To feature your NRI communty news in idlebrain.com, please mail us at [email protected] |
17 February 2020
USA
మిల్పిటాస్: క్యాలిఫోర్నియాలోని మిల్పిటాస్ లో సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం స్నాతకోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఫిబ్రవరీ 23, 2020 ఉదయం యూనివర్సిటీ ఆఫ్ సిలికానాంధ్ర, డా. హనిమిరెడ్డి లకిరెడ్డి భవన్ లో జరిగిన ఈ స్నాతకోత్సవానికి ఆంధ్ర ప్రదేశ్ లోని తిరుపతి, చంద్రగిరి శాశనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి గారు, మరియు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గార్లు ముఖ్య అతిధులుగా విచ్చేసి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తరఫున సిలికానాంధ్ర విశ్వవిద్యాలయ బృందానికి, విద్యార్ధులకు శుభాకాంక్షలు తెలియజేసారు. ఫిబ్రవరి 22 సాయంత్రం అదే ప్రాంగణంలో జరిగిన స్నాతకోత్సవ సంబరాల కార్యక్రమంలో విశ్వవిద్యాలయ అధ్యాపకులు, విద్యార్ధుల సంగీత నృత్య ప్రదర్శనలు జరిగాయి. ఈ సందర్భంగా జరిగిన ఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిథి కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ దేశానికి దూరంగా ఉన్నా తెలుగు భాషకు, సంస్కృతికి సిలికానాంధ్ర చేస్తున్న సేవలను కొనియాడారు. త్వరలో సిలికానాంధ్రతో కలిసి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డ్ తో చర్చించి తిరుపతిలో అన్నమయ్య లక్షగళారచన కార్యక్రమం నిర్వహిస్తామని ఈ సందర్భంగా ప్రకటించారు. మరో అతిధి శ్రీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ సిలికానాంధ్ర చేపట్టిన మనబడి, సంపద, విశ్వవిద్యాలయం, రోటరీ, సంజీవని వంటి కార్యక్రమాలు అందరికీ ఆదర్శప్రాయంగా నిలుస్తున్నాయని అన్నారు. తిరుమల బోర్డ్ మెంబర్లుగా లక్షగళార్చన ప్రతిపాదనను బోర్డ్ ముందుంచి త్వరలో కార్యాచరణ ప్రణాళికను తెలియజేస్తామని అన్నారు. సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం మరిన్ని విజయాలు సాధించాలాని, మరిన్ని కార్యక్రమాలూ అందించాలని ఆకాంక్షించారు. ముఖ్య అతిధులు కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేతులమీదుగా విశ్వవిద్యాలయ పత్రిక (జర్నల్) -'శాస్త్ర ' మరియు అంతర్జాల పత్రిక (e-Journal) ను విడుదల చేసారు.
4 సంవత్సరాల క్రితం ప్రారంభమైన సిలికానాంధ్ర విశ్వవిద్యాలయంలో కూచిపూడి, కర్ణాటక సంగీతం, భరతనాట్యం, సంస్కృతం, తెలుగు కోర్సులలో మాస్టర్స్, డిప్లమా, సర్టిఫికేట్ కోర్సులు అందిస్తున్నారు. సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం రెండవ స్నాతకోత్సవ కార్యక్రమంలో అధ్యక్షులు ఆనంద్ కూచిభొట్ల మాట్లాడుతూ, నలంద తక్షశిలలు మనకు ఆదర్శంగా నిలుస్తాయని, భారతీయ కళలు, భాష, విజ్ఞానాన్ని అందించడానికి ఈ విశ్వవిద్యాలయం నిరంతరం కృషి చేస్తోందని అన్నారు. ఇప్పటికే మనబడి ద్వారా 55వేలమందికి పైగా ప్రవాస బాలలకు తెలుగు బోధిస్తున్నామని, 3000 మందికి పైగా విద్యార్ధులు సంపద ద్వారా సంగీతం, నాట్యం, కోర్సులలో తెలుగు విశ్వవిద్యాలయం సర్టిఫికేట్‌లు అందుకున్నారనీ తెలిపారు. అనంతరం ముఖ్య అతిధులు, అధికారుల చేతులమీదుగా విద్యార్ధులకు పట్టాలు అందించారు.
ఈ సందర్భంగా కీలక ప్రసంగం చేసిన Dr. మేడెపల్లి కామేష్ భారతీయ విజ్ఞాన ఔన్నత్యాన్ని, భగవద్గీత అందించిన పరిపాలన సూత్రాలని (మేనేజ్‌మెంట్ స్కిల్స్) సోదాహరణంగా వివరించారు. కార్యక్రమంలో సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం అద్యక్షులు ఆనంద్ కూచిభొట్ల, ప్రొవోస్ట్ రాజు చమర్తి, ఉపాద్యక్షులు దీనబాబు కొండుభట్ల, దిలీప్ కొండిపర్తి, అకడమిక్ అడ్వైజరీ బోర్డ్ చైర్మన్ డా. పప్పు వేణుగోపాల రావు, మమత కూచిభొట్ల, శ్రీవల్లి కొండుభట్ల, శ్రీదేవి గంటి, శ్రీరాం కోట్ని, జయంతి కోట్ని, శిరీష చమర్తి, సాయి కందుల, అధ్యాపకులు డా. ఆర్. ఎస్ జయలక్ష్మి, డా. యశోదా ఠాకూర్, డా. వసంత లక్ష్మి, డా. సి. మృణాళిని, డా. శ్రీరాం పరసురాం, తదితరులు పాల్గొన్నారు. సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం గురించిన మరిన్ని వివరాలకు www.universityofsiliconandhra.org చూడవచ్చు.