22 February 2016
Hyderabad
స్నేహచిత్రం పిక్చర్స్ పతాకంపై ఆర్.నారాయణమూర్తి దర్శక నిర్మాతగా రూపొందిన చిత్రం దండకారణ్యం. ఆర్.నారాయణమూర్తి, త్రినాథ్, విక్రమ్ ప్రధాన పాత్రధారులు. ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం సోమవారం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రజా గాయకుడు గద్ధర్, ప్రెస్ అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ, నారదాస్ లక్ష్మణ్ దాస్, ఆర్.నారాయణమూర్తి, గోరేటి వెంకన్న, ములుగు తిరుపతి తదితరులు పాల్గొన్నారు. ఆడియో సీడీలను గద్ధర్ ఆవిష్కరించారు. తొలి సీడీని అల్లం నారాయణ అందుకున్నారు. ఈ సందర్భంగా...
గద్ధర్ మాట్లాడుతూ ‘’ఈ దేశంలోని సంపద మన అందరిదీ. దాన్ని కాపాడుకునే బాధ్యత మన అందరిదీ. మన వనరుల్ని మనం రక్షించుకోవాలని, మన బాధ్యతను తెలియజేసే చిత్రమే దండకారణ్యం. ఈ వనరులు అవి ఉండే దేశానికి డాలర్ తో సమానం. ఈ చిత్రం ఓ దేశభక్తి గీతంలాంటిది. నారాయణమూర్తి అడగటంతో చాలా రోజుల తర్వాత పాటలు పాడటమే కాదు, నటించాను కూడా. నారాయణమూర్తి సినిమా రంగానికి చెందిన మిత్రుడే కాదు. ఉద్యమాన్ని గుండెలకు హత్తుకున్న వ్యక్తి. తన తీసే సినిమాల్లో చాలా కమిట్ మెంట్ తో ఉంటాడు. ఈ సినిమాను విజయవంతం చేయాల్సిన బాధ్యత అందరిదీ’’ అన్నారు.
అల్లం నారాయణ మాట్లాడుతూ ‘’చాలారోజుల తర్వాత ఈ సినిమాలో గద్ధర్ అన్న పాటలు రాయడమే కాదు, నటించారు కూడా. సినిమా చూశాం. చాలా చక్కగా ఉంది. మన విలువలను కాపాడుకోవాలని తెలియజేసే చిత్రమిది. ఇందులో కిషన్ జీ క్యారెక్టర్ ను నారాయణమూర్తి చేయడం అభినందనీయం. 70 ఏళ్ళుగా సాగుతున్న ప్రత్యామ్నాయ రాజకీయాల గురించి చెప్పే చిత్రమిది’’ అన్నారు.
నారదాస్ లక్ష్మణ్ దాస్ మాట్లాడుతూ ‘’కోటేశ్వరరావుగారిపై చేసిన చిత్రమిది. భారతదేశ సినీ చరిత్రలో నిలిచిపోయే చిత్రమవుతుంది. సినిమా చూశాను. చాలా చక్కగా ఉంది. అందరూ ఆదరించాలని ఉంది’’ అన్నారు.
ఆర్.నారాయణమూర్తి మాట్లాడుతూ ‘’ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చి భారతదేశంలో పరాయిపాలనను తీసుకు వచ్చినప్పుడు చాలా మంది త్యాగధనుల పోరాటంతో మనకు స్వాతంత్యం వచ్చింది. కానీ మళ్ళీ ఇప్పుడు పరాయి కంపెనీలను మన దేశంలోకి ఆహ్వానిస్తున్నాం. ఎందుకోసం, ఎవరికోసం, మన సంపద మనదని తెలియజేసేదే ఈ చిత్రం’’ అన్నారు.
ఈ చిత్రానికి కెమెరా: శివకుమార్, కథ, చిత్రానువాదం, మాటలు, ఎడిటింగ్, కొరియోగ్రఫీ, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ, సంగీతం, నిర్మాత, దర్శకత్వం: ఆర్.నారాయణమూర్తి.