pizza
Ghantasala The Great first look launch
'ఘంటసాల ది గ్రేట్' పేరుతో బయోపిక్
You are at idlebrain.com > News > Functions
Follow Us


06 October 2018
Hyderabad

ఈ రోజుల్లో బయోపిక్స్ అనేవి ఇండియన్ సినిమాకు కొత్త ట్రెండ్. నెమ్మదిగా ఇవి ప్రేక్షకుల అభిరుచిని మార్చేస్తున్నాయనిపిస్తుంది. నిజ జీవిత పాత్రలతో వస్తున్న సినిమాలు ప్రేక్షకుల మన్ననలు పొందుతున్నాయి అన్నది నిస్సందేహం. ఒక సామాన్యుడు ఒక లక్ష్యం ఏర్పరుచుకొని అది సాధించడం కోసం పడిన కష్టం, ఎదుర్కొన్న ఆటుపోట్లు, జీవనశైలికి కొంత నాటకీయత జోడిస్తూ చూపిస్తున్న తీరుకు ప్రేక్షకుడు ఆకర్షితుడవుతున్నాడని చెప్పడానికి ఈ మధ్య వస్తున్న బయోపిక్సే నిదర్శనం. బయోపిక్ లో పెద్ద ఉపయోగం ఏమిటంటే ప్రేక్షకుడికి ఇవి ఇట్టే “కనెక్ట్” అయిపోతాయి. అటువంటి జీవిత కథల్లో – లోతైన కథ, మంచి పట్టున్న దృశ్యాలు, వీనుల విందైన సంగీతం ఉన్నట్లయితే అవి తప్పకుండా ప్రేక్షకున్ని కట్టిపడేయడం ఖాయం.

ఇంత వరకు మనం చరిత్రకారుల, క్రీడాకారుల, నటీనటుల జీవిత చిత్రాలను చూశాము. మొన్నటి “దంగల్” నిన్నటి “మహానటి” ఎంత ఘన విజయం సాధించాయో తెలియంది కాదు. దక్షిణ భారతదేశంలో మహానటి అంటే సావిత్రి, మహాగాయకుడు అంటే ఘంటసాల అని భారతదేశం అంతా తెలుసు. అయన జీవితం ఆధారంగా ఇప్పుడు “ ఘంటసాల” సినిమా వచ్చేస్తుంది.

ఘంటసాల అంటే పాట, పాట అంటే ఘంటసాల అని అందరికీ తెలుసు. కాని, అయన ఒక వ్యక్తిగా ఎంత గొప్పవాడో కొందరికే తెలుసు. అది అందరికి తెలియచేసేదే ఈ చిత్రం. అయన జీవితం పూల బాట కాదని, ముళ్ళ బాటలో నడిచి, మనకి పూల ‘పాట’లందించాడని చెప్పేదే ఈ చిత్రం. పాట కోసం ఎన్ని కష్టాలు పడినా, పట్టిన పట్టు విడవక విజయం సాదించి, “కృషితో నాస్తి దుర్భిక్షం” అని నిరూపించాడు. వినయంతోనే విద్య ప్రకాశిస్తుంది అనడానికి అయన జీవితమే నిదర్శనం.

అయన పాడిన పాటలకు అయన జీవితానికి ఎంత దగ్గర సంబంధం వుందో ఈ చిత్రం చూస్తే తెలుస్తుంది. అయన జీవితం ఎన్నో ఎత్తు పల్లాలకు లోని నడిచి, చివరికి డ్రమెటిక్ గా ముగియడం విశేషం.

అన్యుక్తరం ప్రొడక్షన్స్ బ్యానర్ పై శ్రీమతి లక్శ్మీ నీరజ నిర్మాతగా, గాయకుడూ G.V. భాస్కర్ నిర్మాణ సారధ్యం లో వస్తున్న ఈ చిత్రానికి – పాటల పుస్తకాల కేటగిరిలో అత్యధికంగా అమ్ముడుబోయిన “ఘంటసాల ‘పాట’ శాల” సంకలన కర్త సి. హెచ్ రామారావు రచన – దర్శకత్వం వహించారు. ఈ చిత్రం రీ రికార్డింగ్ ముగించుకొని ఈ సంవత్సరం డిసెంబర్ లో విడుదలకు సిద్దమవుతుంది. బాహుబలి కెమెరామెన్ సెంథిల్ కుమార్ శిష్యుడు వేణు వాదనల ఈ చిత్రానికి కెమెరామెన్ గాను, ఇటీ వలే విడుదలైన “అంతకుమించి” చిత్రానికి పనిచేసిన క్రాంతి (RK) ఎడిటర్ గాను, ప్రఖ్యాత సంగీత దర్శకులు సాలూరి రాజేశ్వర రావు గారి కుమారుడు, సంగీత లోకానికి చిరపరిచితులు అయిన సాలూరి వాసూరావు గారు సంగీత దర్శకులుగా పనిచేస్తున్నారు.

ఇకపోతే మహా గాయకుడు “ఘంటసాల” గా వర్ధమాన గాయకుడూ, ‘సూపర్ సింగర్స్ 7’ తో చిరపరిచితుడైన కృష్ణ చైతన్య పోషిస్తున్నారు. ఘంటసాల సతీమణి ‘సావిత్రి’ గా కృష్ణ చైతన్య సతీమణి ప్రముఖ యాంకర్ మృదుల పోషించగా, ఘంటసాల గురువుగా పట్రాయని సీతారామ శాస్త్రిగా సుబ్బరాయశర్మ చేస్తున్నారు.

ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని శనివారం హైదరాబాద్ లో ప్రముఖ దర్శకులు కె . రాఘవేంద్ర రావు ఆవిష్కరించారు .

అక్టోబర్ లో ఈ చిత్రానికి సంబంధించిన ‘టీజర్’ సినిమా దిగ్గజాల సమక్షంలో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి .


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved