పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఛార్మి టైటిల్ రోల్ పోషించిన జ్యోతిలక్ష్మి చిత్రాన్ని విమర్శనాత్మకంగా పుస్తకరూపంలో రాశారు మంగళగౌరి. ఆ పుస్తకం విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో బుధవారం జరిగింది. ఈ కార్యక్రమానికి తనికెళ్లభరణి ముఖ్య అతిథిగా హాజరై పుస్తకాన్ని ఆవిష్కరించారు.
తనికెళ్ల భరణి మాట్లాడుతూ ``పీహెచ్.డి అవార్డు చేయదగిన స్థాయిలో ఈ పుస్తకాన్ని రాశారు మంగళగౌరీ ఇట్లు. శ్రావణీ సుబ్రమణ్యం చిత్రంలో డైలాగులు చూసి నచ్చి, నేను సినిమా చేస్తే డైలాగులు రాయాలని అప్పుడే పూరి దగ్గర మాట తీసుకున్నాను. ఆ చిత్రానికి సంభాషణలకుగానూ ఆయనకు నంది అవార్డు వచ్చింది. అనుకోకుండా ఒక రోజు, జ్యోతిలక్ష్మి చిత్రాలు ఛార్మి కెరీర్‌లో నిలిచిపోతాయి. జ్యోతిలక్ష్మి పార్ట్ 2 రావచ్చేమో. ఈ సినిమాకు కావ్యగౌరవం కల్పించిన మంగళగౌరీ అభినందనీయురాలు`` అని అన్నారు.
ఛార్మి మాట్లాడుతూ ``పుస్తకంతో మొదలైన ఈ సినిమా పుస్తకంతోనే ఎండ్ అవుతోంది. పూరిగారు స్ఫూర్తితో తీశారు. నాకు తెలుగు చదవడం రాదు. ఎక్కడికివెళ్లినా నన్ను జ్యోతిలక్ష్మి అనే పిలుస్తున్నారు`` అని తెలిపారు.
మంగళగౌరి మాట్లాడుతూ ``మల్లాదివారితో మాట్లాడే పూరి ఈ చిత్రాన్ని చేశారు. ఆధునిక కన్యాశుల్కం అని నేను జ్యోతిలక్ష్మి గురించి చెబుతాను. ఈ సినిమాను చూసి ప్రతి పురుషుడు చాలా నేర్చుకోవాలి. తమ భార్యలో ఉన్న గొప్పతనాన్ని అర్థం చేసుకోవాలి. ప్రోత్సహించాలి. ఈ చిత్రంలోని క్లైమాక్స్ నన్ను కదిలించింది. భవిష్యత్తులోనూ పూరి జగన్నాథ్ చిత్రాల గురించి, ఛార్మి గురించి పుస్తకాలు రాయడానికి సమాయత్తమవుతున్నాను`` అని చెప్పారు. ఈ కార్యక్రమంలో టార్జాన్, గాయత్రి, అపూర్వ, సునీల్ కశ్యప్, శాండీ, పి.జి.విందా, సత్యదేవ, ఆకాష్ పూరి తదితరులు పాల్గొన్నారు.