భారతదేశం గర్వించదగిన గాయకుల్లో గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు కూడ ఒకరు. అమర గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు జీవిత చరిత్ర ఆదారంగా `ఘంటసాల` బయోపిక్ రూపుదిద్దుకుంటోంది. సి.హెచ్.రామారావు దర్శకుడు. యువ గాయకుడు కృష్ణ చైతన్య ఘంటసాల పాత్రలో నటిస్తుంటే ..కృష్ణ చైతన్య సతీమణి మృదుల ఘంటసాల సతీమణిగా నటిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ను బుధవారం హైదరాబాద్ ప్రసాద్ ల్యబ్‌లో ప్రముఖ గాయకుడు ఎస్.పి.బాలసుబ్రమణ్యం విడుదల చేశారు. ఈ సందర్భంగా...
ఎస్.పి.బాలసుబ్రమణ్యం మాట్లాడుతూ - ``ఘంటసాలకు సంబంధించిన నిజాలు చాలా మందికి చాలా వరకు తెలియవు. ఆయన పాటలే కాదు.. ఆయన వ్యక్తిత్వం గురించి తెలియాల్సిన నిజాలు ఎన్నో ఉన్నాయి. ఆయన వాచ్ లోపల ఎందుకు పెట్టుకునేవారు... రుమాలు ఎలా కట్టుకునేవారు.. ఎలా కూర్చునేవారు.. సాంగ్ రికార్డింగ్‌లో ఎలా కూర్చునేవారు .. ఇలాంటి విషయాలు నేటి తరం వారికి తెలియవు. అలాంటి విషయాలు ఎన్నో తెలియాల్సిన అవసరం ఉంది. సినిమా సెన్సార్ కావడానికి ముందే ఘంటసాలగారి భార్య సావిత్రమ్మకు సినిమా చూపించి ఏమైనా మార్పులుంటే చేస్తే మంచిది. లేకుండా చాలా మంది రంధ్రాన్వేషణ చేస్తుంటారు. కాబట్టి ఆ సమస్య లేకుండా ఉండేలా దర్శకులు రామారావుగారు ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలి. సంగీతంలో పద్యాలు ఎలా పాడాలో నేర్పించింది ఆయనే .. వృత్తిపరంగానే కాదు వ్యక్తిత్వంలో కూడా ఎంత వినయంగా ఉండాలి.. ఎలా సంస్కారంగా ఉండానే దాన్ని కూడా ఆయన దగ్గరే నేర్చుకోవాలి. కృష్ణుడంటే భారతం.. రామాయణం అంటే రాముడు.. పాటలంటే ఘంటసాల అని అందరూ అనుకునేవారు. ఆయన అంతటి ప్రభావాన్ని చూపారు. సినిమాల్లోకి రాక మనుపు స్వాతంత్ర్య పోరాటంలో కూడా పాల్గొన్నారు. దేశభక్తికి సంబంధించిన ఎన్నోగేయాలను ఆయన పాడారు. ఆయనకు సంబంధించి నాకు తెలియనివి ఈ సినిమాలో ఎన్నో ఉండొచ్చు. ఆయనతో కలిసి ఐదారు సినిమాలకు పనిచేశాను. ఆయనతో కలిసి ఆరేళ్ల పాటు జర్నీ చేశాను. మలయాళ గాయని పి.లీలగారికి తెలుగు సినిమాల్లోకి తీసుకొచ్చి తెలుగు నేర్పించి ఆమెకు ఓ పేరును కల్పించిన ఘనత కూడా ఆయనదే. ఆయన్ని నా తండ్రి సమానుడిగా భావిస్తుంటాను. గురుతుల్యుడు.. ఎందరో ఆయన్ను నుండి స్ఫూర్తి పొందిన వారే కాదు.. సహాయం పొందిన వారు కూడా ఉన్నారు. కాబట్టి ఆయన విగ్రహాన్ని నేను ఆవిష్కరించారు. ఆ ఆవిష్కరణ చేసే సమయంలో నేను పడ్డ కష్టాలెన్నో నాకే తెలుసు. మేం చేయాల్సిన పనిని మీరు చేస్తున్నారు. ఆని అందరూ అన్నారు కానీ.. ఎవరూ ఆ పనిని చేయలేదు. ఎందుకనో.. వారికే తెలియాలి. ఆయనలా పాడటం ఎవరికీ సాధ్యం కాదు. ఘంటసాల తర్వాతే ..ఎవరైనా గొప్పగా పాడుతున్నారని అంటారు. కానీ.. ఘంటసాలంత గొప్పగా పాడుతున్నారని ఎవరూ చెప్పరు. చెప్పలేరు.. చెప్పకూడదు కూడా. భక్తి, దేశభక్తి, ప్రేమికుడిగా, భర్తగా అన్ని రకాలుగా తన పాటలతో పాత్రకు ప్రాణ ప్రతిష్ట చేశారు. ఆయన నా జీవితంలో కూడా ప్రముఖ పాత్ర వహించారు. ఆయనతో కలిసి కూడా నేను పాటలు పాడాను. ఆయన నా అదృష్టంగా భావిస్తున్నాను`` అన్నారు.
మండలి బుద్ధ ప్రసాద్ మాట్లాడుతూ - ``ఘంటసాలగారు మా ప్రాంతానికి చెందిన వారే. మా అవనిగడ్డ నియోజక వర్గంలోని టేకు మట్ల గ్రామంలోనే జన్మించారు. ఆయన పాటలంటే నాకు చాలా ఇష్టం. అమర గాయకుడిగా పేరు సంపాదించుకున్నారు. కేవలం సినిమాలకే పరిమితం కాలేదు. ఆయన స్వాతంత్ర్య సమరయోధుడు కూడా. ఆయన బయోపిక్ ఘన విజయం సాధించాలి. గాంధీ, సావిత్రి చిత్రాల కంటే ఘంటసాల చిత్రం పెద్ద సక్సెస్ కావాలి`` అన్నారు.
సి.హెచ్.రామారావు మాట్లాడుతూ - ``ఘంటసాలగారిపై సినిమా చేస్తే నేనే చేయాలనే స్వార్థంతోనే ఈ సినిమా చేశాను. అన్ని వర్గాలను ఆకట్టుకునేలా ఉంటుంది`` అన్నారు.
ఎం.ఎం.కీరవాణి మాట్లాడుతూ -`` ఘంటసాలగారి బయోపిక్ చేయాలనుకోవడం గొప్ప ఆలోచన. ఘంటసాలగారితో పోల్చదగ్గ వ్యక్తి బాలసుబ్రమణ్యంగారు మాత్రమే. కొత్తవారిని ఘంటశాలగారు బాగా ఎంకరేజ్ చేసేవారు`` అన్నారు.