15 August 2015
Hyderabad
రెండో షెడ్యూల్ కి సిద్ధమవుతున్న 'సిద్ధార్ధ'
బుల్లితెరపై బోల్డంత పాపులార్టీ తెచ్చుకున్న సాగర్ (ఆర్.కె. నాయుడు) ప్రస్తుతం వెండితెరపై కూడా తన ప్రతిభ నిరూపించుకోవడానికి కృషి చేస్తున్నారు. ఆయన హీరోగా రామ దూత క్రియేషన్స్ పతాకంపై "సిద్ధార్ధ' చిత్రాన్ని నిర్మిస్తున్నారు దాసరి కిరణ్ కుమార్. జీనియస్, రామ్ లీల చిత్రాల ద్వారా నిర్మాతగా మంచి గుర్తింపు తెచ్చుకున్న కిరణ్ కుమార్ తాజా చిత్రాన్ని రాజీపడకుండా నిర్మిస్తున్నారు. లంకాల బుచ్చిరెడ్డి సమర్పణలో రూపొందుతున్న ఈ చిత్రానికి దయానంద రెడ్డి దర్శకుడు.
ఈ చిత్రవిశేషాలను దాసరి కిరణ్ కుమార్ తెలియజేస్తూ - ''22 రోజులు మలేసియాలోని అందమైన ప్రాంతాల్లో షూటింగ్ చేశాం. అవుట్ పుట్ చాలా బ్రహ్మాండంగా వచ్చింది. మోకాలికి గాయం అయినప్పటికీ ఎస్. గోపాలరెడ్డిగారు రిస్కీ షాట్స్ తీశారు. మా సంస్థకు ఆయన వెన్నెముక. ఏడాది పాటు కథ గురించి చర్చలు జరిపాం. నేనే సినిమా చేసినా పరుచూరి బ్రదర్స్ ఉండాల్సిందే. పదిహేనేళ్లు పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ లో చేసిన దయానంద రెడ్డి ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. త్వరలో రెండో షెడ్యూల్ ఆరంభించనున్నాం '' అని చెప్పారు.
సాగర్ మాట్లాడుతూ - ''హీరోగా నాకిది తొలి పుట్టినరోజు. బుల్లితెరపై నాకెంత పేరు వచ్చిందో వెండితెరపై కూడా అంతే పేరు రావాలని నా పుట్టినరోజు సందర్భంగా ఆత్మీయులు కోరుకుంటున్నారు. అది నెరవేరాలని ఆకాంక్షిస్తున్నాను. ఈ చిత్రంలో నాది మంచి పాత్ర'' అన్నారు.
పరుచూరి బ్రదర్స్ మాట్లాడుతూ - ''సాగర్ కి మాకంటే ఎక్కువ పాపులార్టీ ఉంది. బుల్లితెర ద్వారా ఎంతోమందిని ఆకట్టుకున్నాడు. ఈ చిత్రకథ చాలా బాగా వచ్చింది. ఇది లవ్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్. కిరణ్, దయానంద్ రెడ్డి ఎంతో కరెక్ట్ గా ప్లాన్ చేసుకుని ఈ చిత్రం చేస్తున్నారు'' అని చెప్పారు.
అనంతరం సాగర్ బర్త్ డే కేక్ కట్ చేశారు.
ఈ వేడుకలో లంకాల బుచ్చిరెడ్డి, ముత్యాల రమేశ్, దయానంద రెడ్డి, మల్టీ డైమన్షన్ వాసు, విస్సు, స్వామినాయుడు, రమేశ్ వర్మ, డి.యస్.రావు తదితరులు పాల్గన్నారు.