20 April 2014
Hyderabad
తీయని కలవో' ఆడియో లాంఛ్ విశేషాలు
అఖిల్ కార్తీక్, శ్రీ తేజ, హుదుషా నటీనటులుగా శివకేశవ ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై బలమూరి రామమోహన్ రావు నిర్మించిన చిత్రం 'తీయని కలవో'. శివాజీ.యు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి రవీంద్ర ప్రసాద్ పాటలు స్వరపరిచారు. ఈ చిత్రం ఆడియో వేడుక నేడు (20.4) హైదరాబాద్ లోని రాక్ హైట్స్ లో జరిగింది.
ఈ వేడుకలో అతిథులుగా పాల్గొన్న సుధీర్ బాబు, నవీన్ చంద్ర ఆడియో సీడీలను ఆవిష్కరించి, మరో ముఖ్య అతిధి శ్రీవాస్ కు ఇచ్చారు.
థియేట్రికల్ ట్రైలర్ ని నిర్మాత రామమోహన్ రావు బాల్య స్నేహితులు ఆవిష్కరించారు.
అనంతరం శ్రీవాస్ మాట్లాడుతూ - ''నా రెండో చిత్రం 'రామ రామ కృష్ణ కృష్ణ'లో ఓ కీలక పాత్ర చేశాడు. ఎంత క్లిష్టమైన సన్నివేశాన్నయినా సింగిల్ టేక్ లో చేసేవాడు. ఈ సినిమాతో తనకు మంచి బ్రేక్ రావాలని కోరుకుంటున్నాను. ట్రైలర్స్ చూస్తుంటే సినిమా చాలా ఫ్రెష్ గా ఉంటుందనిపిస్తోంది. ఈ చిత్రదర్శకుడు అంతకుముందు కొరియోగ్రాఫర్ గా చేశాడు కాబట్టి, పాటలను స్టయిలిష్ గా తీసి ఉంటాడనుకుంటున్నాను. ఈ సినిమా విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను'' అన్నారు.
'మల్లెల తీరంలో సిరిమల్లె పువ్వు' ఫేం రవీంద్ర ప్రసాద్ మాట్లాడుతూ - ''టీమ్ వర్క్ తో ఈ సినిమా చేశాం. పాటలు బాగా వచ్చాయంటే నిర్మాతే కారణం. ఆయనకు మంచి అభిరుచి ఉంది. ఈ పాటలు, సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నాను'' అని చెప్పారు.
శివాజీ మాట్లాడుతూ - ''మంచి పాటలిచ్చినందుకు రవీంద్రకు ధన్యవాదాలు.అఖిల్ కార్తీక్ ని కొత్త కోణంలో చూపించాను. శ్రీ తేజను లవర్ బోయ్ లా చూపించాను. నాకు జన్మనిచ్చినది మా అమ్మానాన్నలైతే, ఈ సినిమాకి అవకాశం ఇవ్వడం ద్వారా నిర్మాత నాకు పునర్జన్మనిచ్చారు. అందరి మనసులను హత్తుకునే తియ్యని కల లాంటి ప్రేమకథా చిత్రం ఇది'' అన్నారు.
చిత్రకథకుడు, నిర్మాత రామ మోహన్ రావు మాట్లాడుతూ - ''ఈ చిత్రాన్ని దర్శకుడు ఎంతో అద్భుతంగా తెరకెక్కించాడు. మేలో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం. ఆదిత్య మ్యూజిక్ వారు ఈ ఆడియోను మార్కెట్లోకి విడుదల చేయడం ఆనందంగా ఉంది. తెలుగు ప్రేక్షకులు మెచ్చే మంచి చిత్రం అవుతుందనే నమ్మకం ఉంది. వంద శాతం విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది'' అని తెలిపారు.
అఖిల్ కార్తీక్ మాట్లాడుతూ - ''నేను నటించిన ఓ సినిమాకి ఈ చిత్రదర్శకుడు కొరియోగ్రఫీ చేశారు. ఆ తర్వాత ఒక రోజు ఈ కథ చెప్పారు. నాకు బాగా నచ్చింది. సినిమాని చాలా క్వాలిటీగా తెరకెక్కించాడు. నిర్మాత ఎక్కడా రాజీపడకుండా నిర్మించారు. సినిమా రషెస్ చూశాం. చాలా బాగా వచ్చింది'' అన్నారు.
ఈ వేడుకలో దామోదర్ ప్రసాద్, సురేష్ కొండేటి, శివాజీ రాజా, ఖయ్యూమ్, సాయికార్తీక్, ధన్ రాజ్, తాగుబోతు రమేష్ తదితరులు పాల్గొన్నారు.