30 November 2017
Hyderabad
'భగవద్గీత' ను జాతీయ పుస్తకము గా ప్రకటించాలి
మదర్స్ డే, ఫాదర్స్ డే, లాగా 'గీతా డే' ను నిర్వహించాలి
భగవద్గీత మరణగీతం కాదు జీవన గీతమని చాటాలి.
మానవ జీవన గీత 'భగవద్గీత' ను నేర్చుకుంటే మనరాత మారుతుందని, వ్యక్తిత్వ వికాసానికి దోహదపడే గీత ను చదివి ఆచరించాలని రాష్ట్ర ప్రభుత్వ ఢిల్లీ అధికార ప్రతినిధి డా.సముద్రాల వేణుగోపాలాచారి అన్నారు. గీతా జయంతి వేడుకల సందర్భంగా ప్రముఖ ఆధ్యాత్మిక ,సామాజిక సేవా సంస్థ 'భగవద్గీతా ఫౌండేషన్' ఆధ్వర్యంలో గీతా జయంతి వేడుకలు గీతా బంధువుల సమక్షంలో త్యాగరాయ గాన సభ ఆవరణలో వైభవంగా జరిగాయి. ఈరోజు బుధవారం( 29 - 11 - 17 ) ఉదయం చిక్కడపల్లి లోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం వద్ద గోపూజ తో ప్ర్రారంభమైన గీతా జయంతి వేడుకలు అనంతరం శ్రీకృష్ణ భగవానుని పల్లకి సేవ, విద్యార్థిని,విద్యార్థుల జై శ్రీకృష్ణ నినాదాలతో సాగిన గీతా పాదయాత్రను ఎం.ఎల్.ఏ.జి.కిషన్ రెడ్డి ప్ర్రారంభించగా త్యాగరాయ గాన సభ వరకు సాగిన ఈ యాత్రలో నగర ప్రజలు పాల్గొని భక్తి పారవశ్యానికి లోనయ్యారు.
ఈ సందర్భంగా జరిగిన సభలో పాల్గొన్న వేణుగోపాలాచారి మాట్లాడుతూ..'భగవద్గీత' ను చదివి అర్ధం చేసుకుంటే నేను అనే అహం మరచి మనం అనే భావనకు లోనవుతామన్నారు. భగవద్గీత పీఠం పెట్టాలని, గీతా డే ను నిర్వహించాలని, గీతా పారాయణం ఉద్యమంలా సాగించాలన్నారు.
భగవద్గీత ను జాతీయ గ్రంధం గా ప్రకటించాలని అన్నారు ఎం.ఎల్.ఏ.జి.కిషన్ రెడ్డి. ఇందుకోసం రాజకీయాల కతీతంగా, కుల,మత,ప్రాంతాల కతీతంగా అందరూ కృషి చేయాలన్నారు. భగవద్గీతలోని అన్ని అధ్యాయాలను ప్రజలకు అందించాలని, వచ్చే సంవత్సరం గీతా జయంతి వేడుకలు ఎన్ఠీఆర్ స్టేడియం లో భారీగా నిర్వహించాలని సూచించారు. అందుకు ప్రైవేట్ సంస్థలతో పాటు, రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకారం అందించాలని అన్నారు. భగవద్గీత ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు, సంపూర్ణ భగవద్గీత గాయకుడు ఎల్.వి.గంగాధరశాస్త్రి మాట్లాడుతూ..' భగవద్గీత పుట్టి నేటికి 5 ,118 సంవత్సరాలు అయిందని, భగవద్గీత మానవ జీవిత నిఘంటువు గా అభివర్ణిస్తూ, దాని ప్రాముఖ్యతను వివరించారు. గీతా ప్రచారం ఒక్క సంస్థ వల్ల కాదని, అందుకు ప్రభుత్వ సహకారం కావాలని వేణుగోపాలాచారి గారికి, కిషన్ రెడ్డి గారికి వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా సుప్రసిద్ధ సంస్కృతాంధ్ర పండితులు, గీతా ప్రచారకులు, మహా మహోపాధ్యాయ శ్రీ దోర్బల ప్రభాకరశర్మ గారికి 'గీతాచార్య' పురస్కారం తో సత్కరించారు. శ్రీశ్రీశ్రీ అవధూతగిరి మహారాజ్ శ్రీ దత్తగిరి మహారాజ్ ఆశ్రమ పీఠాధిపతులు అనుగ్రహ భాషణం చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ దైవజ్ఞ శర్మ, విజయకుమార్,సైబర్ క్రైం ఎస్.పి.రామ్మోహనరావు, రేమెళ్ళ అవధానులు, ప్రముఖ సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్,వంశీ రామరాజు లతోపాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.విద్యార్థినీ,విద్యార్థులు, గీతాబంధువులు గీతా పారాయణంతో త్యాగరాయ గానసభ పులకించి పోయింది.