అల్లు శిరీష్, సురభి, సీరత్ కపూర్, అవసరాల శ్రీనివాస్ కీలక పాత్రల్లో నటించిన సినిమా `ఒక్క క్షణం`. వి.ఐ.ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు. లక్ష్మీ నరసింహ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రూపొందుతోంది. చక్రి చిగురుపాటి నిర్మిస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ 28న విడుదలవుతుంది. అన్నపూర్ణ 7 ఏకర్స్ సెట్‌లో వేసిన సాంగ్ చిత్రీకరణ ఈరోజుతో పూర్తి కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో...
అల్లు శిరీష్ మాట్లాడుతూ - ``ఒక్క క్షణం` చివరి రోజు షూటింగ్ ఈరోజే. అందులో భాగంగా `ఢిల్లోరే..` అనే ఫోక్ సాంగ్‌ను షూట్ చేస్తున్నాం. దీనికి విజయ్ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. సినిమాను డిసెంబర్ 28న విడుదల చేస్తున్నాం. ఈ సినిమాను మేం కొరియన్ సినిమా నుండి తీసుకుని చేస్తున్నామని అంటున్నారు. అలాగే కొరియన్ కథతో తెలుగులో రణధీర్ హీరోగా `మేమిద్దరం` అనే సినిమాగా రీమేక్ చేస్తున్నారు. మా సినిమా, మేమిద్దరం అనే రెండు సినిమాల మెయిన్ పాయింట్ వినడానికి ఒకేలా ఉన్నా, మొత్తంగా చూస్తే సినిమాలు వేర్వేరుగా ఉంటాయి. నేను కూడా ఆ కొరియన్ సినిమాను తెప్పించుకుని చూశాను. రెండు సినిమాలు వేర్వేరుగా ఉన్నాయి. మా సినిమాతో పాటు `మేమిద్దరం` సినిమా కూడా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను. `శ్రీరస్తు శుభమస్తు` సినిమా తర్వాత ఈ సినిమా చేయడానికి కాస్త సమయం తీసకున్నాను, అయితే ఇకపై ఏడాదికి రెండు సినిమాలు చేసేలా ప్లాన్స్ చేసుకుంటున్నాను. ఈ సినిమాలో నాలుగు సాంగ్స్ ఉంటాయి. థీమ్ సాంగ్, మెలోడీ సాంగ్, కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సాంగ్, ఫోక్ సాంగ్)`` అన్నారు.
విఐ.ఆనంద్ మాట్లాడుతూ -``ఎక్కడికి పోతావు చిన్నవాడా` షూటింగ్‌లో ఉన్నప్పుడే శిరీష్ ఈ కథను వినగానే వెంటనే ఒప్పుకున్నాడు. అప్పటికీ తను నటించిన `శ్రీరస్తు శుభమస్తు` సినిమా విడుదల కాలేదు. ఆ సినిమా విడుదలై మంచి విజయం సాధించినా మరే సినిమా చేయడానికి ఒప్పుకోలేదు. కంటెంట్‌ను నమ్మి శిరీష్ ఈ సినిమా చేశాడు. మణిశర్మగారు ఈ సినిమాకు సంగీతం అందించారు. ఈరోజు చిత్రీకరణ చేస్తున్న సాంగ్ ఫోక్ సాంగ్. మ్యూజిక్ కంటే రీరికార్డింగ్ నెక్ట్స్ లెవల్‌లో ఉంటుంది. సినిమాను డిసెంబర్ 28న విడుదల చేస్తున్నాం`` అన్నారు.
హీరోయిన్ సురభి మాట్లాడుతూ - ``మంచి టీంతో కలిసి పనిచేశాను. ఇది చిత్రీకరణ చివరి రోజు. నలుగురు వేర్వేరు వ్యక్తుల మద్య నడిచే కథ. ప్యారలల్ లైఫ్ అనే పాయింట్‌పై ఇప్పటి వరకు ఎక్కడా సినిమాలు రాలేదు. ఇలాంటి యూనిక్ పాయింట్‌తో తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 28న విడుదలవుతుంది. ఇది పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను`` అన్నారు.
ఈ కార్యక్రమంలో డ్యాన్స్ మాస్టర్ విజయ్ కూడా పాల్గొన్నారు.