``ఇప్పటివరకూ కొనసాగిన అసోసియేషన్లలో నేటి `మా` అసోసియేషన్ చాలా యాక్టివ్‌గా పనిచేస్తోంది. అత్యుత్తమంగా పనిచేస్తూ పేదకళాకారుల్ని ఆదుకుంటోంది. సీనియర్ నటీనటుల్ని గౌరవించే గొప్ప సత్సాంప్రదాయాన్ని పాదుకొల్పింది. తెలుగు సినిమా లెజెండ్స్ జమున, కైకాల సత్యనారాయణలను సన్మానించి పరిశ్రమ గౌరవాన్ని పెంచింది. ఇలా ఎందరో సీనియర్ నటీనటులకు భవిష్యత్‌లో సన్మానం చేయాల``ని అన్నారు దర్శకరత్న డా.దాసరి నారాయణరావు. ఆయన చేతులమీదుగా నాటి మేటి నటి జమున, నవరస నట సార్వభౌముడు కైకాల సత్యనారాయణలను `మా`అసోసియేషన్ (మూవీ ఆర్టిస్టుల సంఘం) నేటి(ఆదివారం) జనరల్ బాడీ సమావేశంలో సన్మానించుకుంది. డా.దాసరి స్వయంగా జమున, కైకాలకు శాలువాలు కప్పి, జ్ఞాపికలు అందించి సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పైవిధంగా స్పందించారు.
దర్శకరత్న డా.దాసరి మరిన్ని విశేషాలు ముచ్చటిస్తూ -``మద్రాసులో ఆర్టిస్టుల సంఘం మొదలైనా, హైదరాబాద్‌లో అది `మా అసోసియేషన్`గా అవతరించింది. రామానాయుడు డబ్బింగ్ స్టూడియో పరిసరాల్లో ఓ చీకటి వేళ ఇది మొదలైంది. సీనియర్ నటులు ప్రభాకర్ రెడ్డి, గుమ్మడి సమక్షంలో `మా`కు అంకురార్పణ జరిగింది. వైజాగ్ నుంచి విమానంలో వస్తూ `మా` అనే పేరును ఫైనల్ చేశారు. ఇప్పటివరకూ ఎన్నో సంఘాలు వచ్చి వెళ్లాయి. అన్నిటిలో నేటి అసోసియేషన్ పనితీరు బావుంది. కోటీశ్వరులైన ఆర్టిస్టులు, పేదలైన ఆర్టిస్టులు మనకు ఉన్నారు. పేద కళాకారుల్లో కొందరి అడ్రెస్‌లు కూడా తెలీని పరిస్థితి. అలాంటివారిని గుర్తించి ఆదుకోవాలని `మా` గత అధ్యక్షులు మురళీమోహన్‌ని కోరాను. `మా`కు విడిగో 10 కోట్లు కేటాయించి సంక్షేమ కార్యక్రమాలు చేయాలని కోరాను. నిర్మాతలమండలికి 14 కోట్ల నిధి ఏర్పాటు చేసి అందరికీ హెల్త్‌కార్డులు, ఇన్సూరెన్స్ వంటివి ఏర్పాటు చేశాం. అదే తరహాలో నటీనటులందరికీ చేయాలని కోరాను. కానీ అప్పుడు ఎందుకనో కుదరలేదు. అదే కోరిక ఇప్పుడూ రాజేంద్రప్రసాద్‌ని కోరుతున్నా. ఈ మంచి పని మీరు చేయాలి. ఇప్పటి అసోసియేషన్ పేదల్ని ఆదుకుంటోంది. సీనియర్లను సన్మానిస్తోంది. మంచి పనులు చేస్తోంది. ఇలా చేయడం బావుంది. కాకతాళీయమే అయినా.. కైకాలకు తొలి అవకాశం ఇచ్చిన సీనియర్ నటి జమున సహా ఇలా సన్మానించడం బావుంది. జమున గొప్ప ప్రొఫెషనల్ నటి. వృత్తినిబద్ధతతో ఉండే నటి. హరనాథ్, కృష్ణంరాజు వంటివారితో జమున కాంబినేషన్ అంటే సూపర్‌హిట్టే. సత్యభామగా మెప్పించారు. ఆ చిత్రంలో తన వ్యక్తిత్వానికి, ముక్కుసూటి తనానికి దగ్గరగా ఉండే పాత్రలో నటించారు. గ్లామర్, నటన రెండిటి కలబోతగా మెప్పించడం చాలా అరుదు. అది జమునకే సాధ్యమైంది. నా దర్శకత్వంలో గొప్ప సినిమాల్లో నటించారు. ఇక కైకాల గురించి చెప్పాలంటే నా 150 సినిమాల్లో 75 సినిమాల్లో ఆయన నటుడు. ఏడాదికి 20 సినిమాలు చేస్తూ కూడా ఆఫీసులకు వెళ్లి అవకాశాలు అడిగేవారు. అది ఆయన డెడికేషన్. ఆర్టిస్టుగా దుగ్ధ. రామలింగయ్య గారు అలా ఉండేవారు. రాత్రి, పగలు అనే తేడాలేకుండా పనిచేసేవారు. కైకాల `సిపాయి కూతురు`(1959)లో నటించినా, నా `తాతా మనవడు`లో హీరోగా నటించారు. `సంసారం సాగరం`లో చక్కని పాత్రలో నటించి మెప్పించారు. నా 75 సినిమాల్లో నటించినా ఎందులోనూ విలన్‌గా చేయలేదు. అదో ప్రత్యేకత. ఎస్వీ రంగారావు గారు.. నువ్వేరా నా వారసుడివి. నా తర్వాత వేరే ఎవరూ లేరు.. అనేవారు కైకాలతో. యముడిగా, ఘటోత్కచుడిగా ఎన్నో విలక్షణ పాత్రలు పోషించి మెప్పించిన నటసార్వభౌముడు కైకాల. ఈ ఇద్దరు లెజెండ్స్‌ని సత్కరించిన `మా`అసోసియేషన్‌కి ధన్యవాదాలు. మునుముందు మరింతమంది సీనియర్ నటీనటులను ఇలానే సన్మానించాలి. మా అసోసియేషన్‌కి నా తరపున ధన్యవాదాలు`` అన్నారు.
పద్మశ్రీ ఇవ్వకపోవడం దౌర్భాగ్యం: దాసరి
ఇదే వేదికపై దర్శకరత్న దాసరి సీనియర్ నటీనటుల గురించి ప్రస్థావిస్తూ .. అంజలీదేవి, సావిత్రి, ఎస్వీఆర్, జమున, కైకాల వంటి సీనియర్ నటీనటులకు పద్మశ్రీలు లేవంటే అది అందరి దౌర్భాగ్యం. మన ప్రభుత్వాలు ప్రతిభను గుర్తించవు. రికమండేషన్లనే గుర్తిస్తాయి. ఇదో దరిద్రం.. అని విమర్శించారు. ఎవరో ముక్కు, మొహం తెలీని వారికి పద్మశ్రీలు ఇస్తున్నారు. అందువల్ల వాటి విలువ పడిపోయింది. ఇప్పుడు ఇచ్చినా వాటికి విలువే లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
జమున మాట్లాడుతూ -``50 ఏళ్ల నటజీవితంలో గోల్డెన్ జూబ్లీ, సిల్వర్ జూబ్లీలు ఎన్నో చూశాం. `మా` కుటుంబ సభ్యుల మధ్య సన్మానం గొప్ప సంతోషాన్నిస్తోంది. `సిపాయి కూతురు` చిత్రంలో జమున గారు అవకాశం ఇచ్చారని ఇప్పటికీ చెబుతుంటారు కైకాల. అప్పటినుంచి మేం పరిశ్రమలో కొనసాగుతూనే ఉన్నాం. ఇప్పుడు వృద్ధాప్యం వచ్చినా యాక్టివ్‌గానే ఉన్నాను. రాజేంద్రప్రసాద్ అధ్యక్షతన, శివాజీ రాజా కార్యదర్శిగా మా అసోసియేషన్ ఎన్నో మంచి పనులు చేస్తోంది. వృద్ధాప్య ఫించన్లు ఇస్తున్నారు. ఫించన్ల కోసం నేను ఇదివరకే లక్ష విరాళం ప్రకటించాను. దానిని త్వరలోనే `మా`అసోసియేసన్‌కి అందిస్తాను. మన కళ్ల ముందే మన ప్రియతమ కథానాయకులు ఎన్టీఆర్, ఏఎన్నార్ మనల్ని వీడి వెళ్లారు. నటీనటుల్లో యువత ఆత్మహత్యలు బాధించాయి. వారిని స్మరించుకుందాం. `మా అసోసియేషన్` ఇలా సీనియర్లను సన్మానించడం, గౌరవాన్ని పెంచేదిగా ఉంది. సీనియర్ నటి హేమలత (90) ఎన్టీఆర్ సరసన నటించారు. వందల సినిమాల్లో తను నాయిక. అలాంటి నటిని గౌరవించి తీరాలి. సీనియర్లందరినీ వెతికి మరీ గౌరవించాలి. ఈ సత్సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్న `మా`ను అభినందిస్తున్నా. రాజేంద్ర ప్రసాద్, శివాజీరాజా... డైనమిక్ లీడర్‌షిప్‌లో కమిటీ మరిన్ని మంచిపనులు చేస్తూ ముందుకెళ్లాలని కోరుకుంటున్నా. పేద కళాకారులకు ఫించన్లు ఇవ్వాలని కోరుతున్నా`` అన్నారు.
కైకాల సత్యనారాయణ మాట్లాడుతూ -``పూర్వం మద్రాసులో ఓ సాంప్రదాయం ఉండేది. సినిమా చిత్రీకరణ పూర్తయ్యాక సీనియర్లను పిలిచి ప్రివ్యూ చూపించేవారు. హైదరాబాద్‌కి పరిశ్రమ వచ్చాక కొన్ని సాంప్రదాయాలు మారాయి. ప్రివ్యూలకు, సన్మానాలకు సీనియర్లను పిలవకపోగా గౌరవించకపోవడం బాధ కలిగించింది. టీవీల్లో ఏవైనా ఫంక్షన్స్ వచ్చేప్పుడు ఇదెప్పుడు జరిగింది? పిలవలేదేంటి? అనుకునేవాడిని. ఇలాంటి సందర్భంలో `మా అసోసియేషన్` ఇలా సీనియర్లను గౌరవించడం సంతోషాన్నిస్తోంది. రాజేంద్ర ప్రసాద్, శివాజీ రాజాలతో పాటు కమిటీ మంచి ఆలోచన చేసింది. జమున గారు చెప్పినట్టు ఎన్నో సన్మానాలు, కనకాభిషేకాలు జరిగినా ఇంట గెలిచి రచ్చ గెలవాలన్నట్టు.. `మా` సన్మానం గొప్ప ఆనందాన్నిచ్చింది. ఆరోజు జమున రూలింగ్ హీరోయిన్. తను అవకాశం ఇవ్వకపోయి ఉంటే నా కెరీర్ అంత ఫ్లైయింగ్ స్టార్ట్ అయ్యేది కాదు. బతికి ఉన్నంత కాలం కృతజ్ఞత చెప్పుకోవడం తప్పేం కాదు. ఇప్పటికి 772 సినిమాల్లో నటించాను. జానపదం, పౌరాణికం, సాంఘీకం అన్నిరకాల సినిమాలు చేశాను. ఇదంతా ప్రేక్షకాభిమానుల ఆదరణతోనే. మా అసోసియేషన్ ఇలాంటి మంచి పనులు మరిన్ని చేయాలని ఆకాంక్షిస్తున్నా`` అన్నారు.
`మా` అసోసియేషన్ అధ్యక్షులు, నటకిరీటి డా.రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ -``ఇద్దరు లెజెండ్స్‌ని ఇలా దర్శకరత్న చేతులమీదుగా సన్మానించుకోవడం ఆనందాన్నిస్తోంది. మా అసోసియేషన్ ఇలాంటి మరిన్ని మంచి పనులు చేసేందుకు, సన్మానాలు చేసేందుకు సిద్ధంగా ఉంది. సీనియర్లను గౌరవించడం మా బాధ్యత. ఆ పనే మేం చేస్తున్నాం. ప్రతిసారీ జనరల్ బాడీ మీటింగుల్లో ఇలా సీనియర్లను సన్మానించుకుంటాం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు, మా సభ్యులు, నటీనటులు అందరికీ ధన్యవాదాలు`` అన్నారు.
`మా` అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి (జనరల్ సెక్రటరీ) శివాజీ రాజా మాట్లాడుతూ -``సీనియర్ నటీనటుల్ని సన్మానించడం, గౌరవించుకోవడం మా బాధ్యతగా భావించి ఈ కార్యక్రమం చేస్తున్నాం. పెద్దలు దాసరి చేతులమీదుగా సన్మానం హుందాతనాన్ని, గౌరవాన్ని పెంచింది. ఇలాంటి మరిన్ని మంచి పనులు మునుముందు చేస్తాం. పేద కళాకారుల్ని ఆదుకునే మంచి పనులు చేస్తున్నాం. మునుముందు ఇంకా చేస్తాం. అందరి ప్రోత్సాహం కావాలి`` అన్నారు.