దర్శకనిర్మాత వి.బి రాజేంద్రప్రసాద్ మహోన్నతమైన వ్యక్తిత్వం గల మనిషి. ఆయన నిర్మించిన చిత్రాలన్నీ గుర్తుంచుకోదగ్గవే. దసరాబుల్లోడుతో దర్శకుడిగా మారిన ఆయనతో నేను ఎఫ్‌డీసీ చైర్మన్‌గా పనిచేసిన దగ్గరి నుంచి మంచి సాన్నిహిత్యం వుంది. మంచి మనసున్న ఆయన జీవిత కథ ఆధారంగా రాసిన దసరాబుల్లోడు పుస్తకాన్ని విశాఖ పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ఆవిష్కరించడం అదృష్టంగా భావిస్తున్నాను అన్నారు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కె.వి.రమణాచారి. వెటరన్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సీనియర్ జర్నలిస్ట్ భగీరథ రాసిన దసరాబుల్లోడు పుస్తకాన్ని గురువారం రాత్రి హైదరాబాద్‌లో విశాఖ పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వి.బి.రాజేంద్రప్రసాద్ దర్శకుడిగా, నిర్మాతగా విశిష్ట సేవలు అందించిన ఆయన చివరి దశలో ఫిలిం నగర్ దైవసన్నిధానం కోసం ఎంతో కృషి చేశారు. ఆయన వల్లే ఈ రోజు ఫిలింనగర్‌లోని దైవసన్నిదానంలో 18 దేవాలయాలు ఏర్పడ్డాయి అన్నారు. వీరశంకర్ మాట్లాడుతూ ఫిలింనగర్ దైవసన్నిదానం కోసం కోసం రాజేంద్రప్రసాద్ ఎంతో కృషి చేశారు. నిక్కచ్చి తత్వానికి, నిజాయితీకి మారు పేరాయన. ఎంతో మంది దర్శకనిర్మాతలకు మార్గదర్శకులుగా నిలిచారు. దర్శకనిర్మాతలందరికి దసరాబుల్లోడు ఆదర్శనీయమైన గ్రంధంగా నిలవాలి అన్నారు. భగీరథ మాట్లాడుతూ వి.బి.రాజేంద్రప్రసాద్‌తో మూడున్నర దశాబ్దాల అనుబంధం నాది. ఆయన గురించి కుటుంబ సభ్యుల కంటే నాకే ఎక్కువ తెలుసు. తెరముందు దసరాబుల్లోడు అక్కినేని నాగేశ్వరరావు అయితే తెరవెనుక దసరాబుల్లోడు వి.బి. రాజేంద్రప్రసాద్. 2004లో తొలిసారి విడుదల చేసిన దసరాబుల్లోడు పుస్తకానికి కొనసాగింపుగా తాజా పుస్తకాన్ని అందించాను అన్నారు. ఈ కార్యక్రమంలో రమేష్ ప్రసాద్, జూబ్లీహిల్స్ కార్పొరేటర్ కాజా సూర్యనారాయణ పలువురు వెటరన్ జర్నలిస్ట్‌లు పాల్గొన్నారు.