26 January 2015
Hyderabad
భారతీయ చలనచిత్ర చరిత్రలో తొలిసారిగా హైదరాబాద్ లో జనవరి 24, ఆదివారం సైబర్ సిటీ కన్వెన్షన్ హాల్ వేదికగా ఓ వినూత్న సంఘం ఆవిర్బవించింది.
దర్శకులు వీరశంకర్ మాట్లాడుతూ “సినీ ప్రరిశ్రమలో పనిచేస్తున్న వారికి వేరువేరు సంఘాలు వున్నాయని, అవన్నీ వారి హక్కుల పరిరక్షణకూ సంక్షేమానికి పనిచేస్తున్నాయి. కానీ అందరిని కలుపుతూ ఒక సృజనాత్మక వేదిక కావాలన్న ఆవశ్యకతను గుర్తించి ఈ కాస్మిక్ సినీ క్లబ్ ను స్థాపించడం జరిగిందన్నారు ఒక్కమాటలో చెప్పాలంటే భారతీయ చలనచిత్ర చరిత్రలో తొలిసారిగా కుల, మత, ప్రాంత, భాషా బేధాలకు అతీతంగా చలన చిత్రాలను శ్వాసించే వారందరినీ ఒకే సృజనాత్మక వేదిక పైకి తీసుకువస్తున్న సంఘం ఇదని పేర్కొన్నారు.
దర్శకులు దేవీప్రసాద్ ప్రసంగిస్తూ “సకల కళల సమాహారం సినిమా అని మనందరికీ తెలుసు. సినిమా రంగంలోని నటీ నటులు, దర్శకులూ రచయితలూ, సాంకేతిక నిపుణులు, నిర్మాతలు, పంపిణీదారులు, ధియేటర్ల యజమానులు, సినీ జర్నలిస్టులు, వివిధ రంగాలలో స్థిరపడిన సృజనాత్మక విభాగాల సభ్యులు, ఎందరో చలన చిత్ర ప్రేమికులూ కలిసి తమ అభిరుచులను పంచుకోవడానికీ, ఒకరికొకరు సహకరించుకుంటూ తమ సంబంధాలను పెంచుకొనే లక్ష్యంతో “కాస్మిక్ సినీ క్లబ్” ఆరంభమైంది. తమ అభివృద్ధితో పాటు మంచి సినిమాలను మనసారా ఆకాంక్షించే వారందరి కాంక్షలకీ ప్రతిరూపంగా ఈ “కాస్మిక్ సినీ క్లబ్” రూపుదిద్దుకోనుందని తెలియజేశారు.
ప్రముఖ దర్శక-రచయిత, నటులూ అయిన తనికెళ్ళ భరణి మాట్లాడుతూ ‘ఒక్కచాన్స్ దొరికితే చాలు’ అంటూ సినీ పరిశ్రమలో ఎదురు చూసే ఔత్సాహికులకు ఇది చక్కటి వేదిక అవుతుందని, కొత్త టేలెంట్ బయటకొస్తుందనీ, ఇలాంటి వేదిక సినీ రంగానికి చాలా అవసరమని, తాను కూడా ఈ సంఘంలో సభ్యుడిగా చేరుతున్నాన’’ని ప్రకటించారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఛోటా. కె. నాయుడు మాట్లాడుతూ తాను ఈ సంఘానికి తన వంతుగా సేవలందించడానికి సిద్దంగా వున్నానని సభికుల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. సైబర్ క్రైమ్ ఎస్.పి., యు. రామ్మోహన్ మాట్లాడుతూ ఈ సంఘ సభ్యుల నుంచి కళాత్మక చిత్రాలు రావాలని చెప్తూ, పోలీసు అధికారులు ధరించే బాడ్జీల విషయంలో జాగ్రత్త వహించాలని చెప్పి చలోక్తులతో సభని అలరించారు. ఎక్సపెర్ట్ కమిటీ లో సభ్యుడిగా తన సేవలను అందించడానికి అంగీకరించారు.
ఈ సభకు ముఖ్య అతిధులుగా విచ్చేసిన ప్రముఖులలో జాతీయ సి.ఈ.ఓ. క్లబ్ కి నేషనల్ ప్రెసిడెంట్ గా వ్యవహరిస్తున్న హరి.కె.వి., మాట్లాడుతూ కాస్మిక్ సినీ క్లబ్ లక్ష్యాలు నచ్చి తాను ఈ సంఘంలో ముఖ్యసలహాదారుగా వుండడానికి అంగీకరించానని, తన సంపూర్ణ సహాయ సహకారం అందించడానికి ఎల్లప్పుడూ సిద్దంగా వున్నానని తెలిపారు.
రిట్రైర్డ్ డి.ఐ.జి., వై. గంగాధర్ మాట్లాడుతూ ఎక్సపెర్ట్ కమిటీలో సభ్యులుగా వుండడానికి అంగీకరిస్తూ తాను కూడా ఈ సంఘంలో చేరుతున్నానని ప్రకటించారు.
దర్శకులు మారుతి మాట్లాడుతూ “ఇలాంటి వేదిక ఆవశ్యకత ఎంతో అవసరమని చెపుతూ తాను సభ్యుడిగా చేరుతున్నానని’’ అన్నారు.
పటాస్ దర్శకులు అనిల్ రావిపూడి మాట్లాడుతూ “ దర్శకులు వీరశంకర్, సి.దేవీ ప్రసాద్ లు చెప్పడం వల్ల ఈ సంఘంలో చేరుతున్నాననీ తెలిపారు.
ముఖ్య అతిధిగా విచ్చేసిన తెలంగాణా ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐ.టి., డైరెక్టర్ సుజయ్ మాట్లాడుతూ ఈ క్లబ్ ఆవిర్భావం పట్ల అభినందనలు తెలియజేస్తూ ప్రభుత్వం తరపున అన్ని విధాల సహకారం అందించడానికి ప్రయత్నిస్తానని పేర్కొన్నారు.
నిర్మాత దర్శకులు మధుర శ్రీధర్ మాట్లాడుతూ, కో ఆర్డినేషన్ కమిటీ చైర్మన్ గా ఉండడానికి అంగీకరిస్తూ ఈ క్లబ్ కి కావలసిన స్థలాన్ని సేకరించడానికి తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఇంకా ఈ ఆవిర్భావ సభలో డిజిక్వెస్ట్ అధినేత కె. బసిరెడ్డి, టెక్నికల్ ఎక్సపెర్ట్ నల్లమోతు శ్రీధర్, డిజిటల్ టెక్నాలజీ ఎక్సపర్ట్ రాంబాబు ధనిశెట్టి, సినిమాటో గ్రాఫర్స్ సమీర్ రెడ్డి, సి.రాం ప్రసాద్, వాసు, ప్రముఖ రచయితలు విజయేంద్రప్రసాద్, కె.ఎల్. ప్రసాద్, అడ్వకేట్స్ బదరీ నారాయణ, అప్పిరెడ్డి లు పాల్గొన్నారు.
వైష్ణవి, శ్వేత, శ్రియా మాధురి ఆలపించిన భక్తిగీతంతో సభ ఆరంభమైంది. సాయి శ్రీకాంత రచించిన కాస్మిక్ సినీ క్లబ్ సిగ్నేచర్ సాంగ్ ను నిహాల్ వేణు సాయి శ్రీకాంత ఆలపించగా, డాన్స్ మాస్టర్ వేణు బృందం నృత్యరూపంలో ప్రసాదించారు. రచయిత గౌతమ్ కశ్యప్ కమల్ హాసన్ అనుకరణ, కరుణ కుమార్ స్టాండప్ కామెడీ ఆహూతులను అలరించింది. ఈ సంఘ సమావేశానికి తనికెళ్ళ భరణి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. డాక్టర్ శ్రీనాధ్ గారి వందన సమర్పణతో ఈ కార్యక్రమం దిగ్విజయంగా ముగిసింది.
ఈ కాస్మిక్ సినీ క్లబ్ కి వీరశంకర్ (బి.వి.ఎస్. శ్రీనివాస్) అధ్యక్షుడిగా డాక్టర్ ఎల్. శ్రీనాధ్ ఉపాధ్యక్షుడిగా, సునీల్ (ఎ.ఎస్. సుబ్రహ్మణ్యం) ముఖ్య కార్యదర్శిగా, వెంకట్ (కె. వెంకటస్వామి) కోశాధికారిగా, సి. దేవీప్రసాద్ సంయుక్త కార్యదర్శిగా, కె. ఫణిప్రకాష్, అనురాగ్ పర్వతనేని కార్యనిర్వాహక సభ్యులుగా వ్యవహరిస్తున్నారు.