నందమూరి బాలకృష్ణ నటిస్తున్న 100వ సినిమా `గౌతమీపుత్ర శాతకర్ణి` ప్రారంభోత్సవం శుక్రవారం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో అంగరంగవైభవంగా జరిగింది. ఈ సినిమా పూజా కార్యక్రమాలలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొన్నారు. ముహూర్తపు సన్నివేశానికి చిరంజీవి కెమెరా స్విచ్ఛాన్ చేశారు. కేసీఆర్ క్లాప్‌నిచ్చారు. దాసరి గౌరవ దర్శకత్వం వహించారు. క్రిష్ దర్శకత్వం చేస్తున్న సినిమా ఇది. రాజీవ్ రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు కలిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని, సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యాన్ని, సాయిమాధవ్ బుర్రా మాటలను అందిస్తున్నారు.
కేసీఆర్ మాట్లాడుతూ ``మా అభిమాన నటుడు ఎన్టీఆర్. ఆయన తనయుడు తన 100వ సినిమా పట్ల గొప్ప నిర్ణయం తీసుకున్నారు. ఒక శకానికి నాంది పలికిన యుగ పురుషుడు కథతో తెరకెక్కుతున్న సినిమా ఇది. ఆయనకు ముందు మనం క్రీస్తు. పూర్వం, క్రీస్తు శకం అనే అనుకున్నాం. అయితే శాతవాహన చక్రవర్తి తర్వాత మనకంటూ ఓ శకం మొదలైంది. శాతవాహన కథావస్తువుతో తెరకెక్కుతున్న ఈ సినిమా పెద్ద విజయం కావాలి. అన్నగారి అభిమానిగా బాలకృష్ణను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఈ సినిమా 200 రోజులు ఆడాలి. అన్ని తరాల తెలుగు ప్రజలు చూసి తెలుసుకోవాలి. ఒకప్పుడు మనల్ని మదరాసీయులు అనేవారు. కానీ తెలుగుజాతికి గుర్తింపు తెచ్చిన ఘనత ఎన్టీఆర్‌గారిది. ఎన్టీఆర్ అందరి హృదయాల్లో ఉంటారు. తెలుగు జాతి గర్వించదగిన బిడ్డ ఆయన. ఇటీవల ఎన్టీఆర్ గార్డెన్స్ లో అంబేద్కర్ విగ్రహం పెడుతున్నప్పుడు కొంతమంది వివాదం చేశారు. అయితే ఎన్టీఆర్ గార్డెన్స్ ఎప్పుడూ ఎన్టీఆర్ గార్డెన్స్ గానే ఉంటుంది. ఎన్టీఆర్ కుటుంబం గురించి తెలియని తెలుగువాడు లేడు. ఆయన్ని ప్రతి ఒక్కరూ గుండెల్లో పెట్టుకుంటారు. ఈ సినిమా పెద్ద హిట్ కావాలి. సినిమాను చూసే తొలి బ్యాచ్‌లో నేను కూడా ఉంటాను. ఫ్యామిలీతో చూస్తాను`` అని అన్నారు.
వెంకటేష్ మాట్లాడుతూ ``ఈ సినిమా 200 రోజులు 1000 థియేటర్లలో ఆడాలి`` అని చెప్పారు.
చిరంజీవి మాట్లాడుతూ ``మైలురాయిలాంటి కథతో చేస్తున్న ఈ సినిమా చిరస్థాయి విజయాన్ని దక్కించుకోవాలి. దర్శకుడు క్రిష్‌ని, ఆయన చెప్పిన కథని ఒప్పుకున్నప్పుడే బాలకృష్ణ సక్సెస్ అయ్యారు. తెలుగులో చారిత్రక సబ్జెక్టులను తెరకెక్కించగల దర్శకుల్లో క్రిష్‌కి మంచి పేరుంది. ఇటీవల వరల్డ్ వార్ 2 నేపథ్యంలో ఆయన తీసిన కంచె అందుకు నిదర్శనం. హాలీవుడ్ స్టాండర్డ్స్ లో ఆయన ఆ సినిమాను తీశారు. క్రిష్ ఆథంటిసిటీతో సినిమా చేస్తాడు. బాలయ్య శాతకర్ణి పాత్రలో ఒదిగిపోయి అలరిస్తాడు. ఇలాంటి పాత్రలు చేయడం బాలయ్యకి కేక్‌వాక్‌లాంటిది. 100 రోజులు ఆడటం గగనమవుతున్న ఈ రోజుల్లో ఈ సినిమా సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ ఆడి చిత్రరాజంగా మిగిలిపోవాలి`` అని చెప్పారు.
దాసరి నారాయణరావు మాట్లాడుతూ ``బాలయ్య చరిత్రలో నిలిచిపోయే కథతో సినిమా చేస్తున్నారు. తొలి తెలుగు చక్రవర్తి కథతో ఆయన చేస్తున్న ఈ 100వ సినిమా పెద్ద హిట్ కావాలి. తెలుగు జాతి గర్వించే విషయం ఇది. ఇవాళ్టి మన ఉగాది పచ్చడి గౌతమీపుత్ర శాతకర్ణితో మొదలైంది. అలాంటి వ్యక్తి కథతో ఈ సినిమా తెరకెక్కుతుండటం ఆనందదాయకం. జానపదం, సోషల్, యాక్షన్, సెంటిమెంట్, ఏదైనా చేయగలడు బాలకృష్ణ. ఆయనకు ఈ సినిమా పెద్ద హిట్ కావాలి. ఈ చిత్రం చరిత్ర సృష్టించాలి`` అని అన్నారు.
నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ ``అనుకోవడానికి ఇది 100వ సినిమా కావచ్చు. ఎన్నో విభిన్నమైన పాత్రలు చేసిన నాకు కాకతాళీయంగానో, యాదృచ్ఛికంగానో ఈ కథ వచ్చింది. వినగానే నచ్చింది. ఎప్పుడైనా కొత్తదాన్ని ఆస్వాదించే తత్వం నాకు నాన్నగారి నుంచి అలవాటైంది. ఆయన వారసుడిగా వైవిధ్యమైన సినిమాల్లో నటించాలన్నది నా తపన. తెలుగు శకం మొదలైంది గౌతమీపుత్ర శాతకర్ణితోనే. మనకున్నది రెండు కాలమానాలు. ఒకటి క్రీస్తు కాలమానం. రెండోది శాతవాహన శకం. గౌతమీపుత్ర శాతకర్ణి అనేది చాలా మందికి తెలియని పాత్ర. కోటిలింగాలు ఆయనకు తల్లిగారి ఊరు. అమరావతిని పాలించారు. అమరావతిలో బౌద్ధవాజ్ఞయానికి ప్రాణ ప్రతిష్ట చేశారు. నాగార్జునుడు తిరిగిన నేల అది. 33 మంది రాజులను ఓడించిన చక్రవర్తి శాతకర్ణి. మేం ఈ సినిమా కోసం చాలా కసరత్తులు చేస్తున్నాం. ఎంతోమంది ప్రముఖులను సంప్రతిస్తున్నాం. ఇంకా కథ గురించి చర్చిస్తున్నారు. నాకూ శాతకర్ణికి చాలా పోలికలున్నాయి. అనుకున్నది చేయడమే మాకు తెలుసు. ఆశయం, ఆవేశం ఉన్నవాడు శాతకర్ణి. నేనూ అంతే. ఎందుకంటే ఆశయం లేనివాడికి విలువ లేదు. ఆవేశం లేనివాడు మనిషి కాడు. నాకు నేను నచ్చకపోయినా ఇంకొకడికి నచ్చేలా ఉంటే ఫలితం ఉండదు. ఈ విషయంలో నేనూ, శాతకర్ణి ఒకేలా ఉంటాం. 1973లో మా నాన్నగారు నా నుదుట తిలకం దిద్దారు. దాదాపు 43 ఏళ్లు అప్రతిహతంగా సాగుతున్నా. 99 సినిమాలు చేస్తే 71 శతదినోత్సవాలను జరుపుకున్నాయి. మా తల్లిదండ్రుల దీవెన, నా ఆత్మబలం, అభిమానుల అభిమానమే ఇంతటికీ కారణం. నా ఈ ప్రయాణంలో ఎంతో మంది నాతో పాటు నడిచారు. మా నిర్మాతలకు, దర్శకులకు, హీరోయిన్లకు అందరికీ ధన్యవాదాలు. తెలుగువారందరికీ ఈ 100వ చిత్రం అంకితం. తల్లులందరికీ అంకితం. ఈ సినిమా`` అని అన్నారు.
క్రిష్ మాట్లాడుతూ ``గొప్ప కథను తీసుకెళ్లిన మరుక్షణం నుంచి నన్ను నడిపిస్తున్న బాలయ్యబాబుకు ధన్యవాదాలు`` అని అన్నారు.
రాజీవ్ రెడ్డి మాట్లాడుతూ ``అందరూ బాలయ్యగారు మాకు మంచి అవకాశాన్ని ఇచ్చారని అంటున్నారు. కానీ ఇది అవకాశం కాదు. గొప్ప బాధ్యత`` అని చెప్పారు.
ఈ కార్యక్రమంలో రాఘవేంద్రరావు, సింగీతం శ్రీనివాసరావు, కోదండరామిరెడ్డి, విజయేంద్రప్రసాద్, తమ్మారెడ్డి భరద్వాజ, తలసాని శ్రీనివాసయాదవ్, ఎన్.శంకర్ తదితరులు పాల్గొన్నారు.