సత్యరాజ్ ప్రధాన పాత్రలో తమిళంలో జాక్సన్ దొరై అనే చిత్రంలో నటించారు. ఈ చిత్రాన్ని రత్నా సెల్యులాయిడ్స్ పతాకంపై జక్కం జవహర్‌బాబు తెలుగులో `దొర` అనే టైటిల్ తో విడుదల చేస్తున్నారు. ధరణీధరన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సత్యరాజ్ తనయుడు శిబిరాజ్ హీరోగా నటించారు. బిందుమాధవి నాయిక. కరుణాకరన్, సహాయం రాజేంద్రన్ ఇతర కీలక పాత్రధారులు. సిద్ధార్థ్ విపిన్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం మంగళవారం హైదరాబాద్ తాజ్ బంజారాలో జరిగింది. బిగ్ సీడీని డి.సురేష్‌బాబు, సత్యరాజ్ విడుదల చేయగా ఆడియోసీడీలను సత్యరాజ్ విడుదల చేశారు. ఈ సందర్భంగా....
సత్యరాజ్ మాట్లాడుతూ ``దొర చిత్రం ఓ పీరియాడికల్ హర్రర్ ఎంటర్ టైనర్. అలాగే మంచి థ్రిలింగ్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి. బాహుబలి తర్వాత నన్ను అందరూ కటప్ప అని పిలుస్తున్నారు. ఈ చిత్రం తర్వాత అందరూ దొర అని పిలుస్తారు. సినిమా మేకింగ్ బావుంది. అందరికీ ఆల్ ది బెస్ట్`` అన్నారు.
శిబి సత్యరాజ్ మాట్లాడుతూ ``తెలుగు, తమిళంలో ఓకేరోజున విడుదలవుతున్న చిత్రమిది కావడంతో ఈ చిత్రాన్ని నాకు స్పెషల్‌గా భావిస్తున్నాను. ఈ చిత్రం నాన్నగారికి బాహుబలి తర్వాత మరో మైల్‌స్టోన్ మూవీ అవుతుంది. వరల్డ్‌వైడ్ గా 1000 థియేటర్స్‌లో సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. దర్శక నిర్మాతలకు అభినందనలు`` అన్నారు.
చిత్ర దర్శకుడు ధరణీధరన్ మాట్లాడుతూ ``టాలీవుడ్‌లో సినిమా చేయాలని చాలా కాలంగా అనుకుంటున్నాను. ఈ సినిమాతో ఆ కోరిక కొంత నేరవేరింది. ఎందుకంటే తమిళంతో పాటు తెలుగులో కూడా సినిమా గ్రాండ్ రిలీజ్ అవుతుంది. శశాంక్ వెన్నెలకంటి మాటలు, సిద్ధార్థ్ విపిన్ మ్యూజిక్ సినిమాకు ప్లస్ అవుతాయి. ఆడియో, సినిమా మంచి సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నాను`` అన్నారు.
తమిళ నిర్మాత శరవణన్ మాట్లాడుతూ ``బాహుబలిలో కట్టప్పగా సత్యరాజ్‌గారు వరల్డ్ ఫేమస్ అయ్యారు. ఈ చిత్రంలో ఆయన దెయ్యం పాత్రలో నటించారు. చాలా డిఫరెంట్ మూవీ. అందరికీ నచ్చే చిత్రమవుతుంది`` అన్నారు.
జక్కం జవహర్‌బాబు మాట్లాడుతూ ``ఇప్పటి వరకు తెలుగు సినిమాల్లో తండ్రి పాత్రల్లో మెప్పించిన సత్యరాజ్‌గారు నటించిన తొలి హర్రర్ పీరియాడికల్ మూవీ. సిద్ధార్థ్ విపిన్ సంగీతం చక్కగా ఉంది. తెలుగు, తమిళంలో జూలై 1న గ్రాండ్ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నాం`` అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ సిద్ధార్థ్ విపిన్ మాట్లాడుతూ ``చంద్రబోస్ గారు మంచి సాహిత్యాన్ని అందించారు. మూడు సాంగ్స్ చక్కగా వచ్చాయి. సత్యరాజ్ దెయ్యం పాత్రలో నటించారు. సత్యరాజ్‌గారు, శిబిరాజ్‌గారు చక్కగా యాక్ట్ చేశారు. ఇంత మంచి సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్`` అన్నారు.