27 April 2014
Hyderabad
'తాత మనవడు' విడుదలై 41 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా, వేయి పున్నములు దర్శించిన ప్రముఖ చిత్ర నిర్మాత కె . రాఘవ ను 'యువకళావాహిని' 27 న ప్రసాద్ ల్యాబ్ లో ఘనంగా సన్మానించింది . ఈ సభకు ముఖ్య అతిధి గా ' దర్శక రత్న' దాసరి నారాయణ రావు హాజరయ్యారు . సారిపల్లి కొండలరావు అధ్యక్షత వహించిన ఈ సభలో - కోడిరామకృష్ణ , తమ్మారెడ్డి భరద్వాజ , రేలంగి నరసింహారావు , పరుచూరి హనుమంతరావు , వీరశంకర్ , రంగనాద్ , అర్ .నారాయణ మూర్తి , నారాయణ రావు , డా " రామ్ దొర, 'సంధ్య ఫిల్మ్స్' సుబ్బారావు, 'యువకళావాహిని' అధ్యక్షులు వై .కె .నాగేశ్వర్ రావు పాల్గొన్నారు .
దాసరి నారాయణ రావు మాట్లాడుతూ -ఇప్పుడు నిర్మాత అనే మాటకు అర్ధం మారిపోయింది . కేషియర్లు , ఫైనాన్షియర్లు , మీడియేటర్లు నిర్మాతలుగా ఎక్కువ కనిపిస్తున్నారు . కొందరు నిర్మాతలు హీరోల డేట్స్ ఇస్తే కోట్లు సంపాయించాలనుకుని , దానికోసం ఏ గడ్డి కరవడానికై సిద్ధపడుతున్నారు . సినిమా పట్ల , నిర్మాణం పట్ల పూర్తి అవగాహనతో వుండే నిర్మాతలు పరిశ్రమకు కావాలి . కె .రాఘవ వంటి నిర్మాతలు వుంటే మన చిత్ర పరిశ్రమకు ఈ దుర్గతి పట్టేది కాదని -అన్నారు .కె .రాఘవ నాకు దర్శకుడిగా అవకాశం ఇచ్చివుండకపోతే- నాద్వారా 48 మంది దర్శకులు వచ్చివుండే వారు కాదు .ఒకరిని మనం ఆదుకుంటే -అతడు పదిమందికి ఆధారమవుతాడని నమ్మిన మనిషి కె .రాఘవ. అయనగానీ , నేనుగానీ , నా శిష్యులు గానీ మంచి కధల వెంట పడ్డామే తప్ప, స్టార్స్ వెంట పడలేదు . తెలుగు సినిమా పరిశ్రమ హైదరాబాద్ రావడానికి కె .రాఘవ చేసిన కృషి చాలా వుంది . దురదృష్ట వశాత్తూ మన చరిత్ర మరుగున పడిపోతోంది. ఎన్టీఆర్ అంటే- ఇప్పటి జూనియర్ ఎన్టీఆర్ అనుకునే పరిస్థితి దాపురించింది . కె .రాఘవ కు ప్రభుత్వ పరం గా రావాల్సిన గుర్తింపు కూడా దక్కలేదని ఆవేదన వ్యక్తం చేసారు . ఈ కార్యక్రమం లో ప్రతాప్ ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకం ఫై కె .రాఘవ నిర్మించిన చిత్రాల్లోని ఆణిముత్యల్లాంటి పాటలను ప్రదర్శించడమే కాక, వి.వి.రామారావు , పద్మశ్రీ లు మధురం గా ఆలపించారు . ఎస్వీ రామారావు ఈ సభకు వ్యాఖ్యాతగా వ్యవహరించారు .