ఆది, ఆదాశర్మ జంటగా నటిస్తున్న సినిమా `గరం`.మదన్ దర్శకత్వం వహించారు. పి.సురేఖ నిర్మాత. శ్రీమతి వసంత శ్రీనివాస్ సమర్పిస్తున్నారు. ఈ సినిమా ప్రెస్‌మీట్ శనివారం మధ్యాహ్నం హైదరాబాద్‌లోని ఎఫ్ ఎన్ సీసీలో జరిగింది. సాయికుమార్‌కు చెందిన శ్రీనివాసాయి స్క్రీన్స్ అనే బ్యానర్ ను అచ్చిరెడ్డి ప్రారంభించారు. టైటిల్ లోగోను ఆది, ఆదా శర్మ, మోషన్ పోస్టర్‌ను రఘుబాబు విడుదల చేశారు.
సాయికుమార్ మాట్లాడుతూ ``బాలల దినోత్సవం రోజు మా బ్యానర్ లాంచ్ చేయడం ఆనందంగా ఉంది. మా ఫ్యామిలీలో అందరం చిన్నప్పుడే సినిమా పరిశ్రమలోకి ఎంటర్ అయ్యాం. ఆది కూడా కప్పలు అనే నాటకంలో అమ్మా ఆకలి అనే డైలాగ్ చెప్పి బాలనటుడయ్యాడు. ఇప్పుడు తను హీరోగా నటిస్తున్న ఏడో సినిమా గరం షూటింగ్ పూర్తయింది. డీటీయస్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇటలీలో మూడు పాటలను చిత్రీకరించాం. మదన్ చాలా మొండోడు. అతనికి కావాల్సింది అడిగి తీసుకునేవాడు. మా యూనిట్ అంతా కుటుంబంలా కలిసి బాధ్యతగా పనిచేశారు`` అని చెప్పారు.
రఘుబాబు మాట్లాడుతూ ``ఈ సినిమాలో నేను యాక్ట్ చేయలేదు. అయినా ఆది కోసం వచ్చాను. ఆది నటించిన ఏ సినిమా అయినా 100 రోజులు ఆడాలి. మంచి టెక్నీషియన్లు, ఆర్టిస్టులు పనిచేసిన సినిమా ఇది. సినిమా గ్రాండ్ సక్సెస్ కావాలి`` అని తెలిపారు.
ఆదాశర్మ మాట్లాడుతూ ``సాయిగారు, బాబ్జీ గారు నన్ను డాటర్‌లాగా చూసుకున్నారు. ఈ సినిమాలో పనిచేయడం ఆనందంగా ఉంది`` అని చెప్పారు.
ఆది మాట్లాడుతూ ``శ్రీనివాస్ గారు, వసంత ఆంటీ, మా పేరెంట్స్, బాబ్జీగారు, షీలా ఆంటీ అందరికీ ధన్యవాదాలు. పరిశ్రమలో సినిమా తీయడంలో ఉన్న కష్టమేంటో, మా ఇంట్లో మా తల్లిదండ్రులు లెక్కలేసుకుంటున్నప్పుడు అర్థమైంది. తెలుగు సినిమా పరిశ్రమలోని నిర్మాతలు అందరికీ ధన్యవాదాలు. నేను నిర్మాతల హీరోగా ఉండటానికే ఇష్టపడతాను. నా దగ్గరికి మదన్‌ని కెమెరామేన్ సురేందర్ రెడ్డి తీసుకొచ్చారు. శ్రీనివాస్ గవిరెడ్డి చెప్పిన కథ నచ్చింది. ఈ చిత్రంలో మంచి ఎమోషన్ ఉంటుంది`` అని తెలిపారు.
మదన్ మాట్లాడుతూ ``శ్రీనివాస్ లైన్ చెప్పినప్పుడు బాగా నచ్చింది. ఇవ్వమని అడిగితే ఏమనుకుంటాడోనని మొహమాటపడ్డాను. కానీ చివరికి కథ ఇచ్చాడు. ద్వేషించే వారిని ప్రేమించే స్థాయికి ఎదగాలంటే చాలా కష్టం. అలాంటి పాయింట్‌తో తెరకెక్కిన సినిమా ఇది. ఆది కథ విన్నాక ఇదే చేద్దామని అన్నారు. తన సంకల్పబలంతోనే ఈ ప్రాజెక్ట్ ఓకే అయింది. కేరక్టర్‌ని అంతగా ప్రేమించాడు ఆది. నాకూ కంటెంట్ బేస్డ్ స్క్రిప్ట్ లు అంటే ఇష్టం. ఈ కథపై కూడా మరలా ఇంకోసారి పనిచేశాను. మా టీమ్ బాగా కష్టపడి పనిచేసింది. ప్రాపర్ టీమ్ కలిసి చేసిన సినిమా ఇది. పాటలు చాలా బావున్నాయి`` అని చెప్పారు.
శ్రీనివాస్ గవిరెడ్డి మాట్లాడుతూ ``కథని నమ్మి, పాయింట్ ని నమ్మి ఈ సినిమా తీయడానికి ముందుకొచ్చారు మదన్, సాయిగారు. ఆది చాలా నేచురల్‌గా కనిపించాడు. డిఫరెంట్‌గా ఉంటాడు. పక్కింటి అబ్బాయిలా కనిపిస్తాడు. మంచి సినిమా అవుతుంది. ఆది కెరీర్‌లో కొత్త ఇమేజ్ ను తెచ్చిపెట్టే సినిమా అవుతుంది. మదన్‌గారు నాకు గురువుగారు. ఆయన దగ్గరే పనిచేశాను. నేను చెప్పిన కథ విని వెంటనే ఓకేచేసేశారు. ఆదికి అయితే బావుంటుందని కూడా ఆయనే అన్నారు. ఈ సినిమా కొత్త తరహా సినిమా అవుతుంది. అదే సమయంలో మంచి సినిమా అవుతుంది`` అని చెప్పారు.
సురేందర్ రెడ్డి మాట్లాడుతూ ``ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా బాగా సపోర్ట్ చేసి సినిమాను తెరకెక్కించారు సాయి ఇందులో బ్యూటీఫుల్ ఎమోషన్ ఉంది. విజువల్ గా స్కోప్ ఉన్న సినిమా ఇది`` అని చెప్పారు.
అగస్త్య మాట్లాడుతూ ``గరం నాకు ఏడో సినిమా. ఆది సినిమాలు అన్నిటినీ చూస్తున్నా. తను డ్యాన్సులు, ఎనర్జిటిక్‌గా చేస్తారు. మదన్ సినిమాను ప్రెజెంట్ చేసే విధానం బావుంటుంది. స్క్రీన్ ప్లే, లాజిక్కులు మిస్ కాకుండా చేశారు మదన్. రీరికార్డింగ్ చేసేటప్పుడు చాలా ఎంజాయ్ చేశాను. థ్రూ అవుట్ ఎనర్జీ ఉన్న సినిమా ఇది. పాటలు బాగా వచ్చాయి. త్వరలోనే అందరూ వింటారు`` అని చెప్పారు .