22 December 2015
Hyderabad
ప్రపంచానికి జ్ఞాన భిక్ష పెట్టింది భగవద్గీత. భగవద్గీత ప్రచారం ఉద్యమంలాగా ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందన్నారు శాసన సభ్యుదు కిషన్ రెడ్డి. ప్రతి అంశాన్ని మతపరంగా చూస్తున్న ప్రస్తుత పరిస్తుతుల్లో గాయకుడు,భగవద్గీత ఫౌండేషన్ చైర్మన్ గంగాధర్ 'భగవద్గీత మతాలకు అతీతమని,జ్ఞాన ప్రదాయని అని ప్రచారం చేయటం అభినందనీయమని అన్నారు. హైదరాబాదు లోని త్యాగారాయగానసభ లో 'గీతా జయంతి' సందర్భంగా 'భగవద్గీత ఫౌండేషన్' ఆధ్వర్యంలో సోమవారం 'గీతాజయంతి' వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ముఖ్య అతిధి గా విచ్చేసిన శాసనసభ్యుడు కిషన్ రెడ్డి పై విధంగా అన్నారు. ఆయనే మాట్లాడుతూ 'గంగాధర శాస్త్రి సినీ పాటలను పక్కన పెట్టి సంపూర్ణ భగవద్గీత పారాయణ యాగాన్ని నిర్వహించటం అభినంద నీయమన్నారు. ముఖ్యంగా ఊరూరా గీతా మందిరాలను నిర్మించాలనే సంకల్పాన్ని తీసుకోవటం ప్రధానంగా భగవద్గీత విశ్వ విద్యాలయాన్ని ఏర్పాటు చేయాలనే గొప్ప సంకల్పాన్ని చేపట్టటం విశేషమన్నారు. ఫౌండేషన్ యువత,పిల్లలకు వ్యక్తిత్వ నిర్మాణానికి కృషి చేయాలన్నారు. భగవద్గీత యజ్ఞంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. ఇటువంటి గొప్ప కార్యక్రమాలను చేపట్టాలనుకున్న గంగాధర శాస్త్రికి తనవంతు సహకారాన్ని సంపూర ్ణంగా అందజేస్తామని కిషన్ రెడ్డి అన్నారు.
స్వాతంత్ర ఉద్యమ కాలంలో ఉరికంబం ఎక్కిన ప్రతి దేశ భక్తుడి చేతిలో భగవద్గీత ఉందని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, జీర్ణ దేవాలయాల పునరుద్ధరణ సారధి శ్రీ కమలానంద భారతి స్వామి అన్నారు. మనదేశ కీర్తికి భగవద్గీత కారణం అన్నారు. పాశ్చాత్యులు భారత దేశాన్ని గౌరవించటానికి కూడా ఇదే కారణమన్నారు. భగవద్గీత మనిషి మానవత్వాన్ని కోల్పోతున్న చివరి దశలో శ్రీకృష్ణుడు గొప్ప ఆధ్యాత్మిక గ్రంధాన్ని అందించారన్నారు, మానవునికి ప్రేరణ నిచ్చేది,స్పూర్తినిచ్చేది, సకల శాస్త్రాల సమ్మేళనం భగవద్గీత అన్నారు. భారతదేశ చరిత్ర చదివితే భగవద్గీత సారం తెలుస్తుందని అన్నారు.800 సంవత్సరాల చరిత్రలో మనదేశంలో ఎన్నో దేవాలయాలు కూల్చబడ్డాయని, ప్రపంచ దేశాలన్నీ మన గీతాసారాన్ని గౌరవిస్తూ,ఆచరిస్తూ మన దేవాలయాలకు తమ దేశాలలో స్థలాన్ని కేటాయిస్తూ వస్తున్నాయని అనుగ్రహ భాషణ చేశారు
గీతాజయంతి వేడుకల సందర్భంగా 'భగవద్గీత ఫౌండేషన్ 'చైర్మన్ గంగాధర శాస్త్రి ప్రారంభోపన్యాసం లో మాట్లాడుతూ,,'మతాలు పుట్టకముందే భగవద్గీత పుట్టిందని, గీత ను పాఠ్యాంశంగా పెట్టాలన్నారు. త్వరలోనే గీతా సారాన్ని ఆంగ్లంలోకి అనువదించి ఆ సిడిలను అమెరికా అధ్యక్షుడు ఒబామా చేతులమీదుగా ఆవిష్కరింప చేయాలన్నది తమ సంకల్పమని తెలిపారు. వెబ్ సైట్ లో ఉంచిన భగవద్గీత శ్లోకాలను కమలానంద భారతీ స్వామి, ఎం ఎల్ సి రామ చంద్ర రావులు ఆవిష్కరించారు. ప్రముఖ వ్యాపారవేత్త లీలాజిబాబు మాట్లాడుతూ..' భగవద్గీత ఫౌండేషన్' చేస్తున్న కార్యక్రమాలు అభినంద నీయమన్నారు. సంస్థకు తమ వంతు సహకారం ఎల్లాప్పుడూ ఉంటుందని అన్నారు.ఈ కార్యక్రమంలోఎం ఎల్ సి రామ చంద్ర రావు, త్యాగరాయ గాన సభ అధ్యక్షుడు డా.కళాదీక్షితులు తదితరులు పాల్గొన్నారు.