నకమా ప్లానెట్ గ్రీన్ స్టూడియోస్ బ్యానర్ పై తరుణ్ శెట్టి, అవంతిక, కిరిటీ దామరాజు, జెన్ని, భరణ్ ప్రధాన తారాగణంగా రూపొందుతోన్న చిత్రం ‘మీకు మీరే మాకు మేమే’. ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం మంగళవారం హైదరాబాద్ లో జరిగింది. బిగ్ సీడీని, ఆడియో సీడీలను అల్లు అరవింద్ విడుదల చేశరు. తొలి ఆడియో సీడీని అందుకున్న సుకుమార్ థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా...
లగడపాటి శ్రీధర్ మాట్లాడుతూ ``ఈ సినిమా కోసం చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నా. నాన్నకు ప్రేమతో వంటి సినిమాకు కథను అందించిన వ్యక్తి ఈ సినిమాకు దర్శకుడు. మంచి ఎంటర్‌టైనర్ ఇది. సినిమా పెద్ద సక్సెస్ కావాలి. ఈ టీమ్‌తో నేను అసోసియేట్ కావాలనుకుంటున్నాను`` అని చెప్పారు.
పి.రామ్మోహన్ మాట్లాడుతూ ``యూట్యూబ్‌లో షార్ట్ ఫిలిమ్స్ చూస్తుంటాను. గాంధీ, సుజిత్, హుస్సైన్ షా వంటి వారి షార్ట్ ఫిలిమ్స్ ని చూస్తుంటా. ఈ సినిమా హుస్సైన్‌కి మంచి హిట్ కావాలి`` అని అన్నారు.
సుకుమార్ మాట్లాడుతూ ``ఆర్య2 సమయంలో ఈ దర్శకుడు నన్ను కలిశాడు. అందులో ఓ చిన్న పాత్ర చేశాడు. అలా పలు సినిమాల్లో చిన్న పాత్రలను చేశాడు. అలా ఆయా దర్శకుల దగ్గర సినిమాలు తీయడం ఎలాగో నేర్చుకున్నాడు. తొలిసారి అతను చేసిన షార్ట్ ఫిలిమ్ చూసి నేను జెలస్ ఫీలయ్యాను. నిజంగా చెప్పాలంటే నా ఫేస్ మాడిపోయింది. నాన్నకు ప్రేమతో సినిమాను ఏ హాలీవుడ్ సినిమా నుంచి కాపీ కొట్టావని చాలా మంది నన్ను అడిగారు. నిజం చెప్పాలంటే నేను హుస్సైన్ నుంచే కథ కాపీ కొట్టాను. మూల కథ అతనిదే. భవిష్యత్తులో మంచి దర్శకుడిగా ఎదుగుతాడు. నా బ్యానర్‌లో అతను ఓ సినిమా చేయాలని అనుకుంటున్నాను. కుమారి 21ఎఫ్ సినిమాలో లవ్ చేయాలా? వద్దా అనే పాటను రాసిన రాము ఈ సినిమాకు మంచి లిరిక్స్ ను అందించాడు`` అని తెలిపారు.
అల్లు అరవింద్ మాట్లాడుతూ ``సోషల్ మీడియా వల్ల ఓ సినిమా ఆడుతుందని ఈ సినిమా ప్రూవ్ చేయాలి. ఈ సినిమాను పెద్ద హిట్ చేయాలని కోరుకుంటున్నాను. ఓ రోజు ఇద్దరు కుర్రాళ్ళు వచ్చి నన్ను కలిశారు. ల్యాబ్‌లో వాళ్ళు చేసిన షార్ట్ ఫిలిమ్స్ చూసి థ్రిల్ ఫీలయ్యాను. సినిమా చూడమని వాళ్ళు నన్ను వెంటాడారు. చూశాక నేను వాళ్ళ వెనుక పడ్డాను. కొంతమంది కుర్రాళ్ళు కలిసి సినిమాల్లో ఏదో చేయాలని ట్రై చేస్తున్నారు. వారిలో ఉత్సాహంనాకు నచ్చింది. అదే వారి పెట్టుబడి. వాళ్ళు నన్ను కలిసినప్పుడు నాకు తెలిసినవారితో కొంత పెట్టుబడి పెట్టించాను. అలాగే నేను కూడా పెట్టాను. చాలా మంచి సినిమా చేశారు. హుస్సైన్ మూడో సినిమా మా గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో చేయాలని కోరుకుంటున్నాను. సుకుమార్‌కి ఇతను మంచి శిష్యుడు. సుకుమార్ కూడా అతనికి బాగా సపోర్ట్ చేశాడు. ఈ కుర్రాళ్ళ గ్యాంగ్‌లో మంచి ఫైర్ ఉంది. ఆ ఫైర్‌ను ఎంకరేజ్ చేయాలని వారి తల్లిదండ్రులను కోరుకుంటున్నాను. లవ్‌కి అర్థం #ఎంటుఎం అని ఈ సినిమాతో ప్రూవ్ చేయాలని కోరుకుంటున్నాను`` అని చెప్పారు.
చిత్ర దర్శకుడు హుస్సైన్ షా కిరణ్ మాట్లాడుతూ ‘’ఈసినిమా చేయడానికి నా ఫ్యామిలీ బాగా సపోర్ట్ చేసింది. ఫ్యామిలీతో సంబంధం లేని అల్లు అరవింద్‌గారు అందించిన సపోర్ట్ ని మర్చిపోలేను. నా షార్ట్ ఫిలిమ్స్ చూసిన ఆయన నన్ను ఫీచర్ ఫిల్మ్ ను చేయడానికి ప్రోత్సహించారు. నా తప్పులను చూపించి నేర్చుకోమని చెప్పారు. నాన్నకు ప్రేమతో సినిమా కథ కోసం సుకుమార్ టీమ్ ఒకటిన్నర ఏడాది కష్టపడితే అందులో నేను 10 రోజులు మాత్రమే కష్టపడి ఉంటాను. నా శ్రమను గుర్తించిన ఆయన మూలకథకు నా పేరు వేసి ఎంకరేజ్ చేశారు. మీకు మీరే మాకు మేమే సినిమా అనేది స్టోరీ ఆఫ్ ఆఫ్టర్ లవ్‌కు సంబంధించిన కథతో ఈ సినిమాను తెరకెక్కించాం. అబ్బాయిలు అమ్మాయిల దగ్గర పాంపరింగ్‌ను ఇష్టపడతారు. ఈ సినిమాలో నటించిన హీరో తరుణ్ నటించలేదు. జస్ట్ బిహేవ్ చేసింది. అవంతిక మెచ్యూరిటీ ఉన్న పాత్ర చేసింది. ఇలాంటి మంచి టీమ్ కారణంగానే ఇవాళ నేను ఇక్కడున్నాను. శ్రవణ్‌ని టార్చర్ పెట్టి ఈ సంగీతం చేయించాను. ఎక్సలెంట్ మ్యూజిక్ ఇచ్చాడు. మంచి రొమాంటిక్ ఎంటర్‌టైనర్. హౌ టు కీప్ ద రొమాన్స్ అలైవ్ అని చెప్పే సినిమా ఇది. ప్రేమలో పడ్డ తర్వాత జరిగే ప్రతి పరిణామాన్ని స్వీట్‌గా చూపించాం. తప్పకుండా అందరికీ నచ్చుతుంది`` అని తెలిపారు.
హీరో తరుణ్ శెట్టి మాట్లాడుతూ ‘’హీరోగా చేయడం ఆనందంగా ఉంది. అవంతిక బాగా సపోర్ట్ చేసింది. దర్శకుడు అందించిన ప్రోత్సాహం, మంచిటీం ఎఫర్ట్ తో మంచి అవుట్ పుట్ రాబట్టగలిగాం. ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాం’’ అన్నారు.
ఈ కార్యక్రమంలో అవంతిక, శ్రవణ్, జెన్ని, కిరీటి దామరాజు, ఎడిటర్ మార్తాండ్ కె వెంకటేష్, సినిమాటోగ్రాఫర్ సూర్య వినయ్, అన్నపూర్ణ సీఈఓ సీవీరావు, సిద్ధార్థ్ , గిరీష్ తదితరులు పాల్గొన్నారు.
తరుణ్ షెట్టి(నూతన పరిచయం), అవంతిక మిష్రా, కిరిటి దామరాజు, జెన్ని(నూతన పరిచయం), భరణ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి ఆర్ట్ అభిషేక్ రాఘవ్, మనీషా, రామ్ గోపాల్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కార్తీక్ వంశీ తాడేపల్లి, సినిమాటోగ్రఫీ: సూర్య వినయ్, మ్యూజిక్: శ్రవణ్, ఎడిటర్: మార్తాండ్ కె.వెంకటేష్, ప్రొడక్షన్: ఎన్.పి.జి స్టూడియో, కథ, స్కీన్ ప్లే, దర్శకత్వం: హుస్సైన్ షా కిరణ్.