లైట్ హౌస్ సినీ మ్యాజిక్ పతాకంపై శివ శంకర రావు కంటగమనేని, కె. వెంకటేశ్వరరావు సంయుక్తగా నిర్మిస్తున్న `అక్కడొక్కడున్నాడు` చిత్రం ఆదివారం హైదరాబాద్ లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి లహరి ఎస్టేట్స్ అధినేత హరిబాబు క్లాప్ నివ్వగా, రవీందరరావు కెమెరా స్విచ్ఛాన్ చేశారు. నిర్మాత సి. కల్యాణ్ గౌరవ దర్శకత్వం వహించారు. రామ్ కార్తిక్, దీపిక హీరో, హీరోయిన్లగా నటిస్తున్నారు.
అనంతరం పాత్రికేయుల సమావేశంలో చిత్ర నిర్మాతలలో ఒకరైన వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, ` కథ కొత్తగా ఉంటుంది. కథ విన్నప్పుడు చాలా ఎగ్జైట్ గా ఫీలయ్యా. అందుకే సినిమా నిర్మాణానికి పూనుకున్నా. ప్రతీ పాత్ర ఆద్యంత ఆసక్తికరంగా ఉంటుంది. సింగిల్ షెడ్యూల్ లో సినిమా పూర్తి చేస్తాం. మిగతా పనులు కూడా పూర్తిచేసి వీలైనంత త్వరగా సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం` అని అన్నారు.
మరో నిర్మాత శివశంకరరావు మాట్లాడుతూ, ` గతంలో కొన్ని సినిమాల్లో నటించాను. కానీ మళ్లీ వ్యాపార రంగంలో బిజీ అవ్వాల్సి వచ్చింది. ఇప్పుడు మళ్లీ అక్కడొకడున్నాడు సినిమా తో రీ ఎంట్రీ ఇస్తున్నా. ఇందులో ఓ ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నా. పాత్ర చాలా వైవిథ్యంగా ఉంటుంది. తెలుగు లో ఇప్పటివరకూ ఇలాంటి కాన్సెప్ట్ తో ఎవ్వరు సినిమా చేయలేదు. అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే సినిమా అవుతుంది` అని అన్నారు.
చిత్ర దర్శకుడు శ్రీపాడ విశ్వక్ మాట్లాడుతూ, ` పొరపాటుకు- తప్పుకు మధ్య జరిగే సంఘర్షణే ఈ సినిమా. ప్రేమ అంటే అందాన్ని ఆకర్షించడం కాదు. వ్యక్తిత్వాన్ని ఆరాధించడం. ఇద్దరు ప్రేమికులు అనుకోకుండా విపత్కర పరిస్థితులకు లోనై స్వచ్ఛమైన ప్రేమ వారిని ఎలా కాపాడుతుందనే పాయింట్ పొరపాటు- తప్పుగా డివైడ్ చేసి చూపిస్తున్నాం. ప్రతీ పాత్రలను చక్కని ఎమోషన్ ఉంటుంది. ఆ భావోద్వేగాలను కన్వెన్సింగ్ గా చెబుతున్నా. టెక్నికల్ గా ను సినిమా హైలైట్ గా ఉంటుంది. మే 2 నుంచి 20 వరకూ కంటున్యూస్ గా షూటింగ్ చేస్తాం. తెలుగు ప్రేక్షకులందరికీ నచ్చే సినిమా అవుతుంది` అని అన్నారు.
హీరో రామ్ కార్తీక్ మాట్లాడుతూ, ` చక్కని కథా, కథనాలతో సినిమా తెరకెక్కుతుంది. మంచి పాత్ర పోషిస్తున్నా. సినిమాను అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నా` అని అన్నారు. సినిమాలో అవకాశం పట్ల హీరోయిన్ దీపిక ఆనందం వ్యక్తం చేసింది.
శివహనీష్, భరత్, ఆర్.ఎస్. నాయుడు, రాహుల్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: రాజా శేఖరన్.ఎన్, సంగీతం: సార్క్స్, లైన్ ప్రొడ్యూసర్: ప‌్రకాశ్ కె.కె, సహ నిర్మాతలు: బి.ఎన్. శ్రీధర్, కె. శ్రీధర్ రెడ్డి, రచన, దర్శకత్వం శ్రీపాడ విశ్వక్.