మహేష్ హీరోగా నటించిన సినిమా బ్రహ్మోత్సవం. సమంత, కాజల్, ప్రణీత నాయికలు. పి.వి.పి. సినిమా, ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్ ప్రై. లిమిటెడ్ పతాకాలపై శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో పెరల్ వి.పొట్లూరి, పరమ్ వి.పొట్లూరి, కవిన్ అన్నె నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలోని పాటలను హైదరాబాద్‌లో శనివారం రాత్రి విడుదల చేశారు. సత్యరాజ్, రేవతి, జయసుధ, కాజల్, సమంత సంయుక్తంగా ట్రైలర్‌ను విడుదల చేశారు. మహేష్ తొలి సీడీని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో రావు రమేష్, రజిత, ప్రణీత తదితరులు పాల్గొన్నారు.
పీవీపీ మాట్లాడుతూ ``బ్రహ్మోత్సవం మాకు మరింత ముఖ్యమైన ఉత్సవం. పిలిచిన వారందరూ రావడం చాలా ఆనందంగా ఉంది. మహేష్‌బాబుగారు వారి కుటుంబంతో ఒక ఉత్సవం చేయడానికి ఈ కార్యక్రమానికి వచ్చారు. సంగీతోత్సవం అనే ఈ వేడుకను అంటున్నాం`` అని అన్నారు.
విజయనిర్మల మాట్లాడుతూ ``టైటిల్ చాలా బావుంది. ఈ టైటిల్‌లాగానే ఈ సినిమా తప్పకుండా 100 రోజులు ఆడుతుందనే నమ్మకం నాకుంది`` అని అన్నారు.
కృష్ణ మాట్లాడుతూ ``పీవీపీ నాకు చాలా కాలంగా తెలుసు. మేం విదేశాలకు వెళ్లినప్పుడు మాతోనే ఉండి అన్నీ చూపించారు. ఇక్కడికి వచ్చి గ్రాండ్‌గా సినిమాలు తీస్తున్నారు. ఈ సినిమాను కూడా ఎక్కువ ఖర్చుపెట్టి తీసి ఉంటారని నా నమ్మకం. శ్రీకాంత్ అడ్డాల తీసిన `సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు` చూస్తే ఎక్కడా సినిమాలు చూస్తున్నట్టు అనిపించదు. నిజ జీవితంలో పాత్రలు కదులుతున్నట్టు ఉంటాయి. ఈ సినిమా ట్రైలర్ చాలా బావుంది. మహేష్ ఇందులో అందంగా కనిపించాడు. ఈ సినిమా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు కన్నా ఇంకా పెద్ద హిట్ కావాలి. సంగీతం చాలా పెద్ద హిట్ కావాలి. `శ్రీమంతుడు` రికార్డులను ఈ సినిమా తిరగ రాయాలి. పీవీపీ గారికి ఈ సినిమా ఎక్కువ డబ్బులు తీసుకురావాలి. మహేష్‌కి మంచి పేరు తేవాలి`` అని అన్నారు.
సత్యరాజ్ మాట్లాడుతూ``ఈ సినిమాలో స్టోరీ, దర్శకుడు, నటీనటులు అందరూ బావున్నారు. నాకు లాంగ్వేజ్ ప్రాబ్లమ్ ఇప్పుడే కాదు ఎప్పుడూ ఉంది. 40 ఏళ్ల క్రితం నేను బీఎస్సీ చదువుతున్నప్పుడు నాకు ఇంగ్లిష్ రాకపోతే మా మాస్టర్ నన్ను చూసి `డిగ్రీ చదువుతూ ఇంగ్లిష్ ఎందుకు రాదురా?` అని అడిగారు. అందుకు నేను `సార్ చెన్నై నుంచి 500 కిలోమీటర్లలో ఆంధ్రా ఉంది. నాకు తెలుగే రాదు. 5వేల కిలోమీటర్లున్న లండన్‌లోని ఇంగ్లిష్ ఎలా వస్తుంది` అని అన్నా. జోకులు తర్వాత కానీ ఈ సినిమాలో నటించినందుకు ఆనందంగా ఉంది`` అని చెప్పారు.
రేవతి మాట్లాడుతూ``ఈ టీమ్‌తో కలిసి పనిచేసినందుకు ఆనందంగా ఉంది. దర్శకనిర్మాతలకు ధన్యవాదాలు. ఈ సినిమా ఒక ఉత్సవం. షూటింగ్‌లోనూ ఉత్సవంలాగానే అనిపించింది. ఇందులో కుటుంబ విలువలు ఉన్నాయి. షూటింగ్‌లోనూ నవ్వులున్నాయి. ఎమోషన్స్ ఉన్నాయి. గొడవలున్నాయి. కన్నీళ్లున్నాయి. అన్నీ ఉన్నాయి. కానీ చివరికి అందరికీ మంచి పేరు తెచ్చిపెడుతుందనే నమ్మకంతో పనిచేశాం`` అని చెప్పారు.
సుధీర్‌బాబు మాట్లాడుతూ``తిరుపతిలో గోవిందా గోవిందా అని మారుమోగుతుంటుంది. ఇక్కడ ఈ బ్రహ్మోత్సవంలో సూపర్‌స్టార్ మహేష్ అనే పేరు మారుమోగుతోంది. అక్కడ తిరుపతిలో హుండీలో భక్తులు కానుకల వర్షం కురిపిస్తుంటారు. ఇక్కడ ఈ సినిమా హుండీలో కాసుల వర్షం కురవాలని వెంకటేశ్వర స్వామి భక్తుడిగా కోరుకుంటున్నా. ఈ మధ్యలో సినిమాల్లో బ్యాడ్‌బోయ్‌గా మారా. బ్యాడ్ బోయ్ ని అయినా పీవీపీగారు పిలిచారు`` అని తెలిపారు.
కాజల్ మాట్లాడుతూ ``మంచి టీమ్ తో పనిచేశా. అమేజింగ్ ఆర్టిస్ట్స్, మంచి టెక్నీషియన్స్ తో చేయడం ఆనందంగా ఉంది. నా పాత్ర చాలా బావుంది. ఇది బ్యూటీఫుల్ కేరక్టర్. ఇందులో పనిచేసిన ప్రతి ఒక్కరికీ సినిమా నచ్చుతుందనే నమ్మకం ఉంది`` అని చెప్పారు.
వంశీ పైడిపల్లి మాట్లాడుతూ ``శ్రీకాంత్‌గారు చేసింది తక్కువ చిత్రాలే అయినా తనకంటూ ఒక మార్కు వేసుకున్నారు. పీవీపీ గురించి అనుకున్నప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంటుంది. మహేష్‌గారిని నేను చాలా ఆరాధిస్తాను. ఆయన పని, ఆయన ప్యాషన్, ఆయన గట్స్ అన్నిటినీ చూసి ఆశ్చర్యపోతున్నాం. సూపర్ స్టార్‌డమ్ ఉన్న ఒక హీరో ఒక చోట ఆగిపోతే దాన్ని దాటి మహేష్ మరో గీత గీస్తారు. సీతమ్మ వాకిట్లో చిత్రంతో ఎప్పుడో ఆగిపోయిన మల్టీ స్టారర్ ట్రెండ్‌ను మరలా మొదలుపెట్టారు. క్యారక్టర్‌ను నమ్మి శ్రీమంతుడు చేశారు. చెప్పులను ఒక కాలికి తొడుగుతూ వచ్చిన బ్రహ్మోత్సవం ఫస్ట్ లుక్ రిలీజ్ చేయడానికి చాలా గట్స్ ఉండాలి. సినిమా రిజల్ట్ ఏదైనా అందుకు నేను కూడా ఒక బాధ్యుడినే అని మహేష్ చెప్పడం మర్చిపోలేను`` అని చెప్పాను.
జయసుధ మాట్లాడుతూ ``బ్రహ్మోత్సవం చాలా బాగా జరిగింది. అమేజింగ్ జర్నీ. శ్రీకాంత్‌తో నాకు ఇది మూడో సినిమా. కొత్తబంగారులోకం, సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు, ఇప్పుడు బ్రహ్మోత్సవం చేశాం. ఈ సినిమాలో క్లైమాక్స్ సన్నివేశంలో మహేశ్ చేస్తున్నప్పుడు నాకళ్లమ్మట నీళ్లొచ్చాయి. నటిగా ఇప్పటిదాకా ఎన్నో ఎమోషనల్ పాత్రల్లో నటించినప్పటికీ ఈ సినిమా క్లైమాక్స్ సీన్ నాకు గుర్తుండిపోతుంది`` అని అన్నారు.
సమంత మాట్లాడుతూ ``అన్ని సినిమాల్లో ఎలా చేస్తానో అని టెన్షన్ ఉంటుంది. అదే మహేష్ సినిమా అయితే నేను ఎలా కనిపిస్తానో అనే టెన్షన్ ఉంటుంది. ఆయనతో ఇంతకు ముందు చేసిన సినిమాలు హిట్ అయ్యాయి. పేరెంట్స్ పిల్లలను పెంచడం మామూలే. అయితే పిల్లలు ఫ్యామిలీ రూట్స్ ని వెతకడం చాలా కొత్తగా అనిపించింది. చిన్న చిన్న ఉత్సవాలను కలిపితే అది బ్రహ్మోత్సవం అవుతుంది. పీవీపీగారు ఈ సినిమాతో హ్యాట్రిక్ కొట్టాలి. ఈ సినిమాలో సీనియర్ ఆర్టిస్ట్ లతో పనిచేసినందుకు ఆనందంగా ఉంది. మిక్కీ చాలా బాగా మ్యూజిక్ ఇచ్చారు. ఈ సినిమా పేరులాగానే థియేటర్లలో ఉత్సవం ఉంటుంది. ఆ సెలబ్రేషన్ చూడటానికి నేను ఎదురుచూస్తున్నాను`` అని తెలిపారు.
నరేష్ మాట్లాడుతూ ``మహేష్ తో పనిచేయడం చాలా ఆనందంగా ఉంటుంది. తను కంప్లీట్ మేన్ మాత్రమే కాదు, పర్ఫెక్షనిస్ట్. తనతో పనిచేయడం చాలా థ్రిల్ గా ఉంటుంది. తన సినిమాలో ఎప్పుడు కనిపిస్తానా అని చాలా మంది ఫ్యాన్స్ అడిగారు. ఈ చిత్రంతో చాలా హ్యాపీగా అనిపించింది. ఈ సినిమాను దర్శకత్వం చేయాలంటే శ్రీకాంత్ వల్లనే సాధ్యం. నెక్స్ట్ జనరేషన్ ప్రొడ్యూసర్ ఆయన. పండంటి కాపురం సినిమా సెట్‌లో చూసిన పండుగ వాతావరణాన్ని మరలా ఈ సినిమా సెట్‌లో చూశాను. బ్రహ్మోత్సవం కలెక్షన్స్ తిరుమల ఒక్క సంవత్సరం కలెక్షన్లను దాటాలి. ఇళయరాజా తర్వాత నాకు మిక్కీ సంగీతం అంటే చాలా ఇష్టం`` అని చెప్పారు.
తోట తరణి మాట్లాడుతూ ``లవ్ లీ ప్రొడక్షన్, క్రూ, యాక్టర్స్ కలిసి చేసిన సినిమా. టెక్నీషియన్స్ చాలా కష్టపడి చేశారు. నా వర్క్ ను రత్నవేలు చాలా బాగా చూపించారు. మంచి పిక్చర్ ఇది`` అని చెప్పారు.
రత్నవేలు మాట్లాడుతూ ``శ్రీకాంత్ చక్కటి స్క్రిప్ట్ రాశారు. ఈ సినిమా కుటుంబంతో పనిచేయడం ఆనందంగా అనిపించింది. ఇందులో ఫ్యూజన్ విజన్ ఇవ్వడానికి ప్రయత్నించాను. మిక్కీ పాటలు బావున్నాయి. తరణిగారి సెట్లు చాలా బావుంటాయి. మహేష్‌గారు ఎప్పుడూ తన లుక్స్ తో ఎక్సయిట్ చేస్తుంటారు. నా కెమెరా ఇప్పటిదాకా చిత్రీకరించిన వాళ్లలో అత్యంత అందగాడు మహేష్. పీవీపీగారు చాలా ప్యాషన్ ఉన్న వ్యక్తి`` అని చెప్పారు.
శ్రీకాంత్ మాట్లాడుతూ ``ఈ సినిమాకు చాలా మంది సీనియర్లు పనిచేశారు. వారితో పనిచేసేటప్పుడు చాలా బెరుగ్గా అనిపించేది. అలాంటప్పుడు మహేష్ గారి వంక చూస్తే చిరునవ్వు నవ్వేవారు. దాంతో ముందుకు వెళ్లేవాడిని. ఇలాంటి పెద్ద పనిని వెనుక వేసుకున్నప్పుడు ఒక ప్రోత్సాహం ఉండాలి. అలాంటి ప్రోత్సాహాన్ని మహేష్ ఇచ్చారు. ఆయనతో ఇది నా రెండో సినిమా. భగవంతుడు ఇచ్చిన శక్తిమేరకు ఈ అవకాశాన్ని కూడా ఉపయోగించుకున్నాను. బ్రహ్మోత్సవం అని టైటిల్ పెట్టినప్పుడు తిరుపతి వెంకటేశ్వర స్వామి పాదాలని దృష్టిలో పెట్టుకుని, అంతటి వినయంగా ఉండాలని అనుకున్నా. ఫస్ట్ పోస్టర్‌ను కూడా విలువలను గుర్తుపెట్టుకునే ఈ కథను తయారు చేసుకున్నాను. తోట తరణిగారు పనిచేస్తే ఆ సినిమాతో దర్శకుడు ఇంకో లెవల్‌కి వెళ్లినట్టే అని నా ఫ్రెండ్ అని అన్నారు. సెట్లో అందరం కలిసి భోజనం చేసేవాళ్లం. అప్పుడు పది మందికి కలిపి పెట్టడం తోటతరణిగారి దగ్గర నేర్చుకున్నా. నేను బాడీ అయితే మిక్కీ సోల్. ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు`` అని చెప్పారు.
మిక్కీ.జె.మేయర్ మాట్లాడుతూ ``బ్రహ్మోత్సవం ఆడియో కోసం చాలా నెలలు కష్టపడ్డాం. ఈ అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు, మహేష్‌కి ధన్యవాదాలు. వాళ్లతో పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. సీతారామశాస్త్రిగారు, కృష్ణచైతన్యకు, శ్రీకాంత్ అడ్డాలకు కూడా ధన్యవాదాలు. మహేష్‌గారితో రెండో సారి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. రాత్ సినిమా చేసినప్పటి నుంచి రేవతి మేడమ్‌కి నేను చాలా పెద్ద ఫ్యాన్‌ని. ఆమె ఈ సినిమాలో నటించడం నాకు చాలా ఆనందంగా ఉంది`` అని అన్నారు.
పరుచూరి బ్రదర్స్ మాట్లాడుతూ ``మాకు ఇద్దరు దేవుళ్లు. వాళ్లలో ఎన్టీఆర్ ఒకటైతే, రెండోది కృష్ణగారు. కృష్ణగారి పేరును నిలబెడుతున్నారు మహేష్. శ్రీకాంత్ స్కూలు అని ఈ మధ్య కొత్త స్కూలు మొదలైంది. విలువలకు, మానవత్వానికి ఆయన స్కూల్లో ప్రత్యేక చోటు ఉంటుంది. ఒకప్పుడు చాలా గొప్ప సంస్థలు ఉండేవి. అలాంటి సంస్థల స్థానాన్ని పీవీపీ సంస్థ ఆక్రమించాలి. ఈ సినిమా సకల జబ్బులను నయం చేస్తుంది`` అని చెప్పారు.
మహేష్ మాట్లాడుతూ ``తొలిసారి నా ఆడియో వేడుకకు నా పాప సితార పాప వచ్చింది. రేవతిగారు, జయసుధగారు, తులసిగారు, నరేష్‌గారు, సాయాజీగారితో పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. సత్యరాజ్‌గారంటే చిన్నప్పటి నుంచి ఇష్టం. ఆయనకు పెద్ద అభిమానిని. ఆయనతో పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. కాజల్, సమంతతో ఇంతకు ముందు కూడా పనిచేశా. వాళ్లతో మ రలా పనిచేయడం ఆనందంగా ఉంది. తోట తరణిగారి గురించి మాట్లాడేటంత అనుభవం లేదు. అర్జున్ సినిమాలో ఆయన వేసిన సెట్ ను మర్చిపోలేను. మధుర మీనాక్షి టెంపుల్‌ను ఆయన వేశారు. విజువల్స్ ఈ సినిమాలో ఇంత గ్రాండ్‌గా ఉన్నాయంటే ఆయనే కారణం. నేను ఫోన్ చేయగానే రత్నవేలుగారు ఒప్పుకుని చేశారు. భారతదేశంలో ఉన్న కెమెరామేన్‌లలో ఆయన చాలా గొప్పవారు. మిక్కీ మంచి సంగీతాన్నిచ్చారు. మిక్కీ ఇచ్చిన ఒక ట్యూన్ వింటే శ్రీకాంత్‌గారికి డౌట్ అనిపించింది. కానీ మిక్కీ నాకు ఫోన్ చేసి ఇది నా హార్ట్ నుంచి వచ్చింది నమ్మండి అని అన్నారు. అలా ఆయన సంగీతం చేస్తారు. సీతమ్మవాకిట్లో ఆడియో నాకు చాలా ఇష్టం. ఈ బ్రహ్మోత్సవం ఆడియో అంతకన్నా పెద్ద హిట్ అవుతుంది. శ్రీకాంత్‌గారు చాలా ప్యూర్‌గా ఉంటారు. ఆయన ఇండస్ట్రీ వాళ్లతో ఎక్కువగా కలవరు. అందుకే అంత ప్యూర్‌గా ఉన్నారేమో. ఆయనంటే నాకు చాలా ఇష్టం. ఆయన సినిమాల్లో ఎప్పుడూ కథలు మన రియల్ లైఫ్ సిచ్యువేషన్స్ తో ఉంటాయి. సీతమ్మ వాకిట్లో సినిమాతో హ్యూమన్ బీయింగ్‌గా ఎదిగాను. ఈ సినిమాతో ఇంకా ఎదిగాను. ఆయనతో మ రిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. పరుచూరి బ్రదర్స్ గారిని చిన్నప్పటి నుంచి చూస్తున్నా. చేస్తున్నా. పీవీపీగారు చిన్న పిల్లాడిలాగా ఎగ్జయిట్ అవుతూనే ఉన్నారు. మంచి పేషనేట్ ప్రొడ్యూసర్ ఆయన. బ్రహ్మోత్సవంలాంటి గొప్ప సినిమాలను ఆయనింకా చేయాలి. నేనెప్పుడూ స్టేజ్ మీద మీ గురించి పెద్ద పెద్ద మాటలు మాట్లాడలేదు. ఎందుకంటే మనం ఎవరిమీదన్నా నిజంగా ప్రేమ ఉంటే దాన్ని మాటల్లో చెప్పలేం. అభిమానులు నా కెరీర్‌ని సపోర్ట్ చేసినందుకు, నన్ను ఇంత వాడిని చేసినందుకు చాలా థాంక్స్. అభిమానులు ఎప్పుడూ నా గుండెల్లో ఉంటారు. మే 20న బ్రహ్మోత్సవాలు మొదలుకానున్నాయి. మనందరికి పెద్ద పండుగలా ఉండాలని కోరుకుంటున్నాను`` అని అన్నారు.