23 July 2015
Hyderabad
'ఇండియన్ పోస్ట్ మెన్' పాటలను ఆవిష్కరించిన హోమ్ మినిస్టర్
ఓ 'ఇండియన్ పోస్ట్ మెన్' హాలీవుడ్ కు కూడా వెళుతున్నాడు. రమేష్ రెడ్డి తుమ్మల దర్శకనిర్మాణంలో తెరకెక్కిన చిత్రం 'ది ఇండియన్ పోస్ట్ మెన్'. ఇంగ్లీష్ తో పాటు తెలుగు వెర్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా పాటల సందడి హైదరాబాద్ ఫిలించాంబర్ లో జరిగింది. తెలంగాణ హోమ్ మినిస్టర్ నాయిని నర్సింహరెడ్డి సినిమా పాటలను ఆవిష్కరించి చిత్రయూనిట్ కు విషెస్ అందించారు.
సినిమా వంద రోజులు ఆడాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని మంత్రి నాయిని నర్సింహ రెడ్డి చెప్పారు. ఈ సందర్భంగా తెలంగాణ పోరాట చరిత్రను, తమ పోరాట పటిమను ఆయన వివరించారు. తెలంగాణ నేపథ్యంతో తీసిన ఈ సినిమాను అందరు ఆదరించాలని కోరారు.
అజయ్ కుమార్ - వేద హీరోహీరోయిన్లుగా అంతా కొత్త వాళ్లతో తెరకెక్కిన ఈ సినిమా 1969 - 72 మధ్య కాలంలో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కింది. ఓ పోస్ట్ మెన్ చుట్టు జరిగే కథతో సాగే ఈ సినిమాలో లవ్ స్టోరీ నేపథ్యం ఉంటుంది. ఈ సినిమాకు ఎల్లంప్రేమ్, సాయిచంద్ మ్యూజిక్ అందించారు. ఈ సందర్భంగా సినిమాలోని తెలంగాణ నేపథ్యంలో సాగే పాటలను పాడి వినిపించారు.
ఈ సందర్భంగా దర్శకనిర్మాత రమేష్ రెడ్డి తుమ్మల చిత్ర విశేషాలు తెలిపారు. ఈ సినిమాను తెలంగాణ పోరాట నేపథ్యాన్ని, 1969 - 72 మధ్య కాలంలో జరిగిన కథను తెరకెక్కించానని తెలిపారు. ఈ సినిమాలోని తెలంగాణ, బతుకమ్మ పాటలు సూపర్ హిట్ అవుతాయని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్న ఈ సినిమాను అన్నీ క్వాలిటీస్ తో కేవలం 50 లక్షల రూపాయల బడ్జెట్ తోనే పూర్తి చేశామని తెలిపారు. ఇప్పటికే హాలీవుడ్ లో సినిమాకు కోటి రూపాయలకుపైగా బిజినెస్ అవుతోందని తెలిపారు.
నిజమైన తెలంగాణ సినీ కళాకారులకు జరుగుతున్న అన్యాయంపై డైరెక్టర్ రమేష్ రెడ్డి, ఇంకెన్నాళ్లు సినిమా దర్శకనిర్మాత రఫీ ఆవేదన వ్యక్తం చేశారు. గుర్తింపుకు నోచుకోకుండా ఉన్న అచ్చమైన తెలంగాణ కళాకారులను గుర్తించాలని హోమ్ మినిస్టర్ ను ఈ సందర్భంగా కోరారు.
ఈ ఆడియో వేడక కార్యక్రమంలో చిత్రయూనిట్ తో పాటు ఇంకెన్నాళ్లు సినిమా దర్శకనిర్మాత రఫీ, దర్శకనిర్మాత పులి అమృత్ గౌడ్, టీయూడబ్ల్యూ ఉపాధ్యక్షుడు పిట్టల శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.