26 June 2016
Hyderabad
భాషే రమ్యం, సేవే గమ్యం అని ప్రతి శ్వాసలోనూ విశ్వసించే ఉత్తర అమెరికా తెలుగు సంఘం (NATS), డిట్రాయిట్ శాఖాధ్యక్షుడు శ్రీ తమ్మినీడి కిషోర్ గారి సహాయ సహకారాలతో "విశ్వమానవ వేదిక" యలమంచిలి వారి ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి గ్రామంలో కంటి పరీక్షల శిబిరం నిర్వహించారు.
ఈ శిబిరంలో త్రినేత్ర ఆధునిక కంటి స్కానర్ ద్వారా డయాబెటీస్ వ్యాధిగ్రస్తులకు కంటి నరములు, శుక్లాలు, కంటి చూపు,అద్దాలు వంటి వివిధ కంటి పరీక్షలు 200 మందికి చేశారు. వీరిలో 30 మందికి కంటి శస్త్ర చికిత్సలు అవసరమని గుర్తించి, దానికి కావలసిన ఏర్పాట్లు చేశారు. కంటి పరీక్షలు, కంటి శస్త్ర చికిత్సలు అన్నీ ఉచితంగా చేశారు.
ఈ ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని ప్రారంభించిన మండల పరిషత్ అధ్యక్షురాలు బొప్పన సుజాత, జన్మభూమి ని మరచిపోకుండా పేదలకి ఏదైనా చేయాలన్న సేవా దృక్పధంతో కిశోర్ తమ్మినీడి లాంటి ప్రవాసాంధ్రులు అందిస్తున్న సహాయ సహకారాల వల్ల గ్రామీణ ప్రాంతాల్లో పేదల కళ్ళకి వెలుగు వస్తున్నది అన్నారు.
యలమంచిలి సర్పంచ్ శ్రీ వెలిచేటి నర్సింహ వర్మ గారు, పురప్రముఖులు శ్రీయుతులు తమ్మినీడి నర్సింహా రావు గారు, తమ్మినీడి చక్రవర్తి (సర్వారాయుడు) గారు, సొసైటి అధ్యక్షులు శ్రీ తాళ్ళూరు సత్యశ్రీనివాస్ గారు, శ్రీ కడిమి శ్రీనివాస్ గారు, మాజీ సర్పంచ్ శ్రీ తాళ్ళూరి సూర్య ప్రసాద్ గారు అతిథులుగా విచ్చేసిన ఈ శిబిరాన్ని విశ్వమానవ వేదిక అధ్యక్షుడు మల్లుల సురేష్ , పాలకొల్లు రాధ రమణ్ లయన్స్ కంటి ఆసుపత్రి సిబ్బంది తోడ్పాటుతో నిర్వహించారు.
'ప్రార్థించే పెదవులకన్నా పనిచేసే చేతులు మిన్న' అని కిశోరె తమ్మినీడి, మల్లుల సురేష్ తదితర మిత్రులు నిరూపించారని నాట్స్ అధ్యక్షులు మోహన్ కృష్ణ మన్నవ అభినందించారు. భవిష్యత్ లో మరెన్నో సేవ కార్యక్రమాలు చేయాలని అందుకు నాట్స్ మద్దతు ఉంటుంది అని తెలిపారు.