వరుణ్ తేజ్, ప్రగ్యా జైశ్వాల్ జంటగా క్రిష్ తెరకెక్కించిన సినిమా `కంచె`. దసరా రోజున విడుదలైంది. ఈ సినిమాను జాగర్లమూడి సాయిబాబు, రాజీవ్ రెడ్డి నిర్మించారు. ఈ సినిమా టీమ్‌ను ఆదివారం చిరంజీవి హైదరాబాద్‌లో కలిశారు.
చిరంజీవి మాట్లాడుతూ ``నేను నిన్న కంచె సినిమాను చూశాను. ఈ టీమ్ ను అభినందించకుండా ఉండలేకపోతున్నా. వరుణ్‌కి, క్రిష్‌కి ఫోన్ చేసి అభినందించాను. ఫోన్ చేసి పిలిపించాను. క్రిష్ మామూలుగా చాలా మంచి సినిమాలు తీస్తారు. ఈ సినిమాను ప్రయోగాత్మక సినిమా అని అనడానికి వీల్లేదు. కమర్షియల్‌తో కూడిన అందమైన ప్రయోగాత్మక చిత్రమిది. ఇలాంటి సినిమాను ప్రేక్షకులు ఆదరించాలి. అభినందించాలి. 1930 బ్యాక్‌డ్రాప్ విలేజ్ కుర్రాడిగా, వారియర్‌గా వరుణ్ తేజ్ చాలా బాగా చేశాడు. వార్ సీన్లను జార్జియాలో తీశారు. హాలీవుడ్ సినిమా స్థాయికి ఏమాత్రం తీసిపోని సినిమా ఇది. 55 రోజుల్లో ఈ సినిమాను తీశారని తెలుసుకుని ఆశ్చర్యపోయా. ఇప్పుడిప్పుడే పరిశ్రమకు వస్తున్న వరుణ్‌లో ఇంతటి పరిపక్వత చూసి ఆశ్చర్యపోయాను. తనకు తానుగా తనను మలచుకున్నాడు. సాయిమాధవ్ బుర్రా రాసిన డైలాగులు నాకు గుర్తుండిపోయాయి`` అని చెప్పారు.
క్రిష్ మాట్లాడుతూ ``ఇవాళ మా నాన్నగారి పుట్టినరోజు. ఇలా చిరంజీవిగారు పిలిచారని చెప్పాను. ఆయన నన్ను కౌగలించుకున్నారు. నేను వేదం తీసినప్పుడు కూడా ఆయన అంతగా ఆనందించలేదు. ఇవాళ చాలా ఆనందించారు. ఈ సినిమాను అమ్మ, నాన్న, గురువు, దైవం, పుడమి, పుస్తకానికి అంకితమిచ్చాను. నా తదుపరి సినిమాలను ప్రేక్ష దేవుళ్ళకు అంకితమిస్తాను. చిరంజీవిగారు ఇలా ఇంటికి పిలిచి అభినందించడం నా జ్ఞాపకాల భాండాగారంలో తీపి గుర్తు`` అని అన్నారు.
ఈ సమావేశంలో నాగబాబు, వరుణ్ తేజ్, సాయిమాధవ్ బుర్రా కూడా పాల్గొన్నారు.