రజత్, మాజీ మిస్ ఇండియా నేహా హింగే హీరో హీరోయిన్ లు గా, రేష్మాస్ ఆర్ట్స్ బ్యానర్ పై, రాజ్‌కుమార్ బృందావనం నిర్మాతగా బాహుబలి, భజరంగీ భాయ్‌జాన్ వంటి చిత్రాలకు అద్భుతమైన కథను అందించి, రాజన్న చిత్రంతో డైరెక్టర్ గా తన సత్తా చాటిన ప్రఖ్యాత రచయిత విజయేంద్రప్రసాద్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం `శ్రీవల్లి`. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది. పరుచూరి గోపాలకృష్ణ ట్రైలర్‌ను విడుదల చేశారు. సెప్టెంబర్ 15న విడుదల కానున్న `శ్రీ వల్లి` ప్రీ రిలీజ్ కార్డ్ ను రామ్‌చరణ్ విడుదల చేశారు.
పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ ``ఛత్రపతి, సింహాద్రి, మగధీర, బాహుబలి రాసిన వ్యక్తి ఈగ అని ఒక సినిమా రాశాడు. ఈగతో అంత విజయాన్ని సాధించిన ఈయన శ్రీవల్లితోనూ మంచి సక్సెస్‌ను సాధిస్తారు. మగధీర2 కూడా ఆయన రాయాలని కోరుకుంటున్నా`` అని చెప్పారు.
విజయేంద్రప్రసాద్ మాట్లాడుతూ ``చరణ్‌తో మా ప్రయాణం మగధీర కు ముందు మొదలైంది. సింహాద్రి సినిమా అయ్యాక రాజమౌళిని ప్రెస్ వాళ్లు చిరంజీవిగారితో ఎప్పుడు చేస్తారు అని అడిగారు. ఆయన వరం ఇవ్వాలని మా అబ్బాయి అన్నారు. ఆయన కొన్నాళ్ల తర్వాత మమ్మల్ని పిలిచి మా అబ్బాయితో సినిమా చేయమని అడిగారు. ఆయనకు కథ చెప్పాం. ఆ కథను అనుకోకుండా వారబ్బాయితో చేశాం. శ్రీవల్లి కథ ట్రాజెడీతో మొదలైంది. చిన్నప్పుడు నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు. తను నాకు ఎంతో సాయం చేశాడు. కానీ ఎందుకో ఫ్రెండ్‌షిప్ కట్ అయింది. వినాయకచవితి సమయంలో వాళ్లింటికి వెళ్లా. తను చనిపోయాడని తెలిసింది. తనూ నన్ను చూడాలనుకున్నాడని వాళ్లమ్మ చెప్పింది. అప్పుడు పుట్టిన కథ ఇది. మనిషికీ, మనిషికీ మధ్య భావ తరంగాలు ఉంటాయా? అని ఆలోచిస్తూ నేను చేసుకున్న కథే ఇది`` అని చెప్పారు.
శ్రీలేఖ మాట్లాడుతూ ``నా తొలి సినిమాను బ్లెస్ చేయడానికి చిరంజీవిగారు వచ్చారు. ఇప్పుడు నా 75వ సినిమాకోసం రామ్‌చరణ్‌గారు రావడం చాలా ఆనందంగా ఉంది`` అని తెలిపారు.
రజత్ మాట్లాడుతూ ``నేను, రామ్‌చరణ్‌గారు ఒకే స్కూల్లో చదివాం. ఆయనకు నేను స్కూల్లో జూనియర్‌ని. ఆయన వల్ల చిరంజీవిగారిని తొలిసారి చూశా. ఇవాళ నా ఫంక్షన్‌కి చరణ్‌గారు రావడం ఆనందంగా ఉంది. ఈ యూనిట్ మొత్తానికి థాంక్స్`` అని చెప్పారు.
నిర్మాత సునీత మాట్లాడుతూ ``నేను కూడా మెగా ఫ్యామిలీకి ఫ్యాన్‌ని. మా సినిమా చాలా బాగా వచ్చింది. మెగా ఫ్యామిలీని ఆదరించే ఫ్యాన్స్.. అందరూ వారి నీడలో ఉన్న మమ్మల్ని కూడా ఆదరించాలి. మా ఊరు పాలకొల్లు. నా పుట్టిల్లు పాలకొల్లు. అల్లు రామలింగయ్యగారు మాఊరు కాబట్టి మేం చాలా గొప్పగా ఫీలయ్యేవాళ్లం. మెగాస్టార్ మా ఊరి అల్లుడు కావడం, చరణ్ మా ఊరి మనవడు కావడం చాలా ఆనందంగా ఉంటుంది`` అని చెప్పారు.
రాజ్‌కుమార్ మాట్లాడుతూ ``చరణ్ సపోర్ట్ మాకు ఉండాలి. ఈ సినిమాను అందరూ హిట్ చేయాలి`` అని చెప్పారు.
రామ్‌చరణ్ మాట్లాడుతూ ``మా బ్లడ్ బ్రదర్స్ అందరూ ఇక్కడికి రావడం ఆనందంగా ఉంది. విజయేంద్రప్రసాద్‌గారితో మగధీర వేదిక తర్వాత ఇవాళే వేదిక పంచుకున్నాం. తొమ్మిదేళ్లుగా నాలో ఉన్న కోరిక ఏంటంటే.. నేనే కాదు.. విజయేంద్ర ప్రసాద్‌గారితో, రాజమౌళిగారితో పనిచేసిన ప్రతి హీరో ఇలాగే కోరుకుంటారు. అదేంటంటే వారికి థాంక్స్ చెప్పాలని అనుకుంటున్నా. మగధీర నాకు చాలా ఆనందం ఇచ్చింది. నా ఫ్యాన్స్ అందరికీ మగధీర చాలా నచ్చింది. అందుకే థాంక్స్ చెప్పా. సైన్స్ థ్రిల్లర్ అనే జోనర్ చాలా థ్రిల్లింగ్‌గా ఉంది. ఈ సినిమాను అందరూ కచ్చితంగా చూడండి. నిర్మాతలకు డబ్బులు రావాలి. హీరోకి మంచి పేరు తేవాలి. విజయేంద్రప్రసాద్‌గారికి మంచి బ్లాక్‌బస్టర్ కావాలి. నాకు అనారోగ్యంగా ఉన్నా విజయేంద్రప్రసాద్‌గారికి థాంక్స్ చెప్పాలని, అభిమానులను కలుసుకోవచ్చని వచ్చాను. ఈ సినిమాను నేను ప్రమోట్ చేయడం లేదు. విజయేంద్రప్రసాద్‌గారి పేరు ఉండటమే నేషనల్ వైడ్ సినిమా అని చెప్పకనే చెబుతుంది`` అని అన్నారు.