12 February 2016
Hyderabad
యమపాశం ఆడియో లాంఛ్
జయం రవి, లక్ష్మిమీనన్ కలిసి నటించిన తమిళ సూపర్ నేచురల్ హర్రర్ చిత్రం “మిరుథన్”. తెలుగులో ఈ సినిమాను `యమపాశం ` అనే పేరుతో విడుదల చేస్తున్నారు. లక్ష్మీ ప్రసన్న ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తున్నారు. శక్తి సౌందర్‌రాజన్ దర్శకుడు. ఈ సినిమాలోని పాటలను, ట్రైలర్‌ను నాని విడుదల చేశారు. ఈ కార్యక్రమం హైదరాబాద్‌లో శుక్రవారం రాత్రి విడుదలైంది. ఈ కార్యక్రమంలో జ్ఞానవేల్ రాజా, సురేష్ కొండేటి, గోగినేని బాలకృష్ణ, శోభారాణి తదితరులు పాల్గొన్నారు.
నాని మాట్లాడుతూ ``డాక్టర్ చేతికి గ్లవ్ చూస్తే నాకు ఇప్పటికీ నవ్వొస్తుంది. ఆ సీన్ ఉన్న హనుమాన్ జంక్షన్ సినిమాను జయం రాజా చేశారు. ఇటీవల జయం రవి నటించిన తని ఒరువన్ ఎంత పెద్ద హిట్ అయిందో తెలుస్తోంది. ఈ సినిమా నా సినిమా విడుదలైన ఒన్ వీక్‌కే తెలుగులో విడుదలవుతోంది. ఆ సినిమా నాసినిమాకన్నా పెద్ద హిట్ కావాలి. తమిళ హీరోలు చాలా మందికి తెలుగులో మార్కెట్ స్టార్ట్ అయింది. అయితే నిజంగా అర్హుడు రవి. మన తెలుగోడు. ఎడిటర్ మోహన్‌గారి అబ్బాయి. ఇకపై జయం రవి సౌత్ ఇండియన్ హీరోగా కావాలి`` అని చెప్పారు.
జయం రాజా మాట్లాడుతూ ``మేం తెలుగు వాళ్ళం. మా నాన్న సమర్పించిన సినిమాలకు ఇక్కడ ఎంత ఆదరణ లభించిందో మాకు బాగా తెలుసు.తెలుగువాళ్ళు పెట్టిన అన్నం తిని బతికాం మేం. తెలుగు నేలను మర్చిపోలేం. నేను ఓనమాలు నేర్చుకున్నది తెలుగులోనే. నా పనితనమంతా ఇక్కడే నేర్చుకున్నాను. నా హనుమాన్ జంక్షన్‌ని ఇప్పటికీ అందరూ గుర్తుంచుకోవడం ఆనందంగా ఉంది. తని ఒరువన్ ఇక్కడ చాలా మంచి చేతుల్లో పడింది. జయం రవి మంచి హీరో. సరైన సినిమాతో తను తెలుగులోకి ఎంట్రీ అవుతున్నాడు. తను తెలుగులోనూ బాగా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను`` అని తెలిపారు.
జయం రవి మాట్లాడుతూ ``మమ్మల్ని ఇక్కడ తమిళ వాళ్ళం అనుకుంటారు. అక్కడ తెలుగు వాళ్ళం అని అనుకుంటారు. నేను రెండు భాషలకూ బిడ్డను. నాకు మా అన్నయ్య, మా నాన్న చాలా పెద్ద సపోర్ట్. ఈ సినిమా కొత్తగా ఉంటుంది. ఎప్పటి నుంచో తెలుగులోకి రావాలని అనుకుంటున్నాను. ఇప్పటికి కుదిరింది. నా తొలి బై లింగ్వుల్ సినిమా ఇది. సైమల్‌టైనియస్‌గా రిలీజ్ కానుంది. ఈ నెల 19న రెండు భాషల్లోనూ విడుదలవుతుంది. కొత్త జోనర్ సినిమా. తప్పకుండా అందరికీ నచ్చుతుంది. ఇమాన్ మంచి సంగీతాన్నిచ్చారు. వెన్నెలకంటి, భాగ్యలక్ష్మి మంచి పాటలను రాశారు`` అని చెప్పారు.
ఎడిటర్ మోహన్ మాట్లాడుతూ ``తెలుగులోకి మళ్ళీ రావాలని ఉంది. నా కొడుకులు ఇద్దరూ సమర్థులే. ఒకడు నాకు సింహాసనం వేస్తే, ఇంకొకడు కిరీటం పెట్టాడు. వాళ్ళ తండ్రిగా నేను హ్యాపీగా ఉన్నాను`` అని అన్నారు.