28 August 2016
Hyderabad
విజయవాడ నగరంలో ఆదివారం సాయంత్రం సినీతారలు సందడి చేశారు. నగరంలోని పిన్నమనేని పాలిక్లినిక్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన శాన్‌టూస్ రెస్టారెంట్ అండ్ క్లబ్ ఎఫ్-5 కాఫీ షాప్‌ను సినీ హీరో నారా రోహిత్ ప్రారంభించారు.
అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నారా రోహిత్ మాట్లాడుతూ దేశవిదేశాలకు చెందిన వివిధ రుచులతో కూడిన వంటకాలను నగర ప్రజలకు అందించే రెస్టారెంట్ నగరం నడిబొడ్డున ఏర్పాటు చేయడం హర్షనీయమన్నారు. రాజధాని ప్రాంతంలో ప్రజలకు ప్రత్యేక వంటకాలైన అరబిక్, నార్త్ ఇండియన్, లిభనీష్, షవర్మ వంటకాలు, మిడిలీస్ట్ బిర్యానీలు, రుచికరమైన ఇటాలియన్ బీన్స్ కాఫీలు, ఒరిజినల్ మ్యాక్‌టైల్స్, సహజసిద్ధ ఐస్‌క్రీమ్‌లు అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు. వినియోగదారుల సౌకర్యార్థం రెస్టారెంట్‌లో వైఫై సౌకర్యంతో పాటు భారీ ప్రొజెక్టర్స్‌ను ఏర్పాటు చేయడం ముదావహమన్నారు.
కార్యక్రమంలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ విజయవాడ రోజురోజుకు అభివృద్ధి చెందుతున్న క్రమంలో అత్యాధునిక సౌకర్యాలతో రెస్టారెంట్‌ను ఏర్పాటు చేయడం పట్ల నిర్వాహకులను అభినందించారు.
కార్యక్రమంలో రెస్టారెంట్ నిర్వాహకులు ముసునూరు వంశీకృష్ణ, మల్లెల పవన్‌కుమార్, నందమూరి శ్రీవినోద్, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌రావు, జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య), నగర మేయర్ కోనేరు శ్రీధర్, నిర్మాత నందమూరి రామకృష్ణ, సినీతారలు సన, అక్షిత, అపూర్వ, సినీనటుడు అజయ్, బుల్లితెర నటీమణి మహతి తదితరులు పాల్గొన్నారు.




