ఆర్.బి.చౌదరి సమర్పణలో సూపర్‌గుడ్ ఫిలింస్ బ్యానర్‌పై ఆర్య, క్యాథరిన్ హీరో హీరోయిన్లుగా నటించిన `కదంబన్` చిత్రాన్నిగజేంద్రుడు పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు. రాఘవ దర్శకత్వంలో ఆర్.బి.చౌదరి నిర్మాతగా సినిమా రూపొందింది. యువన్ శంకర్ రాజా సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం గురువారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్.బి.చౌదరి, వంశీపైడిపల్లి, రానా, ఆర్య, ఎస్.వి.కృష్ణారెడ్డి, కె.అచ్చిరెడ్డి, సి.కళ్యాణ్, పారస్‌జైన్, వాకాడ అప్పారావు, ఎన్.వి.ప్రసాద్, భీమినేని శ్రీనివాసరావు, గుణశేఖర్, క్యాథరిన్ థెస్రా తదితరులు పాల్గొన్నారు. రానా బిగ్ సీడీ, ఆడియో సీడీలను విడుదల చేశారు. తొలి ఆడియో సీడీని వంశీ పైడిపల్లి అందుకున్నారు. ఈ సందర్భంగా...
గుణశేఖర్ మాట్లాడుతూ - ``ట్రైలర్ చాలా బావుంది. ఈ మధ్య కాలంలో ఇలాంటి డిఫరెంట్ చిత్రాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. కంటెంట్‌ను నమ్ముకుని మూడు దశాబ్దాలుగా సినిమాలను నిర్మిస్తున్న సంస్థ సూపర్‌గుడ్ ఫిలింస్. ఈ సంస్థ అంటే ప్రేక్షకులకు మంచి నమ్మకం ఉంది. బ్యానర్ పేరు చూసి ప్రేక్షకులు థియేటర్‌కు వస్తుంటారు. యువన్ శంకర్ రాజాగారు అద్భుతమైన మ్యూజిక్ అందించారు. క్యాథరిన్, తను మంచి సినిమాలనే సెలక్ట్ చేసుకుంటూ ఉంటుంది. కొత్త కథాంశంతో సినిమా తీసిన దర్శకుడు రాఘవకు అభినందనలు. ఆర్య, దర్శకుల హీరో. తను ఎంత పెద్ద స్టార్ అయినా, తను కథ నచ్చితే హీరోనా, విలనా అని ఆలోచించకుండా సినిమాలు చేస్తుంటాడు. నేను దేవుణ్ణి సినిమాలో ఆర్య పడ్డ కష్టం నాకు తెలుసు. కొత్త దర్శకులను ప్రోత్సహించే హీరో. గజేంద్రుడు సినిమా ఏప్రిల్ 14న విడుదల కానుంది. సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎదురుచూస్తున్నాను`` అన్నారు.
ఎస్.వి.కృష్ణారెడ్డి మాట్లాడుతూ - ``సూపర్‌గుడ్ ఫిలింస్ అనేది పెద్ద బ్యానర్. కొత్త జోనర్ సినిమాలను జనం ఆదరిస్తున్నారు. గజేంద్రుడు సినిమాను పూర్తిగా అడవిలోనే తీశారు. ఆర్య వంటి మంచి హీరో ఎక్స్‌ట్రార్డినరీగా నటించాడు. క్యాథరిన్ అందంగా ఉంది. యువన్ అద్భుతమైన సంగీతాన్ని అందించాడు. ఎంటైర్ టీంకు అభినందనలు`` అన్నారు.
ఎన్.వి.ప్రసాద్ మాట్లాడుతూ - ``ఆర్.బి.చౌదరిగారి వద్దనే సినిమా ఎలా తీయాలి, ఎలా ఉండాలనే విషయాలను నేర్చుకున్నాను. ఇప్పటి వరకు చౌదరిగారు మాకు అండగా ఎలా నిలబడ్డారో మేం కూడా అలా ఆయనకు అండగా నిలబడి, ఆ బ్యానర్ వంద సినిమాలు పూర్తయ్యేలా చూస్తాం. ఈ బ్యానర్‌లో వస్తున్న గజేంద్రుడు సెన్సేషనల్ హిట్ కావాలని కోరుకుంటున్నాను`` అన్నారు.
భీమినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ - ``సూపర్ గుడ్ ఫిలింస్ బ్యానర్ పేరులోనే పాజిటివ్ ఎనర్జీ ఉంది. మంచి కథ, థీమ్‌ను సెలక్ట్ చేసుకుని ఎంతో మంది కొత్త దర్శకులను పరిచయం చేసిన గొప్ప నిర్మాత ఆర్.బి.చౌదరిగారు. దక్షిణాది చిత్రాలన్నింటిలో ఆయన సినిమాలు చేశారు. నేను కూడా సూర్య వంశం, సుస్వాగతం సహా మంచి చిత్రాలను ఈ బ్యానర్‌లో చేశాను. ఈ బ్యానర్‌లో వస్తున్న గజేంద్రుడు పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను`` అన్నారు.
యువన్ శంకర్ రాజా మాట్లాడుతూ - ``నేను, ఆర్య కలిసి చేస్తున్న పదవ సినిమా గజేంద్రుడు. పదకొండవ సినిమా కూడా రానుంది. ఏప్రిల్ 14న రానున్న ఈ సినిమా పెద్ద సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను`` అన్నారు.
క్యాథరిన్ మాట్లాడుతూ - ``గజేంద్రుడు సినిమాలో నటించడం వల్ల చాలా విషయాలు నేర్చుకున్నాను. సినిమా కోసం అందరూ బాగా కష్టపడ్డారు. డైరెక్టర్ రాఘవగారు సినిమాలో ప్రతి సీన్‌ను అమేజింగ్‌గా తెరకెక్కించారు. అడవిలో సినిమాను తీయడం అంత సులభం కాదు. ఆర్.బి.చౌదరిగారికి ధన్యవాదాలు`` అన్నారు.
ఆర్.బి.చౌదరి మాట్లాడుతూ - ``ఆర్య కెరీర్‌లో టర్నింగ్ పాయింట్ మూవీ అవుతుంది. గజేంద్రుడు మా బ్యానర్‌లో వస్తోన్న 89వ సినిమా. క్యాథరిన్ ఎంతో చక్కగా నటించింది. యువన్ శంకర్ రాజా మా బ్యానర్‌లో తొలిసారి వర్క్ చేస్తున్నారు. తమిళంలో ఆడియో మంచి హిట్ అయ్యింది. అలాగే తెలుగులో కూడా ఆడియో పెద్ద హిట్ అవుతుందని భావిస్తున్నాను. యువన్ మంచి సంగీతాన్ని అందించారు. రాఘవ ఎంతో హార్డ్ వర్క్ చేశారు. ఎంటైర్ టీంకు థాంక్స్`` అన్నారు.
ఆర్య మాట్లాడుతూ - ``చౌదరిగారికి నేను పెద్ద ఫ్యాన్‌ని. ఆయనెప్పుడూ కంటెంట్ బేస్‌డ్ సినిమాలనే చేస్తారు. ఆయన సపోర్ట్ లేకుంటే ఈ సినిమా చేసేవాళ్ళం కాదు. క్యాథరిన్ ఎంతో సపోర్ట్ చేసింది. అడవిలో నటించడం అంత సులభం కాదు. ఈ సినిమాలో పార్ట్ అయిన నటీనటులకు, టెక్నిషియన్స్‌కు థాంక్స్. రాఘవకు ఇది రెండో సినిమానే. తను భవిష్యత్‌లో తెలుగు, తమిళంలో పెద్ద దర్శకుడుగా ఎదుగుతాడు. సపోర్ట్ చేసిన అందరికీ థాంక్స్`` అన్నారు.
రానా మాట్లాడుతూ - ``సురేష్ ప్రొడక్షన్స్ ఎలాగో, సూపర్‌గుడ్ ఫిలింస్ కూడా తనకు అలాగేనని మా చిన్నాన్న అంటుంటారు. ఆయన సూపర్‌గుడ్ ఫిలింస్‌లో చేసిన సినిమాలు మంచి సక్సెస్‌లను సాధించాయి. తెలుగు సినిమా ప్రేక్షకులు కొత్త జోనర్ సినిమాలను ఆదరిస్తుంటారు. అలాంటి కొత్త జోనర్‌లో ఏప్రిల్ 14న రానున్న సినిమా గజేంద్రుడు. ట్రైలర్ అవుట్ స్టాండింగ్‌గా ఉంది. ఆర్య, నేను కలిసి బెంగళూర్ నాట్కల్ సినిమాలో నటించాం. తను నటించిన గజేంద్రుడు చిత్రంతో తెలుగులో సూపర్‌స్టార్ రేంజ్ చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను`` అన్నారు.