pizza
Anaganaga Oka Durga pre release function
అనగనగా ఒక దుర్గ ప్రీ రిలీజ్ కార్యక్రమం...
You are at idlebrain.com > News > Functions
Follow Us

24 October 2017
Hyderabad

గడ్డంపల్లి రవీందర్ రెడ్డి (యుఎస్ఏ) సమర్పణలో ఎస్ ఎస్ ఆర్ట్స్ ప్రొడక్షన్స్ నిర్మించిన చిత్రం అనగనగా ఒక దుర్గ. రాంబాబు నాయక్, అంజి యాదవ్ నిర్మాతలు.. ఈ సినిమా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని ఈనెల 27న విడుదలకు సిద్దమవుతోంది. విజయ్ బాలాజీ సంగీతాన్ని అందించిన అనగనగా ఒక దుర్గ పాటలు శ్రోతల ఆదరణతో విజయవంతమయ్యాయి. ఈ నేపథ్యంలో చిత్ర ఆడియో సక్సెస్ మీట్ తో పాటు ప్రీ రిలీజ్ కార్యక్రమాన్ని హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో నిర్వహించారు. దర్శకులు ఎన్ శంకర్, వీఎన్ ఆదిత్య ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా నాయిక ప్రియాంకా నాయుడు మాట్లాడుతూ....మహిళలపై హింస జరుగుతోందనే వార్తలు నిత్యం వింటూనే ఉన్నాం. అయితే ఈ ఘటనలను ఎలా ఆపాలో, ఎలా ఎదుర్కోవాలో తెలియడం లేదు. మా సినిమాలో ఈ సమస్యలకు పరిష్కాన్ని చూపించారు దర్శకులు. మహిళలకు సమస్యలు వస్తే ఎవరో వచ్చి కాపాడరు..వాళ్లే దైర్యంగా పోరాడాలి అని చెప్పడమే అనగనగా ఒక దుర్గ సినిమా ఉద్దేశం. నాపై నమ్మకంతో ఇంతటి బలమైన పాత్రను ఇచ్చిన దర్శకులు, నిర్మాతలకు కృతజ్ఞతలు. అన్నారు.

దర్శకులు ప్రకాష్ పులిజాల మాట్లాడుతూ...మొదటి నుంచీ మా చిత్రంపై నమ్మకంతో ఉన్నాం. మా సినిమా మాకెప్పుడూ గొప్పగానే ఉంటుంది. అయితే మిగతా వాళ్లు చెప్పినప్పుడే ఆ నమ్మకం నిజమనిపిస్తుంది. అనగనగా ఒక దుర్గ ప్రీమియర్ షోలను దర్శకులు ఎన్ శంకర్ సహా చాలా మంది ఇండస్ట్రీ, రాజకీయ ప్రముఖులు చూసారు. వాళ్లంతా మంచి సినిమా చేశారని ప్రశంసించారు. అప్పుడు మా ప్రయత్నం విజయవంతమైందని అనుకున్నాం. వాళ్ల మాటలతో నైతికంగా గెలిచాం అని భావించాం. ఈ చిత్రానికి పాటలు గొప్ప బలం. ముఖ్యంగా ఆడబిడ్డ రుధిరంతో అనే పాటకు అవార్డ్ వస్తుందని ఆశిస్తున్నాం.

చిత్ర సమర్పకులు గడ్డంపల్లి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ....అనగనగా ఒక దుర్గ చిత్రాన్ని ఒక బాధ్యతగా తీసుకుని నిర్మించాం. చలన చిత్రమంటే ఆట పాటలే కాదు సమాజాన్ని ప్రభావితం చేసేది అని నమ్మే వ్యక్తిని నేను. ఏడాదికి విడుదలయ్యే వందకు పైగా సినిమాల్లో సందేశాత్మకమైనవి వేళ్లమీద లెక్కపెట్టుకోవచ్చు. అందులో ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే మంచిని చెప్పే చిత్రంగా మా సినిమా నిలుస్తుంది. ఈ నెల 27న సినిమాను తెరపైకి తీసుకొస్తున్నాం. అన్నారు.

నిర్మాత రాంబాబు నాయక్ మాట్లాడుతూ...మా సినిమా బడ్జెట్ లో చిన్నదైనా, నాణ్యతలో పెద్ద చిత్రమని గర్వంగా చెప్పుకుంటాను. ఓ చిన్న గ్రామం నుంచి వచ్చి నిర్మాతగా ఎదిగానంటే అదంతా కళారంగంపై నాకున్న అభిమానం. ఓ మంచి సినిమా నిర్మించామనే సంతృప్తి మాత్రం ఎప్పటికీ నాలో నిలిచిపోతుంది. అన్నారు.

దర్శకులు ఎన్ శంకర్ మాట్లాడుతూ...అనగనగా ఒక దుర్గ చిత్రాన్ని చూశాను. సమాజంలో జరుగుతున్న సంఘటనలను కళ్లకు కట్టినట్లు చూపించారు. కథాబలం ఉంది, కమర్షియల్ అంశాలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రధాన పాత్రలో నటించిన ప్రియాంకా నాయుడు అభినయంతో ఆకట్టుకుంది. పల్లెటూరి అమ్మాయిగా ఆటపాటలు, చిలిపిగా ఉంటూనే....సందర్భం వచ్చినప్పుడు రౌద్రాన్ని, తనలోని సంఘర్షణను చూపించింది. ప్రియాంకా మంచి నటిగా పేరు తెచ్చుకుంటుందని నమ్ముతున్నాను. అన్నారు.

దర్శకులు వీఎన్ ఆదిత్య మాట్లాడుతూ....ఆరేడు ఏళ్ల క్రితం ఔట్ లుక్ అనే మ్యాగజైన్ లో ఒక ఆర్టికల్ చదివాను. అది చదివిన స్ఫూర్తితో ఒక కథ రాసుకున్నాను. నయనతార లాంటి మంచి నాయిక దొరికితే సినిమా చేద్దామని ప్రయత్నించాను. అయితే ఆ కథ తెరపైకి రాలేదు. అనగనగా ఒక దుర్గ గురించి విన్నప్పుడు నేను అనుకున్న కథ, ఈ చిత్ర నేపథ్యం ఒకటే అనిపించింది. ప్రస్తుతం సమాజానికి కావాల్సిన సినిమా ఇది. ప్రేక్షకులు చూసి ఆలోచించాల్సిన కథాంశం ఇది. అన్నారు.

ఈ కార్యక్రమంలో చిత్ర నటులు కాళీ చరణ్ సంజయ్, సంగీత దర్శకులు విజయ్ బాలాజీ ఇతర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.

 


Photo Gallery (photos by G Narasaiah)
 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved