ఇంతకు ముందు జ్యోతిలక్ష్మి సినిమాను పుస్తకంగా రాసిన సర్వమంగళగౌరి రాసిన రెండో పుస్తకం `తనికెళ్ల భరణి మిథునం ఒక పరిశీలన`. ఈ పుస్తకావిష్కరణ హైదరాబాద్‌లో గురువారం సాయంత్రం జరిగింది. తనికెళ్ల భరణి పుట్టినరోజు వేడుకలు కూడా ఇదే వేదికపై జరిగాయి.
తనికెళ్ల భరణి మాట్లాడుతూ ``నేను పరిశ్రమలో అడుగుపెట్టి 33 ఏళ్లు అయ్యాయి. రచయితగా, నటుడిగా, ఇప్పుడు దర్శకుడిగా కూడా కొనసాగుతున్నాను. నేను ఇష్టంగా తీసిన చిత్రం మిథునం. ఎలాంటి ఫలాపేక్ష లేకుండా ఆనందరావుగారు తెరకెక్కించారు. మిథునంతో నాకు వెయ్యి అనుభవాలున్నాయి. శ్రీరమణ మిథునం కథ- తనికెళ్ల భరణి మిథునం సినిమా అనే పేరుతో ఒకరు పరిశోధన కూడా చేశారు. ఇది సినిమాకు దక్కిన గౌరవం. శ్రీరమణగారు ఆ కథను అంత గొప్పగా తీర్చిదిద్దారు. సర్వమంగళగౌరిగారు చాలా బాగా రాశారు`` అని అన్నారు.
పరుచూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ``రచయితకి టైటిల్స్ కార్డుల్లో లాస్ట్ పేరు పడటం చాలా బాధ కలిగిస్తోంది. భరణీ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన దర్శకత్వ ప్రతిభ ఏంటో తెలిసింది. ఆయన ఇలాంటి మంచి సినిమాలను ఇంకా మరిన్ని తీయాలి`` అని తెలిపారు.
మిథునం ఆనందరావు మాట్లాడుతూ `` ఈ సినిమా ను ఒక పెళ్లిలాగా అనుకుని తీశాను. మా అమ్మాయికి పెళ్లి చేసి పంపాను. తను సంతోషంగా ఉంది. అక్కడ ఫలాపేక్షా లేదు. అలాగే ఈ సినిమా చేశాను. జనాలకు చేరువైంది. ఇక్కడా ఫలాపేక్ష లేదు. ఈ సినిమా నిర్మాతగా దాదాపు ఐదారు దేశాల్లోని వారు నన్ను సన్మానించడం మర్చిపోలేను. ఈ సినిమా మీద సర్వమంగళగౌరి మంచి పుస్తకాన్ని రాశారు. మిథునం తర్వాత మరలా సినిమా తీస్తే అంత గొప్ప సినిమానే తీయాలి. అంతకన్నా గొప్ప సినిమా తీయాలనే ఉద్దేశంతో నేను మరే చిత్రమూ తీయకుండా ఉన్నాను`` అని చెప్పారు.
సర్వమంగళగౌరి మాట్లాడుతూ ``మిథునం సినిమా చూసిన తర్వాత అందులోని సన్నివేశాలు నన్ను వెంటాడాయి. నా దృష్టిలో మిథునం పరబ్రహ్మస్వరూపం. మామూలుగా చూసేవారికి వృద్ధ దంపతుల జీవితం అన్నట్టుగానే ఉంటుంది. కానీ అందులోని భార్యాభర్తల తీరు ఇవాళ్టి ప్రతి ఒక్కరూ చూసి నేర్చుకోవాల్సిందే. తెరపై అద్భుతంగా సృష్టించారు భరణిగారు. ముఖ్యంగా పెళ్లి కానివారు ఈ సినిమాను తప్పకుండా చూడాలి`` అని అన్నారు.
ఈ కార్యక్రమంలో అరుణ్ అయ్యగారు, జమునారాణి, స్వప్న తదితరులు పాల్గొన్నారు.