Chiranjeevi, Nagarjuna & Venkatesh inaugurate a temple each in Daiva Sannidhanam New Temple at Film Nagar, Hyderabad
ఫిలిం నగర్ దైవ సన్నిధానంలో కొత్త ఆలయాలు ప్రారంభం!
హైదరాబాద్ ఫిలిం నగర్ దైవ సన్నిధానంలో కొత్త ఆలయాల ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామీజీ ఆద్వర్యంలో ఈ దైవ కార్యక్రమంలో చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, మురళీమోహన్ తదితరులు పాల్గొని విజయవంతం చేశారు. కన్నుల పండుగ గా జరిగిన ఈ ఆలయాల ప్రారంబోత్సవంలో సంతోషిమాత విగ్రహాన్ని చిరంజీవి దంపతులు ఆవిష్కరించగా.. సూర్యనారాయణ మూర్తి విగ్రహాన్ని నాగార్జున ఆవిష్కరించారు. వెంకటేష్ శ్రీ లక్ష్మి నరసింహస్వామీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా..
స్వరూపానంద స్వామీజీ మాట్లాడుతూ.. '''చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ లకు మంచి దైవభక్తి ఉంది. వారు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయడం సంతోషదాయకం. ఈ దేవాలయం ద్వారా మా కమిటీ వాళ్ళు, అర్చకులు మరింతగా సేవలందించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను'' అని చెప్పారు.
చిరంజీవి మాట్లాడుతూ.. ''ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవడం సంతోషంగా ఉంది. స్వామీ వారి ఆధ్వర్యంలో సంతోషిమాత విగ్రహాన్ని ఆవిష్కరించడం సంతోషంగా ఉంది. మా దంపతులకు ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు'' అని చెప్పారు.
నాగార్జున మాట్లాడుతూ.. ''సూర్యభగవానుడి ఆలయాన్నిఆవిష్కరించడం నా అద్రుష్టంగా భావిస్తున్నాను. రెండు రాష్ట్రాల ప్రజలతో పాటు ప్రపంచం మొత్తానికి మంచి జరగాలి'' అని చెప్పారు.
మురళి మోహన్ మాట్లాడుతూ.. ''నిమ్మగడ్డ ప్రసాద్ గారిని దేవాలయం నిర్మించమని లక్ష్మీ నరసింహస్వామి కలలో ఆదేశించడం జరిగింది. నిజానికి ఈరోజు ఆవిష్కరించబడ్డ మూడు ఆలయాలను కూడా కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి, వారి సతీమణి నిర్మించాలనుకున్నారు. కాని నిమ్మగడ్డ ప్రసాద్ గారి కోరిక మేరకు వారు తప్పుకున్నారు. వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను'' అని చెప్పారు.
నిమ్మగడ్డ ప్రసాద్ మాట్లాడుతూ.. ''గత కొంతకాలంగా లక్ష్మీ నరసింహస్వామి కలలో కనిపిస్తున్నారు. రీసెంట్ గా ఫిలిం నగర్ టెంపుల్ కి వచ్చినప్పుడు ఇక్కడ లక్ష్మి నరసింహస్వామి విగ్రహం లేకపోవడం గమనించాను. త్వరలోనే దానిని నిర్మించే పనులో ఉన్నామని యాజమాన్యం తెలిపింది. ఆ విగ్రహాన్ని నేనే నిర్మించాలని ఈ కార్యక్రమం చేపట్టాను. రెండు రోజులుగా ఈ కార్యక్రమంలో ఉన్న నేను ప్రపంచాన్ని మర్చిపోయాను. ఈ అవకాశం ఇచ్చిన చైర్మన్, కమిటీకు రుణపడి ఉంటాను'' అని చెప్పారు.