12 November 2017
Hyderabad
ధర్మపథ క్రియేషన్స్ పతాకంపై రూపొందుతున్న చిత్రం `మెంటల్ మదిలో`. రాజ్ కందుకూరి నిర్మాత. వివేక్ ఆత్రేయ దర్శకుడు. డి.సురేశ్‌బాబు సమర్పిస్తున్నారు. శ్రీవిష్ణు, నివేథా పెతురాజ్ జంటగా నటించారు. ఈ చిత్రం ప్రెస్ మీట్‌ను హైదరాబాద్‌లో ఆదివారం ఉదయం నిర్వహించారు. ఈ చిత్రంలోని నాలుగో పాట `ఏదేలా ఏదోలా`ను సురేశ్‌బాబు విడుదల చేశారు.
రాజ్‌కందుకూరి మాట్లాడుతూ ``మా `పెళ్లిచూపులు` సక్సెస్‌కి మీడియా ప్రధాన కారణం. తాజాగా మేం తెరకెక్కిస్తున్న `మెంటల్ మదిలో` చిత్రంలో కన్‌ఫ్యూజన్ ఉన్న ఓ అబ్బాయిని చూపిస్తున్నాం. సురేశ్‌బాబుగారికి సినిమా నచ్చి విడుదల చేయడానికి ముందుకు వచ్చారు. నివేదా తమిళంలో రెండు సినిమాలు చేసిన నాయిక. ఈ చిత్రం ద్వారా తెలుగులో పరిచయం చేస్తున్నాం. మధుర ద్వారా ఆడియో రిలీజ్ అవుతోంది. ఈ నెల 20న సైబర్ కన్వెన్షన్‌లో ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహిస్తాం. ఈ నెల 24న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం. దర్శకుడు చాలా చక్కగా తెరకెక్కించారు. ప్రశాంత్ మంచి బాణీలిచ్చారు`` అని చెప్పారు.
వివేక్ ఆత్రేయ మాట్లాడుతూ `` నేను కొంతకాలం క్రితం నిర్మాతకు ఈ కథ చెప్పాను. మా హీరో బయట చాలా కామ్‌గా కనిపిస్తారు. కానీ కెమెరా ముందు చాలా బాగా నటించారు`` అని చెప్పారు.
సంగీత దర్శకుడు ప్రశాంత్ మాట్లాడుతూ ``దాదాపు ఏడాది కలిసి పనిచేసిన చిత్రమిది. మూడు పాటలు ఇప్పటికే ఆన్‌లైన్‌లో విడుదలయ్యాయి. మధుర శ్రీధర్ మా ఆడియో విడుదల చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. రచయితలు మంచి పాటలు రాశారు`` అని చెప్పారు.
నివేథా మాట్లాడుతూ ``ఇది నా తొలి తెలుగు సినిమా. నేను మధురై పక్కన తేనిలో ఓ సినిమా షూటింగ్‌లో ఉండగా దర్శకనిర్మాతలు కథ చెప్పారు. బాగా నచ్చింది. మా నాన్నగారి వైపు తెలుగువారే. అలా నేను సగం తెలుగమ్మాయిని`` అని చెప్పారు.
కిరిటీ దామరాజు మాట్లాడుతూ ``ఈ సినిమాలో మంచి పాత్ర చేశాను. హీరోకున్న కన్‌ఫ్యూజన్‌ని క్లియర్ చేశానా? లేకపోతే మరింత పెంచానా అనేది సినిమా చూసి తెలుసుకోవాలి`` అని తెలిపారు.
మధుర శ్రీధర్ మాట్లాడుతూ ``ఒరునాళ్ కూత్తు అనే తమిళ సినిమా చూసి ఈ హీరోయిన్ తెలుగుకు సూట్ అవుతుందని అనుకున్నాను. ఈ సినిమాతో ఆమె పరిచయమవుతున్నందుకు ఆనందంగా ఉంది. పెళ్లిచూపులు ఎంత గేమ్ చేంజరో అందరికీ తెలిసిందే. చిన్న సినిమాలకు ఎప్పుడూ కంటెంట్ ప్రధానం. ఈ సినిమాకు కూడా కంటెంటే కీలకం. యప్‌టీవీ వాళ్లు ఈ చిత్రం డిజిటల్, శాటిలైట్ రైట్స్ ని తీసుకున్నారంటే, ఇందులో ఉన్న కంటెంట్ ఎంత గొప్పదో తెలుసుకోవచ్చు. సంగీతం కూడా చాలా బాగా కుదిరింది`` అని చెప్పారు.
శ్రీవిష్ణు మాట్లాడుతూ ``యంగ్, ఫ్రెష్ టీమ్ కలిసి పనిచేసిన సినిమా ఇది. కథ చూశాక చాలా హ్యాపీగా అనిపించింది. ఇందులో కన్‌ఫ్యూజన్ అయ్యే పాత్రలో నటించాను. మంచి కంటెంట్ ఉన్న సినిమా. సురేశ్‌బాబుగారు అండగా నిలవడం ఆనందంగా ఉంది`` అని తెలిపారు.
సురేశ్‌బాబు మాట్లాడుతూ ``మా సినిమా బావుందని, చూడమని ప్రతి రోజూ చాలా మంది ప్రెస్‌మీట్లలో చెప్తూనే ఉంటారు. కానీ మా సినిమాను మాత్రం రేపటి నుంచి ప్రివ్యూలు వేస్తాం. నచ్చిన వారందరూ చూసి మౌత్‌పబ్లిసిటీ చేయండి చాలు`` అని అన్నారు.