27 October 2015
Hyderabad
లేపాక్షి డాక్యుమెంటరీ, ఛేంజ్ లఘు చిత్రంతో రెండు గిన్నీస్ వరల్డ్ రికార్డులు సృష్టించిన హిందూపూర్ వాసి రాజేంద్రవినోద్ ను అభినందించిన నందమూరి బాలకృష్ణ
ప్రముఖ పర్యాటక కేంద్రం అయిన లేపాక్షిపై తీసిన డాక్యుమెంటరీ, లఘు చిత్రం `ఛేంజ్` ప్రపంచ రికార్డులు సృష్టించాయి. ఈ చిత్రాల దర్శకుడు అనంతపురం జిల్లా హిందూపురానికి చెందిన డాక్టర్ రాజేంద్రవినోద్ ఇవాళ హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా లేపాక్షిపై తీసిన డాక్యుమెంటరీ, లఘు చిత్రాన్ని చూసిన నందమూరి బాలకృష్ణ, రాజేంద్ర వినోద్ ప్రతిభను అభినందించారు. చదువులో రాణించడంతో పాటు లఘు చిత్రాలు తీసి రెండు గిన్నీస్ వరల్డ్ రికార్డులతో పాటు అనేక అంతర్జాతీయ అవార్డులు, రివార్డులు సాధించడం రాష్ట్రానికే గర్వకారణమన్నారు. రాజేంద్రవినోద్ సాధించిన ఘనత పట్ల వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో అభినందన తీర్మానం ప్రవేశపెడతామని ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ చెప్పారు. వినోద్ ఉన్నత శిఖరాలు చేరుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వ తరఫున అన్ని విధాల సహాయసహకారాలు అందిస్తామని చెప్పారు.
వినోద్ తండ్రి హిందూపురంలో రైల్వే ఉద్యోగి. 24 ఏళ్ళ వయసు కలిగిన వినోద్ పూర్తి చేసింది 5 డిగ్రీలు. తీసింది ఏడు లఘు చిత్రాలు, ఒక యాడ్ చిత్రం, ఒక డాక్యుమెంటరీ. హిందూపురంలోని బీటెక్ కళాశాలలో వినోద్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. ఇంజనీరింగ్‌లో ఉన్న సమయంలోనే అన్నామలై విశ్వవిద్యాలయం ద్వారా జర్నలిజంలో ఏంఎ, అన్నామలై దూర విద్య ద్వారా సైకాలజీలో ఎం.ఎస్సీ పూర్తి చేశారు. ఆ తర్వాత బెంగుళూరులోని విజ్ టూన్జ్ కళాశాలలో ఎంఎస్సీ మల్టీమీడియా పూర్తి చేశారు. వినోద్ తన లఘు చిత్రాలకు అనేక అవార్డులు అందుకున్నారు. ఎంతో చారిత్రాత్మక గుర్తింపు ఉన్న లేపాక్షిపై తీసిన డాక్యుమెంటరీ, లఘు చిత్రాలు ఛేంజ్, అరణి, యాడ్ చిత్రం `ఆర్వి ఫిలిమ్స్` అనేక జాతీయ అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శింపబడి అనేక అవార్డులు అందుకున్నాయి. వినోద్ ఇప్పటి వరకు తన లఘు చిత్రాలకు ఐదు భాషల్లో అవార్డులు అందుకుని జాతీయ రికార్డ్ నెలకొల్పి ఇండయా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించారు. ఒకటిన్నర సంవత్సరం కష్టపడి తన లేపాక్షి డాక్యుమెంటరీ, లఘు చిత్రం ఛేంజ్ `` భాషల్లో అనువదించారు. ఇటీవలే తన లఘు చిత్రం ఛేంజ్, లేపాక్షి ప్రపంచంలోని అత్యధిక భాషల్లో అనువదింపబడిన లఘు చిత్రం, డాక్యుమెంటరీగా రెండు గిన్నీస్ రికార్డులు సృష్టించాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన తన స్నేహితులతో ఇంగ్లిష్, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ, బెంగాలి, గుజరాతి, మరాఠి, అస్సామీ, ఫ్రెంచ్ భాషల్లో వినోద్ ఈ రెండు చిత్రాలను అనువదించారు. గత యేడాది ఫిబ్రవరిలో అనువాదాలు మొదలు పెట్టి ఫిబ్రవరి 28, 2014 ఇంగ్లిష్ వర్షన్ పూర్తి కాగా మిగతా భాషల్లో అనువాదాలు, ఎడిటింగ్ అన్ని పూర్తి చేసి గిన్నీస్ వారికి జులై, 2015 పంపగా వారు అన్ని పరిశీలించి రెండు రికార్డులను ధృవీకరించారు. వినోద్ తన లఘు చిత్రాలన్ని `అర్వి ఫిలిమ్స్` పేరుతో నిర్మించగా `అర్వి ఫిలిమ్స్ `కు 3వ ఢిల్లీ అంతర్జాతీయ చిత్రోత్సవంలో `ఉత్తమ లఘు చిత్ర సంస్థ`గా అవార్డు దక్కింది. వరల్డ్ రికార్డ్స్ విశ్వ విద్యాలయం వారు వినోద్కు ఇటీవలే గౌరవ డాక్టరేట్ బహుకరించారు.