌
You are at idlebrain.com > News > Functions
Follow Us

18 November 2016
Hyderaba
d

అభ్యుద‌య చిత్రాల ద‌ర్శ‌కుడు టి.కృష్ణ పై సీనియ‌ర్ అండ్ సిన్సియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ ప‌సుపులేటి రామారావు ర‌చించిన `వెండితెర అరుణ‌కిర‌ణం టి.కృష్ణ‌` పుస్త‌కావిష్క‌ర‌ణ శుక్ర‌వారం హైద‌రాబాద్ లో జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ద‌ర్శ‌క‌ర‌త్న దాస‌రి నారాయ‌ణ‌రావు పుస్త‌కాన్ని ఆవిష్క‌రించి..తొలి ప్ర‌తిని టి.కృష్ణ త‌నయుడు, క‌థానాయ‌కుడు గోపిచంద్ కు అంద‌జేశారు. సారిప‌ల్లి కొండ‌ల‌రావు సార‌ధ్యంలో యువ‌క‌ళావాహిని ఆధ్వ‌ర్యంలో ఈ పుస్త‌కావిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మం జ‌రిగింది.

ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌క‌ర‌త్న దాస‌రి నార‌య‌ణ‌రావు మాట్లాడుతూ...`` ప‌సుపులేటి రామారావు టి.కృష్ణ పై పుస్త‌కం రాస్తున్నా అని చెప్ప‌గానే చాలా సంతోషించా. 45 ఏళ్ల క్రితం ఎలా ఉన్నాడో ఇప్ప‌టికే అలాగే ఉన్నాడు రామారావు. త‌ను లాభాలు ఆశించి పుస్త‌కాలు రాసే వ్య‌క్తి కాదు. టి.కృష్ణ‌లాగే గొప్ప లెఫ్ట్ భావాలు ఉన్నవాడు. సినిమా చ‌రిత్రను జనాల్లోకి తీసుకెళ్లాల‌న్న సంక‌ల్పంతో పుస్త‌కాలు రాస్తుంటాడు. ఈ పుస్త‌కం కూడా అందులో భాగ‌మే. చాలా మంది ప్రాచుర్యం పొందిన కొంత మంది ద‌ర్శ‌క నిర్మాత‌లు, హీరోల పేర్లే ప్ర‌స్తావిస్తుంటారు త‌ప్ప...మ‌ధ్య‌లో వారిని వ‌దిలేస్తుంటారు. కానీ, ఎవ‌రి పంథాలో వారు గొప్పవారే. మా జ‌న‌రేష‌న్ లో కొత్త భావాలు, కొత్త త‌రం ద‌ర్శ‌కుడుగా టి.కృష్ణ గొప్ప పేరు తెచ్చుకున్నాడు. వాస్త‌వాల‌ను తెర‌కెక్కించాలంటే ఆ ద‌ర్శ‌కుడిలో నిజాయితీ ఉండాలి. అప్పుడే ఆ సినిమాను ర‌క్తి క‌ట్టించ‌గ‌ల‌డు. అలాంటి నిజాయితీ ఉన్న ద‌ర్శ‌కుడు కాబ‌ట్టే ఆరు అద్భుత‌మైన చిత్రాలు చేశారు టి. కృష్ణ‌. ఇటువంటి గొప్ప ద‌ర్శ‌కుడు చ‌నిపోయిన‌ప్పుడు ఏర్పాటు చేసిన సంతాప స‌భ‌కు కేవ‌లం 11 మంది మాత్ర‌మే హాజ‌ర‌య్యారు. ఆ స‌మ‌యంలో నేను ఏడ్చాను. ఆ స‌భ‌లో చాలా ఉద్వేగంగా మాట్లాడాను. చాలా మంది మీద కోప‌డ్డాను. తెలుగు సినిమా చ‌రిత్ర రాయాల్సి వ‌స్తే అందులో రెండు పేజీలు అట్టి పెట్టాల్సిన ద‌ర్శకుడు టి.కృష్ణ‌. ప్ర‌జ‌లు ఆయ‌న‌పై ఎంతో అభిమానాన్ని కురిపించారు.అలాంటి గొప్ప వ్య‌క్తుల చ‌రిత్ర జ‌నాల్లోకి తీసుకెళ్లాల్సిన అవ‌స‌రం ఉంది. ఎన్టీఆర్, ఎస్వీఆర్, ఘంట‌సాల‌ను సినిమా ప‌రిశ్ర‌మ‌కు ప‌రిచ‌యం చేసింది కృష్ణ‌వేణి గారు. కానీ, ఎంత మందికి ఈ నిజాలు తెలుసు. నేను గ‌త మూడున్న‌ర ఏళ్లుగా సినీ చ‌రిత్ర గురించి ఒక పుస్త‌కం రాస్తున్నా.. ఇంకా ఏడాదిన్న‌ర ప‌ట్టే అవ‌కాశం ఉంది. దాని ద్వారా ఎన్నో నిజాలు తెలిసే అవ‌కాశం ఉంది. ఇక‌ కృష్ణ గురించి చెప్పాలంటే... త‌న‌కు నాకు మంచి అనుబంధం ఉంది. నారాయ‌ణ‌మూర్తి హీరోగా `ఒరేయ్ రిక్షా`సినిమాను డైర‌క్ట్ చేయ‌మ‌ని కృష్ణ‌ను అడిగాను. చాలా సంతోషించాడు. మీలాంటి గొప్ప ద‌ర్శ‌కుడు నిర్మాణంలో నేను ద‌ర్శ‌క‌త్వం చేసే అవ‌కాశం రావ‌డం నా అదృష్టం అన్నాడు. కానీ నా అభిప్రాయాన్ని రెండు రోజుల్లో చెబుతానన్నాడు. నేను ఈ సినిమా చేయ‌లేను...ఎందుకో మీకు త్వ‌ర‌లో తెలుస్తుందంటూ ఓ పేప‌రులో రాసి పంపించాడు. నాకు త‌ర్వాత తెలిసింది త‌నకు ఆరోగ్యం బాగోలేద‌ని. ఒక గొప్ప వ్య‌క్తి, గొప్ప ద‌ర్శ‌కుడు పై ప‌సుపు లేటి రామారావు ఈ పుస్తకం రాసినందుకు త‌న‌ను మ‌న‌సారా అభినందిస్తున్నా`` అన్నారు.

న‌టుడు సుమ‌న్ మాట్లాడుతూ...``అప్ప‌టి వ‌ర‌కు ఆరు పాట‌లు, ఐదు ఫైట్స్ తో కూడిన క‌మ‌ర్షియ‌ల్ చిత్రాల్లో న‌టిస్తున్న నాతో `నేటిభార‌తం` చేశారు కృష్ణ గారు. అప్ప‌టి వ‌ర‌కున్న నా శైలినే మార్చేశారు. ఆ సినిమాలో నా పాత్ర‌ను ఆద‌ర్శంగా తీసుకున్న వారు ఎంతో మంది ఇప్ప‌టికీ ఉన్నారు. హార్డ్ వ‌ర్క‌ర్, సింప్లిసిటీ ఉన్న వ్య‌క్తి కృష్ణ‌. ఆయ‌న‌తో వ‌ర్క్ చేయ‌డం నాకు డిఫ‌రెంట్ ఎక్స్ పీరియ‌న్స్. అటువంటి వ్య‌క్తి పై పుస్త‌కాన్ని ర‌చించిన పసుపులేటి రామారావుగారిని మ‌న‌స్ఫూర్తిగా అభినందిస్తున్నా`` అన్నారు.

ప్ర‌ముఖ న‌టుడు కోట శ్రీనివాస‌రావు మాట్లాడుతూ...`` వందేమాత‌రం` చిత్రంతో నా సినీ కెరీర్ ప్రారంభ‌మైంది. ఆ త‌ర్వాత `ప్ర‌తిఘ‌ట‌న‌`లోనూ న‌టించే అవ‌కాశాన్ని క‌ల్పించారు టి.కృష్ణ‌గారు. ఆ సినిమా 1985 అక్టోబ‌ర్ 10న విడుద‌లైంది. 11 ఉద‌యం క‌ల్లా నేను మిడ్ నైట్ స్టార‌నయ్యాను .ఎన్నో ప్ర‌శంస‌లు ల‌భించాయి ఆ పాత్ర‌కు. నా సినీ ప్ర‌యాణం ఇప్ప‌టి వ‌ర‌కు కొన‌సాగుతుంద‌న్నా..నేను పద్మ‌శ్రీ అవార్డు అందుకోగ‌లిగాన‌న్నా కార‌ణం టి.కృష్ణ‌గారే. అలాంటి గొప్ప వ్య‌క్తి ద‌ర్శ‌కుడి పై పుస్త‌కాన్ని ర‌చించిన ప‌సుపులేటి రామారావుని మ‌న‌సారా అభినందిస్తున్నా`` అన్నారు.

ప్ర‌జానాట్య‌మండలి న‌ల్లూరి వెంక‌టేశ్వ‌ర‌రావు మాట్లాడుతూ...``మెట్రిక్ చ‌ద‌వ‌డానికి కృష్ణ ఒంగోలు వ‌చ్చాడు. క‌ళ‌ల ప‌ట్ల ఆస‌క్తి ఎక్కువ‌గా ఉన్న వ్య‌క్తి కావ‌డంతో ప్ర‌జానాట్య‌మండలి కి ఆక‌ర్షితుడ‌య్యాడు. ఆ ప్ర‌భావం ఆయ‌న సినిమాల‌పై ఉంటుంది. ఎవ‌రి ద‌గ్గ‌ర శిష్య‌రికం చేయ‌కుండా `నేటి భార‌తం` చిత్రం చేసి సంచ‌ల‌నం సృష్టించాడు. తీసిన‌వి ఆరు సినిమాలే అయినా ఆరు కుడా అభ్యుద‌య భావాలు క‌లిగిన అద్భుత‌మైన చిత్రాలు. ప్ర‌తి సినిమా సామాజిక బాధ్య‌తతో ఉండేవి. ఎంతో మంది న‌టుల‌ను ప‌రిచ‌యం చేసిన ద‌ర్శ‌కుడు కృష్ణ‌. చ‌రిత్ర తెలుసుకోవ‌ల్సిన వ్య‌క్తి, ద‌ర్శ‌కుడు కృష్ణ పై పుస్త‌కాన్ని ప్ర‌చురించిన రామారావు గారిని మ‌న‌స్ఫూర్తిగా అభినందిస్తున్నా`` అన్నారు.

ఆర్.నారాయ‌ణ మూర్తి మాట్లాడుతూ...``కృష్ణ తీసిన ఆరు చిత్రాలు అజ‌రామ‌రాలు. ఆయ‌న్ను పోకూరి బాబూరావు ద‌ర్శ‌కుడుగా ప‌రిచ‌యం చేశారు. నేను చేసిన `అర్ధ‌రాత్రి స్వ‌తంత్రం` లో కృష్ణ‌గారు న‌టించ‌డం నా అదృష్టంగా భావిస్తున్నా. మ‌హోన్న‌త వ్య‌క్తి చ‌రిత్ర‌కు పుస్త‌కరూపాన్ని తెచ్చిన రామారావుని అభినందిస్తున్నా`` అన్నారు.

ద‌ర్శ‌కుడు ముత్యాల సుబ్బ‌య్య మాట్లాడుతూ...``కృష్ణ గారి `నేటి భార‌తం` నుంచి `రేప‌టి పౌరులు`వ‌రకు అన్ని సినిమాల‌కు కో-డైర‌క్ట‌ర్ గా ప‌ని చేశాను. నా తొలి సినిమా టైటిల్ `అరుణ‌కిర‌ణం` టైటిల్ కూడా కృష్ణ‌గారు సూచించిన‌దే. కృష్ణ‌గారితో ప‌రిచ‌యం నా కెరీర్ ను మ‌లుపు తిప్పింది. ఆయ‌న్ను ఎప్ప‌టికీ నేను మ‌రువ‌లేనన్నారు.

ద‌ర్శ‌కుడు బి.గోపాల్ మాట్లాడుతూ...``నేను, కృష్ణ స‌న్నిహితంగా ఉండేవాళ్లం. న‌ల్లూరి గారి వ‌ద్ద కృష్ణ తో ప‌రిచ‌యం ఏర్ప‌డింది. ఓ గొప్ప వ్య‌క్తి, ద‌ర్శ‌కుడు తో ప‌రిచ‌యం, ప్ర‌యాణం నా అదృష్టంగా భావిస్తున్నా. ఆయ‌న‌పై పుస్త‌కాన్ని ర‌చించిన రామారావుని అభినందిస్తున్నా`` అన్నారు.

నిర్మాత పోకూరి బాబూరావు మాట్లాడుతూ..``1970లో ఒంగోలు కాలేజీలో కృష్ణ తో ప‌రిచ‌యం ఏర్ప‌డింది. ఆయ‌న మొద‌టి సినిమా నుంచి ఆఖ‌రి శ్వాస వ‌ర‌కు ఆయ‌న‌తో ఉన్నా. 16 ఏళ్ల సుధీర్ఘ ప్ర‌యాణం మాది. నాకు త‌ల్లీ, తండ్రీ , గురువు, దైవం అన్నీ ఆయ‌నే. న‌న్ను నిర్మాత‌గా నిల‌బెట్టింద కూడా ఆయ‌నే. ఎంతో మంది క‌ళాకారుల‌ను ప‌రిచ‌యం చేశారు కృష్ణ‌. ఎంతో హార్డ్ వ‌ర్క‌ర్. ఆయ‌న సినీ కెరీర్ మూడున్న‌ర ఏళ్లు. ఈ కొద్ది కాలంలోనే ఆరు అద్భుత‌మైన చిత్రాలు చేశారు. ముఫ్పై ఏళ్లైనా ఆయ‌న్ను మ‌నం మ‌రువ‌లేదంటే ఆయ‌న సినిమాల ప్ర‌భావం స‌మాజం పై ఎంతగా ఉందో తెలుసుకోవ‌చ్చు. ఇంకా ముఫ్పై ఏళ్లైనా ఆయ‌న్ను మ‌రువ‌లేం. అటువంటి గొప్ప వ్య‌క్తి పై పుస్తాన్ని తెచ్చిన రామారావుని కృష్ణ మిత్ర బృందం త‌ర‌పున అభినందిస్తున్నా`` అన్నారు.

క‌థానాయకుడు గోపీచంద్ మాట్లాడుతూ..``నాన్న‌గారు మ‌ర‌ణించిన‌ప్పుడు నాకు తొమ్మిదేళ్లు. కాబ‌ట్టి నాన్న గురించి నాకు ఎక్కువ‌గా తెలియ‌దు. ఇక్క‌డ వారి మిత్రులు చెబుతుంటే అంత మంచి తండ్రికి కొడుకుని అయినందుకు అదృష్టంగా భావిస్తున్నా. ఎంతో మంది ద‌ర్శ‌కుల‌కు ఇనిస్పిరేష‌న్ గా నిలిచారు. ఆయ‌న‌లో మంచి న‌టుడు కూడా ఉన్నారు. నారాయ‌ణ మూర్తిగారి `అర్ధ‌రాత్రి స్వ‌తంత్రం` లో నాన్న‌గారు న‌టించారు. ఇప్ప‌టికీ ఆ సీన్ నా మొబైల్ లో ఉంది. న‌ట‌న‌లో ఆయ‌నే నాకు ఇనిస్పిరేష‌న్. ఇంకా నాన్న‌గారిలా న‌టించ‌లేక‌పోతున్నా అనుకుంటుంటాను. నాన్న‌గారిని ఎంత‌వ‌ర‌కు రీచ్ అవుతానే తెలియ‌దుకానీ నేను కృష్ణ గారి కొడుకుని అని గ‌ర్వంగా చెప్పుకుంటా. ఈ పుస్త‌కం వెల‌క‌ట్ట‌లేనిది. ఇందులో తెలుసుకోవ‌ల్సిన అంశాలు చాలా ఉన్నాయి. మ‌న‌స్ఫూర్తిగా పసుపులేటి రామారావు గారికి కృత‌జ్ఞ‌త‌లు తెలుపుకుంటున్నా`` అన్నారు.

పుస్త‌క ర‌చ‌యిత సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ ప‌సుపులేటి రామారావు మాట్లాడుతూ..``టి.కృష్ణ గారితో నాకు మంచి అనుబంధం ఉంది. ఆ అనుబంధ‌మే ఈ పుస్త‌కం రాయ‌డానికి కార‌ణ‌మైంది. నా గుండె పొర‌ల‌లోంచి వ‌చ్చిన పుస్త‌క‌మే ఈ వెండితెర అరుణ‌కిర‌ణం టి.కృష్ణ‌. ఈ పుస్తకం తేవ‌డానికి పోకూరి బాబూరావు, నాగేశ్వ‌ర‌రావు ఎంతో మెటీరియ‌ల్ తో పాటు పోత్సాహం అందించారు`` అన్నారు.

ఇంకా ఈ కార్య‌క్ర‌మంలో డా.రాజేంద్ర‌ప్ర‌సాద్, బీవీఎస్ ఎన్ ప్ర‌సాద్, ఎ.ఎమ్ ర‌త్నం, మాదాల ర‌వి, చ‌ద‌లవాడ శ్రీనివాస‌రావు, వందేమాత‌రం శ్రీనివాస్, సారిప‌ల్లి కొండ‌ల‌రావు, హ‌ర‌నాథ‌రావు త‌దిత‌రులు పాల్గొన్నారు.


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved