pizza
Baby music launch
బేబి ఆడియో ఆవిష్కరణ
You are at idlebrain.com > News > Functions
Follow Us

20 April 2017
Hyderabad

సీనియర్ దర్శకుడు భారతీరాజా తనయుడు మనోజ్ భారతీరాజా కథానాయకుడిగా, షిరాగార్గ్, అంజలిరావు కథానాయికలుగా, బేబి శాతన్య, బేబి శ్రీవర్షిని ముఖ్యపాత్రల్లో డి.సురేష్ దర్శకత్వంలో తమిళంలో రూపొందిన బేబి చిత్రాన్ని అదే పేరుతో తెలుగులోకి అనువదించారు. పాలపర్తి శివకుమార్ శర్మ సమర్పణలో సాయిప్రసన్న పిక్చర్స్ పతాకంపై బి.వి.ఎన్.పవన్ కుమార్, కొలవెన్ను ఆంజనేయప్రసాద్ ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. సతీష్, హరీష్ సంగీతాన్ని సమకూర్చారు. కాగా ఈ చిత్రం ఆడియో వేడుక హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో జరిగింది. బిగ్ ఆడియో సీడీలను సీనియర్ నటుడు సుమన్ ఆవిష్కరించగా, ఆడియో సీడీలను ఆర్.పి.పట్నాయక్ విడుదలచేసి, తొలి సీడీని సుమన్ కు అందించారు. ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ, నేను పరిశ్రమలోనికి వచ్చిన తొలి రోజుల్లో అంటే 1975వ సంవత్సరంలో ఇద్దరు రాజాలు ట్రెండ్ ను మార్చివేశారు. వారెవరో కాదు ఒకరు భారతీరాజా, మరొకరు ఇళయరాజా. సహజత్వానికి దగ్గరగా సినిమాలను తెరకెక్కించి కొత్తపంథాకు వారు తెరతీశారు. ఇప్పుడు భారతీరాజా అబ్బాయి ఈ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయం కాబోతుండటం ఆనందంగా ఉంది. పాటలతో పాటు ఈ చిత్రం ట్రైలర్స్ కూడా ఎంతో బావున్నాయి అని అన్నారు.

మరో అతిథి ఆర్.పి.పట్నాయక్ మాట్లాడుతూ, ట్రైలర్ లోని హారర్ అంశాలు చూస్తుంటే మంచి ఉత్కంఠను కలిగిస్తోందని, పాటలు కూడా ఆకట్టుకుంటున్నాయని చెప్పారు.ఇంకో అతిథి తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ, చిన్న సినిమాలకు థియేటర్ల సమస్య ఉన్నప్పటికీ, కంటెంట్ ఉన్న సినిమాలకు విడుదల సమయంలో థియేటర్లు బాగానే దొరుకుతున్నాయని అన్నారు. ఇప్పటికే తమిళ ప్రేక్షకుల ఆదరణను చూరగొన్న ఈ చిత్రానికి తప్పకుండా తెలుగు ప్రేక్షకుల మద్దతు కూడా లభిస్తుందన్న అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. ఇంకో అతిథి శ్రీరంగం సతీష్ కుమార్ మాట్లాడుతూ, నిర్మాతలు ఎంతో అభిరుచితో చిత్ర పరిశ్రమలోనికి ప్రవేశించారని, ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ చిత్రం ఉంటుందని అన్నారు. గీత రచయిత చల్లా భాగ్యలక్ష్మి మాట్లాడుతూ, మదర్ సెంటిమెంట్, హారర్ అంశాలను మేళవించి ఈ చిత్రాన్ని రూపొందించారు. పాటలతో పాటు హారర్ హైలైట్ గా ఉంటుంది అని అన్నారు.

Glam galleries from the event

చిత్ర నిర్మాతలు బి.వి.ఎన్.పవన్ కుమార్, కొలవెన్ను ఆంజనేయప్రసాద్ మాట్లాడుతూ, సస్పెన్స్, హారర్ కథాంశంతో ఫ్యామిలీ ప్రేక్షకులు చూసేవిధంగా ఈ చిత్రం ఉంటుందని, మే నెలలో చిత్రాన్ని విడుదలచేస్తామని చెప్పారు.దీని తర్వాత తెలుగులో స్ట్రయిట్ చిత్రాన్ని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నామని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో సాయివెంకట్, రమేష్, పిశాఛి-2 చిత్రం ఫేమ్ శిప్రాగౌర్, చిత్ర సమర్పకుడు పాలపర్తి శివకుమార్ శర్మ, సహ నిర్మాతలు బత్తుల కూర్మయ్య, బత్తుల శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. శివరంజని మ్యూజిక్ ద్వారా ఈ ఆడియో విడుదలైంది.

 


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved